రిలయన్స్ జియోపై టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కి వొడాఫోన్ ఫిర్యాదు చేసింది. ట్రాయ్ వద్దని చెప్పినా కూడా జియో తన ‘సమ్మర్ సర్‌ప్రైజ్’ ఆఫర్‌ను ఇంకా కొనసాగిస్తోందని... ఇది నిబంధనలకు విరుద్ధమని వొడాఫోన్ తన ఫిర్యాదులో పేర్కొంది. సమ్మర్ సర్‌ప్రైజ్ పేరిట తెచ్చిన ‘కాంప్లిమెంటరీ సర్వీస్ ఆఫర్’ను ఆపేయాలని రిలయన్స్ జియోకు ట్రాయ్ ఇప్పటికే చెప్పినది తెలిసిందే. దీన్ని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ ధ్రువీకరించారు కూడా.. నిబంధనలకు విరుద్ధంగా ఉందని జియోకు చెప్పినట్లు ఆయన ప్రకటించారు.
ట్రాయ్ ఏం చెప్పింది..
నిజానికి గత నెల మార్చి 31తోనే జియో 4జి ఉచిత డేటా, కాల్స్ సేవల గడువు ముగిసినప్పటికీ, విపరీతమైన స్పందనతో సర్వర్లు డౌన్ అయ్యాయంటూ, 99 రూపాయల సభ్యత్వాన్ని చాలామంది చేసుకోలేకపోయారని ఈ నెల 15 వరకు ప్రైమ్ ఆఫర్ సభ్యత్వ నమోదుకు జియో గడువును పెంచింది. 99 రూపాయల సభ్యత్వ రుసుముతోపాటు 303 రూపాయలతో రీచార్జ్ చేసుకున్నవారికి జూలై 31 వరకు ఉచితంగా డేటా, కాల్స్ సేవలు అందుతాయని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో అంతకుముందే ప్రకటించింది. ఇది పారదర్శకంగా లేదంటూ ఈ ఆఫర్ గడువు పెంపును ఉపసంహరించుకోవాలని జియోను ట్రాయ్ గత గురువారం ఆదేశించింది.
జియో ఏం హామీ ఇచ్చింది
దీనిపై స్పందించిన జియో, ఈ ఆఫర్ ను నిలిపేస్తామని, అయితే అప్పటిదాకా రీచార్జ్ చేసుకున్నవారికి ఈ నాలుగు నెలలు ఉచిత సేవలు అందుతాయని స్పష్టం చేసింది. అయితే... జియో అలా చెప్పినా అమలు చేయడం లేదని, ఆఫర్ అమ్మకాలు కొనసాగుతున్నాయని వొడాఫోన్ ట్రాయ్‌కి ఫిర్యాదు చేసింది. మరోవైపు టెలికామ్ ట్రిబ్యునల్ టిడిశాట్.. సోమవారం జియో ఆఫర్ కేసు విచారణను ఈ నెల 20కి వాయదా వేసింది. ముందుగా ప్రకటించిన 90 రోజులకు మించి ఉచిత 4జి సేవలను మార్చి 31దాకా జియో పొడిగించడంపై భారతీ ఎయర్‌టెల్, ఐడియా సెల్యులార్ టిడిశాట్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.