టెక్నాలజీ ఎంత వేగంగా డెవలప్ అవుతుందో అంతకు రెట్టించిన వేగంతో సైబర్ క్రైమ్ కూడా కోరలు చాస్తోంది. మన వేలితో మన కన్నే పొడిచినట్టు సౌలభ్యం కోసం మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీనే వాడి మనల్ని దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. రోజుకో కొత్త పద్ధతిలో సైబర్ మోసాలు వెలుగు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ ( C-DAC), హైదరాబాద్ సైబర్ క్రైమ్ నియంత్రణ మీద ఫోకస్ చేసింది. ప్రజల్లో దీనిమీద అవగాహన కల్పించేందుకు ఓ పోర్టల్‌ను, కంప్లయింట్స్ చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రారంభించింది. చెన్నై పోలీసులతో కలిసి చెన్నైలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సీడాక్ ప్రాజెక్ట్ మేనేజర్ ఐఎల్ నరసింహరావు ఈ విషయాన్ని ప్రకటించారు.
రోజుకు 15 కేసులు
చెన్నైలో రోజుకు 15కి పైగా సైబర్ క్రైమ్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఇందులో ఎక్కువశాతం బ్యాంకింగ్ మోసాలు, క్రెడిట్ కార్డ్స్ మోసాలు, ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసే కేసులు, పాస్‌వర్డ్ దొంగతనాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉంటున్నాయని సీడాక్ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో టోల్‌ఫ్రీ నెంబర్ 1800-425-6235 ఏర్పాటు చేశారు. దీనికి ఫోన్ చేసి కంప్లయింట్ చేయొచ్చు. అలాగే ఓ పోర్టల్‌ను కూడా స్టార్ట్ చేశారు.
ఈ జాగ్రత్తలు పాటించండి
మనం టెక్నాలజీ వాడి దొంగ చేతికి తాళాలిస్తున్నాం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్లు ఉన్నదంతా ఊడ్చేస్తారు. ముఖ్యంగా క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా వాడాలి. సీవీవీ నెంబర్, ఎక్స్‌పైరీ డేట్ మీద స్టిక్కర్ అతికించుకుంటే మంచిదని సీడాక్ చెప్పింది.