ప్రపంచంలో భయంకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌పై అగ్రరాజ్యం అమెరికా సైబర్ యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే ఐఎస్ స్థావరాలపై ఉపరితల దాడులు చేస్తున్న అమెరికా...ఇకపై నుంచి సాంకేతికతను ఉపయోగించి వారిని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తోంది. ఆధునాతన సాంకేతికతను ఉపయోగించి ఐఎస్ నెట్‌వర్క్ కమ్యునికేషన్స్‌ను చెల్లాచెదురు చేయాలనేది పెంటగాన్ వ్యూహం. ఇస్లామిక్ స్టేట్ కొత్త వారిని తమ గ్రూప్‌లోకి చేర్చుకోకుండా, వారి పరిథి పెరగకుండా ఎక్కడకక్కడ కమ్యూనికేషన్‌ను తెంచేయడానికి అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసింది. సైబర్ వార్‌లో అమెరికాకు తిరుగులేదని...ఐఎస్‌కు ఎలాంటి సాంకేతిక సహకారం అందకుండా కృషి చేస్తున్నట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. సోషల్ మీడియా ద్వారా యాంటీ ఐఎస్ విధానాలను ప్రచారం చేస్తున్నట్లు, ఈ గ్రూపులో చేరితే ఎదురయ్యే పరిణామాలు అందరికి అర్థం అయ్యేటట్లు వివరిస్తున్నట్లు అమెరికా రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఐఎస్ శిబిరాలపై అమెరికా వైమానిక దాడులు చేయడం మామూలే అని.. ఇప్పుడు జరుగుతోంది సైబర్ యుద్ధమని, ఐఎస్ శిబిరాలపై అమెరికా సైబర్ బాంబులు ప్రయోగించడానికి సిద్ధం అవుతోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఐఎస్‌పై జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా భారీగా సాంకేతిక సిబ్బందిని నియమిస్తోంది. డ్రోన్‌ల ద్వారా ఐఎస్ శిబిరాలు ఎక్కడున్నాయో గుర్తించడం, వారి కదలికలను ఎప్పటికప్పుడు సైన్యానికి తెలియజేయడం లాంటి విధులు నిర్వర్తిస్తోంది. 6000 మంది మిలటరీ, మరియు సైబర్ సిబ్బంది ఐఎస్ మీద యుద్ధానికి వినియోగిస్తున్నట్లు పెంటగాన్ తెలిపింది. ఐఎస్ కార్యకలాపాలను కనిపెట్టడానికి 133 సైబర్ టీమ్‌లు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. 65 మంది సభ్యులు ఉండే ఒక్కో టీమ్ సాంకేతికత విషయంలో ఆరి తేరింది. వారిని ఇబ్బందులు పాలు చేయాలంటే ఆయుధాలు అవసరం లేదని సాంకేతికత చాలని దీంతోనే వారిని ఉక్కిరిబిక్కిరి చేయచ్చని అమెరికా చెబుతోంది. |