ప్రపంచం ఇప్పుడు ఉగ్రవాదుల దాడులతో అట్టుడుకుతోంది. ప్రపంచంలో ఏమూల చూసినా ఏదో ప్రతిరోజూ ఏదో ఒక టెర్రర్ దాడి జరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో ఫ్రాన్స్ మీద జరిగిన ఉగ్ర దాడులను ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల దాడుల గురించి హెచ్చరించే ఒక యాప్ తయారైంది. ఇటీవల ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొన్న ఫ్రాన్స్ ప్రభుత్వమే ఈ యాప్‌ను తయారు చేయించడం విశేషం. 2016 యూరో ఫుట్‌బాల్ టోర్నీని దృష్టిలో ఉంచుకుని ఫ్రాన్స్ ఈ యాప్‌ను రూపొంగించింది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు టెర్రర్ అటాక్స్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించడం ఈ యాప్ ప్రత్యేకత. భద్రత, నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలున్న ఏరియాల గురించి ఈ యాప్ ముందుగానే ఈ యాప్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో దొరికే ఈ యాప్‌ను ఉచితంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐతే కేవలం ఉగ్ర దాడుల గురించి సమాచారం ఇవ్వడంతో పాటు వరదలు ఇతర విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను వెంటనే హెచ్చరించడానికి, వారికి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది. ఒక సంఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ యాప్ అలెర్ట్స్‌ను రిలీజ్ చేస్తుంది. సంఘటన జరిగిన ప్రదేశం యూజర్‌కు ఎంత దగ్గరలో ఉందో, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ యాప్ వివరిస్తుంది. ఎనిమిది జియోగ్రాఫికల్ జోన్లకు సంబంధించిన అలెర్ట్స్‌ను యూజర్లు తెలుసుకోవచ్చు. దీని వల్ల కుటుంబ సభ్యులను, స్నేహితులను అలెర్ట్ చేయడానికి ఈ యాప్ ఎంతో సాయం చేస్తుంది. నవంబర్ 2015లో ఫ్రాన్స్‌లో ఉగ్రవాదుల దాడులు జరిగిన తర్వాత ఈ యాప్‌కు రూపకల్పన జరిగింది. ప్రధానమంత్రి మన్యయిల్ వాల్స్ ఈ యాప్‌ను రూపొందించే దిశగా ప్రోత్సాహం అందించారు. ఈ యాప్ ప్రజలు రక్షణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది. యూరో కప్ సందర్భంగా స్టేడియాలపై ఉగ్ర దాడులు జరిగే అవకాశాలున్నాయన్న బ్రిటన్ హెచ్చరికల నేపథ్యంలో ఫ్రాన్స్ రక్షణ కోసం సాంకేతికతను ఉపయోగించాలని నిర్ణయించింది. |