దిగ్గజ టెలికం కంపెనీలైన, కుమార మంగళం బిర్లాకు చెందిన ఐడియా, బ్రిటిష్ సంస్థ వొడాఫోన్.. ఇక ఒక్కటిగా పనిచేయబోతున్నాయి. ఇటీవల భారతీ ఎయిర్‌టెల్-యూనినార్ కలిసిపోయిన విషయం తెలిసిందే! ఇప్పుడు ఇదే బాటలో ఐడియా, వొడాఫోన్ సంస్థలు కూడా చేతులు కలిపాయి. మరి వీటి కలయిక వల్ల కస్టమర్లకు ఎటువంటి సేవలు అందబోతున్నాయి? వారి పరిస్థితి ఏంటి? వారు ఏవిధంగా లాభపడబో తున్నారు? అనే ప్రశ్నలు సహజంగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం!
గత ఏడాది నుంచి చర్చలు
గత ఏడాది నుంచి ఐడియా, వొడాఫోన్ కంపెనీల మధ్య జరుగుతున్న చర్చలు ఈ ఏడాది జులై నాటికి తుది దశకు చేరుకున్నాయి. ఈ కంపెనీల కలయికకు టెలీ కమ్యూనికేషన్ శాఖ కూడా అనుమతి ఇచ్చేసింది. దీంతో జూలై చివరి నుంచి ఒక్కటిగా ఐడియా-వొడాఫోన్ సేవలు అందించబోతు న్నాయి. సబ్‌స్క్రైబర్లు, రెవెన్యూ మర్కెట్ పరంగా ఈ భాగస్వామ్యం దేశంలోనే అతి పెద్దదిగా భావిస్తున్నారు.
* ఈ రెండు సంస్థలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ఉండటంతో.. నిస్సందేహంగా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు సంస్థల కలయికతో.. దేశంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు గల ఒక పెద్ద టెలికాం సంస్థ ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకుని నిలబడేందుకు రెండు కంపెనీల క్యాష్ రివర్వ్, ఎయిర్‌వేవ్స్, వైర్‌లెస్ అసెట్స్ వంటివి మరింత శక్తిని ఇస్తాయి.
* ఈ రెండు సంస్థలకు అధిక సంఖ్యలో టవర్ల ఉన్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ఈ రెండూ కలిసిపోవడంతో దేశ వ్యాప్తంగా నెట్‌వర్క్‌ను మరింతగా విస్తృతం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇతర సంస్థలతో పోల్చితే.. సబ్‌స్క్రైబర్లు, రెవెన్యూ మార్కెట్ షేర్ వంటి అంశాల్లో కొత్తగా ఏర్పడే సంస్థే ముందడుగులో ఉంది.
* మరింత ఆకర్షణీయమైన ధరలకే వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ ద్వారా మెరుగైన సర్వీసులు అందుతాయి. ప్రస్తుతం ఈ రెండింటికీ ఉన్న క్యాష్ రిజర్వ్ ద్వారా.. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై అధికంగా పెట్టుబడి పెట్టి.. మరిన్ని కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి విడుదల చేయవచ్చు. కన్జూమర్ కేంద్రంగా మరిన్ని సర్వీసులు ప్రవేశపెట్టొచ్చు.
* ఈ రెండు కంపెనీల కలయిక వల్ల ధరలు, టెలికాం సెక్టార్లో స్థిరత్వం ఏర్పడుతుందని టెలికాం కమిషన్ అభిప్రాయపడింది. ఇప్పటికే ధరలు ఆకాశాన్ని తాకేలా ఉంటున్న విషయం తెలిసిందే! వీటిని స్థిరీకరించాల్సిన సమయం వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మూడు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు, ఒక పబ్లిక్ టెలికాం సంస్థ ఇప్పుడు శాసిస్తున్న తరుణంలో.. ఇప్పుడు ధరలు స్థిరమైన దశకు చేరుకుంటాయని ఆశించవచ్చు.
* వొడాఫోన్ ఐడియా లిమిటెడ్.. ఇప్పుడు డిజిటల్ సర్వీసెస్‌పై మరింత దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి. టెలికాం ఇండస్ట్రీ ప్రస్తుతం.. ఐటీ సెక్టార్‌తో ఇంటర్‌సెక్షన్ అవుతున్న సమయంలో కంటెంట్ ప్రొవిజన్ ఏరియాపై ఫోకస్ పెట్టొచ్చు.