టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్), యాపిల్ కంపెనీ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుతోంది. స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు కళ్లెం వేసేందుకు ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఆసక్తికర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ట్రాయ్ నిబంధనలు పాటించేది లేదని యాపిల్ స్పష్టం చేస్తుండటంతో ఈ ప్రభావం యాపిల్ యూజర్లపై పడేలా కనిపిస్తోంది. ఒకవేళ ఐఫోన్ ట్రాయ్ ఆదేశాలు పాటించకపోతే.. దేశంలో ఐఫోన్‌లలో ఏ సిమ్ నెట్‌వర్క్ పని చేయకుండా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఇవీ ట్రాయ్ నిబంధనలు
టెలీకాం కమర్షియల్ కమ్యునికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్-2018ని ట్రాయ్ గురువారం విడుదల చేసింది. ఇందులో స్పామ్ కాల్స్, మెసేజ్‌ల కట్టడికి తీసుకోవాల్సిన నిబంధనలను వివరించింది. ఇందులో భాగంగా ఈ కాల్స్, మెసేజ్‌లు రాకుండా ప్రతి ఒక్కరూ ఒక యాప్‌ను తీసుకురావాలి. ఆరు నెలల్లో ఇటువంటి యాప్‌ను తీసుకురావాలి. ఒకవేళ ఏ కంపెనీ అయినా ఇలాంటి యాప్‌ని రూపొందించని పక్షంలో.. ఆ కంపెనీ వోఎస్ ఉపయోగించే ఫోన్లలో నెట్‌వర్క్ నిలిపివేస్తామని ట్రాయ్ స్పష్టంచేసింది. ఒకవేళ యాపిల్ కనుక ఈ యాప్ తీసుకురాకపోతే.. యాపిల్ ఫోన్‌లో ఏ సిమ్ వేసినా పనిచేయదు.
యాపిల్ ఏం చెబుతోంది
గూగుల్ ప్లే స్టోర్‌లో డునాట్ డిస్ట్రబ్ యాప్ అందుబాటులో ఉంది. ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా డీఎన్‌డీ నిబంధనలను అతిక్రమించి కాల్స్, మెసేజ్‌లు పంపితే వారిపై ఫిర్యాదు చేసే సదుపాయం ఈ యాప్‌లో ఉంటుంది. ఇలాంటి యాప్‌నే ఐవోఎస్ ఓఎస్‌లోనూ పనిచేసేలా రూపొందించాలని యాపిల్‌ను ట్రాయ్ కోరింది. అయితే, థర్డ్ పార్టీ యాప్స్ వల్ల తమ యూజర్ల మెసేజ్‌లు, కాల్స్ యాక్సెస్ చేస్తే, అది వారి వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించినట్లేనని యాపిల్ వాదిస్తోంది. అందుకే థర్డ్ పార్టీ యాప్ రూపొందించేందుకు యాపిల్ ససేమిరా అంటోంది. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుందని, వీటి వల్ల ప్రైవసీకి భంగం కలుగుతుందని స్పష్టంచేస్తోంది. అందుకే తాము ఇటువంటి యాప్‌ను తీసుకురాలేమని వివరిస్తోంది.
గత ఏడాదిలోనే వార్
యాపిల్, ట్రాయ్ మధ్య వార్ గత ఏడాది సెప్టెంబర్‌లో మొదలైంది. ట్రాయ్ తీసుకొచ్చిన యాంటీ స్పామ్ యాప్‌ను యాపిల్ తిరస్కరించింది. దీనిని తీసుకొస్తే.. దేశంలో ఎక్కువ మొబైల్స్ అమ్మేందుకు తామ కంపెనీ చేస్తున్న ప్రయత్నాలను ఇది దెబ్బతీస్తుందని తెలిపింది. అంతేగాక ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా తాము యాప్‌ను రూపొందిస్తామని తెలిపింది. ఐవోఎస్ 11లో స్పామ్ మెసేజ్‌లను ఫిల్టర్ చేసేందుకు యాప్‌ను తీసుకొచ్చింది. కాల్స్ విషయంలో మాత్రం ఎలాంటి ఆప్షన్ తీసుకురాలేదు. ఇక ఐవోఎస్ 12తో ఈ లోటు భర్తీ అవుతుందని తెలిపింది. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాయ్ చీఫ్ ఆర్ఎస్ శర్మ గతంలో తెలిపారు.
థర్డ్ పార్టీ యాప్స్ తీసుకొచ్చినా..
ప్రస్తుతం యాపిల్ iOS 10లో CallKit, iOS 11, iOS 12లో SMS filtering వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇవన్నీ స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఐవోఎస్ 12 వెర్షన్‌లోనూ కొన్ని మార్పులు చేశామని. దీంతో మెసేజ్, స్పామ్‌కాల్స్‌పై ఫిర్యాదు చేయవచ్చని యాపిల్ చెబుతోంది. అయితే ట్రాయ్ మాత్రం తప్పనిసరిగా యాప్ తీసుకుకురాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.