• తాజా వార్తలు

భారతీయుడి యాడ్ గూగుల్ ఆన్ లైన్ డాట్ కామ్

గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థల వెబ్ సైట్లు కానీ, వారి ఉత్పత్తులు కానీ అంత ఈజీగా హ్యాకింగ్ కు గురికావు. కానీ... ప్రభుత్వాలను, ప్రజలను గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ మాత్రం గూగుల్ ను కూడా హ్యాక్ చేస్తే. ఆ ఆలోచన ఇప్పుడు సైబర్ రంగంలో సరికొత్త సవాల్ గా మారింది. ఇంతవరకు ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లు, సంస్థల సైట్లు హ్యాక్ చేస్తున్న ఐఎస్ గూగుల్ పై కన్నేయడంతో ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లుగా ఉంది. గూగుల్ ఇంటర్నెట్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ విస్తారమైన సేవలందిస్తుండడంతో గూగుల్ పై ఐఎస్ ఆధిపత్యం సాధిస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. గూగుల్ అనుబంధ జీమెయిల్ కు 100 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. గూగుల్ కే చెందిన ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా ప్రపంచంలోని కోట్లాది ఫోన్లు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎస్ గూగుల్ పై కన్నేయడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ను హ్యాక్ చేసి చూపుతామని ప్రతిజ్ఞ చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపు 'కాలిఫేట్ సైబర్ ఆర్మీ' ఆ దిశగా విజయం సాధించామని ప్రకటించింది. గూగుల్ ను హ్యాక్ చేసేశామని ప్రకటించింది. అయితే... ఐఎస్ హ్యాక్ చేసింది గూగుల్ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐఎస్ హ్యాక్ చేసింది గూగుల్ సైట్ ను కాదు.  ఇంతకీ ఏం జరిగిందంటే, ఇండియాకు చెందిన గాంధాని కె. అనే వ్యక్తి 'యాడ్ గూగుల్ ఆన్ లైన్ డాట్ కామ్' పేరిట ఓ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు. కాలిఫేట్ సైబర్ ఆర్మీ దీన్ని హ్యాక్ చేయడంలో విజయవంతమైంది. యాడ్ గూగుల్ పేజీని తెరిస్తే, ఐఎస్ఐఎస్ కు చెందిన ఓ పాట వినిపిస్తుండగా, వారి లోగో కనిపిస్తోంది. గూగుల్ అని ఉండడంతో ఐఎస్ అదే గూగుల్ సైట్ గా భావించింది. అలా అని ఉగ్రవాదులను తక్కువ అంచనా వేయడానికి ఏమాత్రం వీల్లేదు. వారు ఇప్పటివరకు 35 బ్రిటిష్ వెబ్ సైట్లను హ్యాక్ చేశారు.

జన రంజకమైన వార్తలు