డిజిటల్ సెక్యూరిటీలో పేరుగాంచిన జెమాల్టో సంస్థ ప్రపంచవ్యాప్తంగా డాటా బ్రీచింగ్ ఏ స్థాయిలో ఉందన్నది వెల్లడించింది. సైబర్ క్రైమ్ ట్రెండ్స్ ను కూడా తెలిపింది. ప్రభుత్వ శాఖలు, బ్యాంకులకు సంబంధించిన విలువైన సమాచారంతో పాటు వ్యక్తులకు సంబంధించిన డాటా కూడా గల్లంతయిన ఘటనలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సమాచార దుర్వినియోగం వివరాలు చెబుతూ డాటా బ్రీచింగ్ ఇండెక్సును రూపొందించింది.
కాగా అత్యధికంగా ఆర్థిక సమాచారమే గల్లంతవుతున్నట్లు ఈ నివేదికలో వెల్లడించారు. మొత్తం డాటా బ్రీచింగ్ లో ఫైనాన్షియల్ డాటా బ్రీచింగ్ 73 శాతం ఉందంటే సైబర్ నేరగాళ్లు దీన్ని ఎంతగా టార్గెట్ చేశారన్నది అర్థమవుతోంది.
అంతేకాదు.. ఎన్ క్రిప్షన్, యాంటీ వైరస్ వంటివేవీ డాటా బ్రీచింగ్ ను ఆపలేకపోతున్నాయని జెమాల్టో నివేదికలోని సమాచారం తేటతెల్లం చేసింది.
ఇండియాలోనూ గత ఏడాది భారీ డాటా బ్రీచింగ్ జరిగినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సంబంధించిన లక్షలాది మంది డెబిట్ కార్డుల సమాచారం తస్కరణకు గురయినట్లు అప్పట్లో బ్యాంకు వర్గాలే వెల్లడించాయి. డాటా తస్కరణ జరిగినట్లు గుర్తించి లక్షల మందికి చెందిన డెబిట్ కార్డులను స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్లాక్ చేసింది. ప్రతి ఖాతాదారు తప్పనిసరిగా పిన్ నంబర్లు, ఆన్ లైన్ బ్యాంకింగ్ పాస్ వర్డులు మార్చుకోవాలని సూచించింది.
అలాగే కేరళలో 3.4 కోట్లమందికి చెందిన సున్నితమైన సమాచారాన్ని కూడా సైబర్ నేరగాళ్లు తమ చేతికి చిక్కించుకున్నారు. ఇది కూడా అప్పట్లో సంచలనంగా మారింది. కాగా డాటా లీకేజీ, డాటా గల్లంతు కావడంలో ఒక్కోసారి పొరపాటున పోగొట్టుకున్న డాటా కూడా ఉంటోంది. హ్యాకర్ల దాడి వల్ల డాటాకు నష్టం కలుగుతుండడమే కాకుండా కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు, తిరుగుబాటు సంస్థలు, ఉగ్రవాద సంస్థలు కూడా డాటాను అక్రమ పద్ధతుల్లో సేకరిస్తున్నాయి.
ఎక్కువగా ప్రభుత్వాలకు సంబంధించిన సమాచారం, ఆర్థిక సంస్థలకు సంబంధించినది... హెల్త్ కేర్ సెక్టారు, రిటైల్ ఇండస్ర్టీతో పాటు టెక్నాలజీ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని కొల్లగొట్టేందుకు హ్యాకర్లు గట్టి ప్రయత్నాలే చేశారట. అందులో కొన్ని సఫలం కాగా కొన్ని మాత్రం విఫలమయ్యాయి. కాగా డాటా బ్రీచింగ్ ఎక్కువగా ఉత్తర అమెరికా దేశాల్లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన డాటా బ్రీచింగ్ లో 74 శాతం ఒక్క ఉత్తర అమెరికాలో, ప్రత్యేకించి అమెరికాలో జరగడం గమనార్హం. యూరప్ దేశాలు ఆ తరువాత స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన బ్రీచింగ్ లో 9 శాతం యూరప్ దేశాల్లో జరుగుతోంది.
* 2016లో ప్రపంచవ్యాప్తంగా బ్రీచ్ అయిన రికార్డ్స్: 1,37,85,09,261
* బ్రీచింగ్ ఘటనలు: 1,792
* ఎన్ క్రిప్షన్ సాంకేతికత ఉపయోగించిన చోట కూడా లీకయిన సమాచారం: 4.2 శాతం
లీకయిన డాటా రికార్డ్సు(యావరేజి)
* రోజుకు : 37,76,738
* గంటకు : 1,57,364
* ప్రతి నిమిషానికి: 2,623
* ప్రతి సెకనుకు 44