కస్టమర్ ప్రైవసీ కి పెద్దపీట వేస్తున్న ఆపిల్ మిమ్మల్ని ఎవరైనా మీ కుటుంభ సభ్యుల వివరాలు చెప్పమని అడిగారనుకోండి. మీరు వెంటనే చెప్పేస్తారా? మీకు ఎందుకు? వాటితో మీకేం పని ? అని సవా లక్ష ప్రశ్నలు వేస్తారు. అదే వివరాలు చెప్పమని కోర్ట్ నుండి ఆదేశాలు వచ్చాయి అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు. మీరు తెలివైన వారైతే వాటి అవసరం ఏమిటో లాయర్ ద్వారా సంప్రదిస్తారు. లేకపోతే వెంటనే ఇచ్చేస్తారు. ఆ మధ్య మన రెండు తెలుగు రాష్ట్రాలలో నోటుకు ఓటు కేసు వ్యవహారం లో ఎయిర్ టెల్ తదితర టెలికాం కంపెనీలను కాల్ డేటా అడిగినపుడు అవి వెంటనే ఇవ్వకుండా చట్టప్రకారం వ్యవహరించాయి. కానీ అదేమిటో గానీ ఆండ్రాయిడ్ వినియోగదారుల వివరాలు ఇవ్వవలసినదిగా గూగుల్ ను అడిగినపుడు ఏ మాత్రం ఆలోచించకుండా సుమారు 70 శాతం మంది వినియోగదారుల వివరాలను ఇచ్చేసింది. దీనికి సంబందించిన వార్తను అప్పుడు మన వెబ్ సైట్ లో ప్రచురించడం కూడా జరిగింది. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన ఆపిల్ తన వినియోగదారుల వివరాలను ఇవ్వనని కోర్టు కు తెగేసి చెప్పింది. గత సంవత్సరం డిసెంబర్ లో ఉగ్రవాద దంపతులైన సయ్యద్ ఫరూక్ మరియు తష్ఫీన్ మాలిక్ లు కాలిఫోర్నియా లో దాడులకు తెగబడి 14 మంది ప్రాణాలను బలిగొన్నారు. ఆ తర్వాత వారు కూడా తూటాలకే బలయిన విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే వారు ఈ దాడులకు తెగబడే ముందు ఆపిల్ ఫోన్ లను ఉపయోగించినట్లు విచారణలో తెల్సింది. కాబట్టి వారిద్దరూ ఫోన్ లను అన్ లాక్ చేసి వారి వివరాలను వెల్లడించవలసిన్డిగా ఆపిల్ ను FBI కోరింది. అయితే ఆపిల్ దీనికి నిరాకరించడం తో FBI కోర్టు ను ఆశ్రయించింది. వారి ఫోన్ ను అన్ లాక్ చేసి వివరాలు వెల్లడించవలసిందిగా US మేగిస్త్రాటే జడ్జి అయిన శేరి పిం ఆపిల్ ను ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను కూడా ఆపిల్ ceo అయిన టిం కుక్ తిరస్కరించారు. అంతేగాక తమకు కోర్టు ఆదేశాల కంటే కస్టమర్ ల ప్రైవసీ నే ముఖ్యమని కుండ బద్దలుకొట్టి చెప్పారు. ప్రభుత్వాల మాట వినకపోతే తమ కంపెనీలకు ఇబ్బందులు ఎదురవుతాయి ఏమో అని చాలా కంపెనీలు భయపడే ఈ రోజుల్లో కస్టమర్ ప్రైవసీకి ఆపిల్ ఇంత ప్రాధాన్యం ఇవ్వడం కోర్టును ధిక్కరించడం టెక్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. |