రాన్సమ్‌వేర్ .. ఇప్పుడు ఈ పేరు వింటేనే పెద్ద పెద్ద సంస్థలే గడగడలాడుతున్నాయి. నెమ్మదిగా కంప్యూటర్లలోకి జొరబడి.. మన ఫైల్స్ అన్నింటిని స్వాధీనం చేసుకుని.. చివరికి మన కంప్యూటర్‌ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ఈ వైరస్ ప్రత్యేకత. ఇప్పటికే ఎన్నో దేశాల్లో ఈ వైరస్ పెద్ద ఎత్తున నష్టమే సృష్టించింది. అలా నష్టపోయిన దేశాల్లో భారత్ కూడా ఉంది. ఇలాంటి ప్రమాదకర వైరస్‌ను ముందుగానే గుర్తిస్తే దాని వలలో పడకుండా జాగ్రత్త పడొచ్చు.. మరి ఈ రాన్సమ్‌వేర్ వైరస్‌ను గుర్తించడం ఎలా? .. దీనికో టూల్ వచ్చింది.
బిట్ డిఫెండర్ సమర్పించు..
బిట్ డిఫెండర్ కంపెనీ ఈ రాన్సమ్‌వేర్ వైరస్ రికగనైజేషన్ టూల్‌ను తయారు చేసింది. విండోస్ కోసమే ప్రత్యేకంగా ఈ టూల్‌ను రూపొందించారు. రాన్సమ్‌వేర్ వైరస్ పాకిన ఫైల్స్‌ను స్కాన్ చేసి ఆ వైరస్ పూర్తి వివరాలను మనకు అందిచడమే ఈ టూల్ ప్రత్యేకత. అంటే ఈ రాన్సమ్‌వేర్లో ఎన్నో రకాలున్నాయి. ఇది ఏ రకానికి చెందిన వైరస్. అది ఇప్పుడు ఏ దశలో ఉంది. ఎంత వరకు అరికట్టొచ్చనే విషయాలపై ఇది మనకో క్లారిటీ ఇస్తుంది. ఈ టూల్ ద్వారా రెండు రకాలుగా మనం రాన్సమ్‌వేర్ను గుర్తించొచ్చు. ఒకటి రాన్సమ్‌నోట్‌ను స్కాన్ చేయడం, రెండోది రాన్సన్ వైరస్ సోకిన ఫైల్‌ను స్కాన్ చేయడం.
టూల్ ఎలా వాడాలంటే..
మొదటి పద్ధతిలో సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేసి నియమ నిబంధనలను ఓకే చేయాలి. ఆ తర్వాత మీకు సాఫ్ట్‌వేర్ మెయిన్ ఇంటర్‌ఫేస్ కనబడుతుంది. ఈ టూల్‌లో మీ వైరస్ సోకిన ఫైల్ పాత్‌ను ఎంటర్ చేయాలి. రాన్సమ్ నోట్‌ను కూడా స్పెసిఫై చేయాలి. ఇది మీకు రాన్సమ్‌వేర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది. ఫైల్ ఏమైనా లాక్ అయిందో లేదో చూపిస్తుంది. అంతే కాక స్కోర్ సెక్షన్ కూడా చూపిస్తుంది. రాన్సమ్‌వేర్లలో ఎక్కువ స్కోరు వచ్చిన వైరసే మీ కంప్యూటర్‌లో దూరిన వైరస్ కింద లెక్క. దాన్ని బట్టి మీరు యాంటి రాన్సమ్‌వేర్ వాడేందుకు అవకాశం ఉంటుంది. కరెప్ట్ అయిన ఫైల్స్‌ను తొలగించి.. అన్ని ఫైల్స్‌కు అది వ్యాపించకుండా చూడొచ్చు. అలా చేయకపోతే మీ వాల్యుబుల్ ఫైల్స్ కోసం మీరు డబ్బులు కూడా కోల్పోవాల్సి వస్తుంది.