ఇక గూగుల్ సేఫ్ బ్రౌజింగ్ ఇనిషియేటివ్ తప్పుదారి పట్టించే డౌన్ లోడింగ్ ప్రకటనలు, డౌన్ లోడింగ్ బటన్లు ఉన్న యాడ్స్ నుంచి వినియోగదారులను బయటపడేసేందుకు గూగుల్ ప్రయత్నాలు తీవ్రం చేసింది. ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్న గూగుల్ సంస్థ ఇకపై వాటి పై యుద్ధమే చేయనుంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు, తప్పుడు వెబ్ సైట్ల పనిపట్టడమే పనిగా పెట్టుకుంది. కొన్ని సంస్థలు, వ్యక్తులు తమ ప్రోగ్రాంలు, అప్లికేషన్ల డౌన్ లోడ్ లు పెంచుకునే క్రమంలో ఇలాంటి తప్పుడు మార్గాలు అనుసరిస్తుంటారు. వీటివల్ల నెటిజన్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ ఇబ్బంది తొలగించడానికి గూగుల్ ఇప్పుడు కంకణం కట్టుకుంది. సెర్చింజన్ ఏదైనా కానీ ముఖ్యంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సినవాటి కోసం వెతుకుతున్నప్పుడు ఇలాంటివి కనిపిస్తాయి. పాటలు, సినిమాలు, సాఫ్టువేర్ లు డౌన్ లోడ్ చేసే క్రమంలో అచ్చంగా నిజమైనవాటిలా, మనం దేనికోసం వెతుకుతున్నామో అదే అన్నట్లుగా ఉంటూ బురిడీ కొట్టిస్తాయి. వాటిపై క్లిక్ చేయగానే మనకు అవసరం లేనిది ఇంకేదో డౌన్ లోడ్ అవుతుంది. అంతేకాదు... మనకు కావాల్సింది డౌన్లోడ్ చేసుకోవాలంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ అవసరమంటూ మనల్ని పురికొల్పుతాయి. పొరపాటున వాటి జోలికెళ్తే ఇబ్బందే. ఒక్కోసారి వాటినుంచి వైరస్ లు వ్యాపించే అవకాశం ఉంటుంది. అంతేకాదు... మన కంప్యూటర్ లోని సమాచారాన్ని తస్కరించే అప్లికేషన్లు, టూల్స్ కూడా వాటి నుంచి డౌన్లోడ్ కావొచ్చు. అవి మన బ్యాంకింగ్ సంబంధిత సమాచారం, పాస్ వర్డులు వంటివి దోచుకునే ప్రమాదం ఉంది. కంప్యూటరు పనితీరు వేగవంతం చేసేవని.... మొబైల్ ఫోన్ సెక్యూరిటీ కోసం అంటూ పలు టూల్స్ ను ప్రమోట్ చేస్తూ కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇకపై ఇలాంటి డౌన్ లోడ్ ఆప్షన్లు ఉన్న యాడ్స్ ప్రచురించే వెబ్ సైట్ల విషయంలో గూగుల్ కఠినంగా వ్యవహరించబోతోంది. వాటిని ఓపెన్ చేయగానే యూజర్లకు వార్నింగ్ మెసేజ్ వచ్చేలా ఆప్షన్ తీసుకొస్తోంది. అలాంటి సైట్లను తమ సెర్చి రిజల్ట్స్ లో బ్లాక్ చేయాలనీ అనుకుంటోంది. గూగుల్ సేఫ్ బ్రౌజింగ్ ఇనిషియేటివ్ లో భాగంగా ఇలాంటివాటికి అడ్డుకట్ట వేయడానికి గూగుల్ కృషి చేస్తోంది. |