అంబాజీపేట నుంచి అమెరికా దాకా ఇప్పుడంతా కరోనా గోలే. ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా వైరస్ అంటుకుంటుదేమోనన్న భయమో.. ఇంతకుముందు మనం ఎప్పుడూ చూడనంత భయాన్ని కరోనా తెచ్చిపెట్టింది. అయితే కరోనా బారినపడి కోలుకున్నవారు వారి ప్లాస్మాతో సీరియస్ కరోనా పేషెంట్లను కాపాడవచ్చు. ఇదిగో ఇక్కడే మన సైబర్ నేరగాళ్లు చేతికి పనిచెప్పేస్తున్నారు. ప్లాస్మా దానం పేరిట కరోనా రోగుల జేబులు గుల్లచేస్తున్నారు.
ఇలా చేస్తున్నారు
చాలామంది కేటుగాళ్లు దీనికి సోషల్ మీడియానే వాడుకుంటున్నారు. మేం కరోనాను గెలిచాం.. ప్లాస్మా దానం చేసి మరికొంతమంది కొవిడ్ రోగులను బతికించాలనుకుంటున్నాం అని ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పోస్టులు పెడుతన్నారు. మాకేం డబ్బులు అక్కర్లేదు. జస్ట్ ట్రావెలింగ్ ఖర్చులు మీరు పెట్టుకుంటే చాలు అని నమ్మిస్తున్నారు. ట్రావెలింగ్ కోసం కొంత అమౌంట్ వేయమని గూగుల్ పే, ఫోన్ పేలాంటి అకౌంట్ల ద్వారా డబ్బులు వేయించుకుని తర్వాత ఫోన్ ఎత్తడం లేదు. లేదంటే సిమ్ మార్చడమో, ఫోన్ స్విచాప్ చేయడమో చేస్తున్నారు.
ఒక్కడు 200 మందిని మోసం చేశాడు
శ్రీకాకుళానికి చెందిన ఓ యువకుడు ప్లాస్మా దానం చేస్తానంటూ ఇలా ఏకంగా 200 మందికి పైగా మోసం చేశాడని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. బీకేర్‌ఫుల్. ప్లాస్మా కావాల్సి వస్తే పోలీసులు, ప్రభుత్వం, వాలంటరీ ఆర్గనైజేషన్ల ద్వారా ప్రయత్నించండి. లేకపోతే మోసగాళ్లుంటారు.