• తాజా వార్తలు

ట్రాయ్ నుంచి టీవీ యూజర్లకు గుడ్ న్యూస్, గడువు మరింత పొడిగింపు


కొత్త టారిఫ్ విధానంలో తమకు నచ్చిన ఛానళ్లు ఎంచుకోవడానికి.. టెలికం రెగ్యులెటరీ అథారిటీ - ట్రాయ్ మరోసారి గడువు పొడిగించింది. గతంలో జనవరి 31 వరకు ఉన్న గడువును మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఛానళ్ల ఎంపికలో తర్జనభర్జన పడుతూ.. టారిఫ్ ఎంచుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఊరట లభించినట్లైంది. వినియోగదారుల ఛాయిస్ మేరకు బెస్ట్ ఫిట్ ప్లాన్ రూపొందించాలని ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది . ట్రాయ్‌ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 100 మిలియన్ల కేబుల్‌ సర్వీసులు, 67మిలియన్ల డీటీహెచ్‌ సర్వీసులు ఉన్నాయి.

ఛానళ్లను ఎంచుకోవడంలో కొందరు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక కేబుల్‌ ఆపరేటర్లు ఛానళ్ల ఎంపిక విషయంలో వినియోగదారులకు అవగాహన కల్పించకపోవడంతో ఇటువంటి ఇబ్బంది తలెత్తుతుందని ట్రాయ్‌ వెల్లడించింది. ఛానళ్లు ఎంపిక చేసుకునేందుకు పాత ప్లాన్‌ కొనసాగుతోందని ట్రాయ్‌ తెలిపింది. కొత్త టారిఫ్ ఎంపికకు ఇంతకుముందు ట్రాయ్ జనవరి 31 వ తేదీని తుది గడువుగా విధించింది . కొత్త టారిఫ్ ఎంచుకోనివారికి ఫిబ్రవరి 1 నుంచి కొన్ని ఛానళ్లు ప్రసారం కావడం లేదు. దీంతో మరింత అయోమయానికి గురవుతున్నారు వినియోగదారులు. ఈ నేపథ్యంలో కొత్త టారిఫ్ ఎంచుకోవడానికి మార్చి 31వ తేదీ వరకు మరోసారి గడువు పెంచింది ట్రాయ్. 

బెస్ట్‌ ఫిట్‌ ప్లాన్‌ కింద వినియోగదారులు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంపిక చేసుకోవడంలో ఎక్కువ మంది విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపికకు గడువును పొడిగించినట్లు ట్రాయ్‌ తెలిపింది. మార్చి 31లోపు ఎప్పుడైన వినియోగదారులు బెస్ట్‌ ఫిట్‌ ప్లాన్‌ కిందకు మారవచ్చు. బ్రాడ్‌క్యాస్ట్‌, కేబుల్‌ సేవల విభాగంలో ట్రాయ్‌ నూతన విధానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో వినియోగదారులు తమకు కావాల్సిన ఛానళ్లను మాత్రమే సబ్‌స్క్రైబ్‌ చేసుకుని చూడాల్సి ఉంటుంది. పన్నులతో కలిపి రూ.130కే 100 ఛానళ్లను వినియోగదారులు పొందవచ్చు. ఏయే ఛానళ్లను చూడాలనుకుంటున్నారో తమ సర్వీసు ప్రొవైడర్‌కు చెప్పాల్సి ఉంటుంది. ఆపైన కావాల్సిన ప్రతి ఛానల్‌కు నిర్ణయించిన ధరను చెల్లించాలి.

వినియోగదారుల్లో అవగాహనలోపం, కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యం తదితర కారణాలతో కొత్త టారిఫ్ పై వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనేది ట్రాయ్ వాదన. కాగా టీవి ఛానళ్ల ప్యాక్ సెలెక్ట్ చేసుకోవడానికి మరింత గడువు దొరకడంతో వినియోగదారులకు ఊరట దొరికినట్లైంది. దేశవ్యాప్తంగా టీవి వినియోగదారులను కొత్త టారిఫ్ విధానంలోకి తీసుకురావాలన్న ట్రాయ్ ప్రయత్నాలు ఈసారైనా ఫలిస్తాయో లేదో చూడాలి.
 

జన రంజకమైన వార్తలు