• తాజా వార్తలు

నకిలీ యాప్ లతో నరక యాతన

డీమోనిటైజేషన్ దెబ్బకు ఇండియాలో డిజిటల్ ఎకానమీ ఒక్కసారిగా స్ప్రెడ్ అయింది. బ్యాంకింగ్, షాపింగ్, పేమెంట్ అంతా ఆన్ లైన్లోకి మళ్లింది. ఇంకా చెప్పాలంటే స్మార్టుఫోన్ పైనే పేమెంటు వ్యవస్థ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా సౌకర్యంగా, సౌలభ్యంగా ఉండడంతో అంతా దానికే మొగ్గు చూపారు. యాప్ బేస్డ్ పేమెంట్ మెథడ్స్ ఒక్కసారిగా అందుబాటులోకి వచ్చేశాయి. ఇదే అదనుగా నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఆన్‌లైన్ మోసాలకు తెరతీస్తున్నాయి. దీంతో ఇంటర్నెట్‌లో సైట్‌లు, యాప్‌లంటే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. నోట్లరద్దు ప్రక్రియ తర్వాత ఇలాంటి ప్రకటనలు వాట్సాప్, పేస్‌బుక్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో డిజిటల్ ఎకానమీకి సైబర్ సెక్యూరిటీ అతి పెద్ద హర్డిల్ గా మారింది.
నకిలీ యాప్ లు, వెబ్ సైట్లలో రెండు రకాలుంటాయి. కొన్ని మన డబ్బును కాజేసే ఎత్తుగడతో వస్తే కొన్ని మన డివైస్ లను, డాటాను తినేసే ప్లాన్ లో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా నకిలీ యాప్‌లలోని వైరస్‌లు స్మార్ట్‌ఫోన్‌లలో రోజుకు 2జీబీ డేటా తినేస్తుంటాయని ఫోరెన్సిక్ సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం 12మిలియన్ల డివైజ్‌లు, యాప్‌ల కారణంగా వైరస్‌ల బారిన పడినట్లు గుర్తించారు. ఈ యాప్‌లు నిమిషంలో 20కి పైగా ప్రకటనలు ఇస్తూ.. ఫోన్‌పై త్రీవ ప్రభావం చూపుతాయి. వీటికి సంబంధిత బ్యాక్‌గ్రౌండ్ సంవత్సరాల తరబడి ఉండిపోతుంది. వీటిని డౌన్‌లోడ్ చేసుకోవడంతో ప్రయోజనం శూన్యమని, మీ ఫోన్ వేగం నెమ్మదించి వైరస్‌లతో నిండిపోతాయి. అంతేకాకుండా మీ వ్యక్తిగత సెల్‌ఫోన్ సమాచారం (డివైజ్ డేటా) చోరీకి గురవుతుంది. ఇంటర్నెట్‌లో విస్తృతంగా వ్యాపార లావాదేవీలు పెరగడంతో సాంకేతికత ఆధారంగా వైబ్‌సెట్‌లను అక్రమ సంపాదనలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. వీటిల్లో చాలావరకు నకిలీవే. ఈ మధ్య సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్రమోడీ పేరిట కూడా ఇలాంటి ప్రకటనలే వచ్చాయి. వీటిల్లో ఏది నిజం, ఏది నకిలీనో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇలాంటి మోసాలకు చెక్ చెప్పాలంటే లాజిక్‌గా మౌస్‌ను క్లిక్ చేస్తే సరి అంటున్నారు సైబర్ నేర నియంత్రణ నిపుణులు.
అసలేదో.. నకిలీ ఏదో..
నకిలీయాప్‌లు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇంటర్నెట్ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. దేశ ప్రధాని ప్రారంభించిన భారత్ ఇంటర్ ఫేస్‌మనీ యాప్‌కు 40కిపైగా నకిలీ వెర్షన్లు వచ్చాయి. ఎక్స్‌రే యాప్ అంటూ.. అసలు ప్రయోజనం లేని వైద్య సంబంధిత యాప్‌లు కోకొల్లలు. ఇలాంటి యాప్‌లపై కొన్ని సూచనలు పాటించి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు అవసరం
యాప్‌ను డౌన్‌లోడు చేసుకునేముందు అది ఇప్పటివరకు ఎన్నిసార్లు డౌన్‌లోడ్ చేశారనే సంఖ్యను చూడాలి. దీనిపై వినియోగదారుల రివ్యూస్‌ను చూసుకోవాలి. ఫేక్ రివ్యూస్‌తోనూ సైబర్ క్రిమినల్స్ తప్పుదోవ పట్టిస్తారు. నిర్ధారించుకునేందుకు గతంలో ఈ డెవలపర్ రూపొందించిన యాప్‌లో ఉన్నది వెతికి చూసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ అన్‌ట్రస్ట్‌డ్ వెబ్‌సైట్ నుంచి థర్డ్‌పార్టీ యాప్ డౌన్‌లోడుకు ప్రయత్నించకూడదు. నకిలీ యాప్‌ల లోగోలు నాణ్యతగా ఉండవని, రేటింగ్, ఫర్ బిడ్డింగ్ ట్రాఫిక్ చూడడం మర్చిపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్ చిరునామా లోపలి ఇంగ్లీష్ పదాలలో తప్పులు దొర్లుతున్నాయా.. కచ్చితంగా నకిలీవే అంటున్నారు నిపుణులు. లాగిన్, చిరునామా, పేమెంట్ పేజీలన్నీ సెక్యూర్డ్ గుర్తుతోనే ఉన్నాయా లేదా అన్నది గమనించాలని నిపుణులు చెబుతున్నారు. ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికెట్ ఉందా, గుగూల్‌లో డొమైన్ పేరు నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. అన్నిటికీ మించి యాప్ డౌన్లోడ్ చేయడానికి ముందే అక్కడే ఉండే రివ్యూలు చూసుకోవడం తప్పనిసరి.

జన రంజకమైన వార్తలు