వాన్నా క్రై వైరస్ సోమవారం మరోసారి విరుచుకుపడింది. లెక్కలేనన్ని కంప్యూటర్లలో చొరబడింది. ఇంతవరకు అనుకుంటున్నట్లుగా ఇంటర్నెట్ కు కనెక్టు అయితేనే వైరస్ వ్యాపిస్తుందన్న అంచనాలను తోసిరాజంటూ అసలు నెట్ కు కనెక్టు కావడానికి ముందే పలు కంప్యూటర్లను ఇది ఆక్రమించుకోవడంతో కొత్త ఆందోళన మొదలైంది. సిస్టమ్ ఆన్ చేయగానే ఇది కనిపించిందని ఎంతోమంది చెబుతున్నారు.
అంతవరకు నో..
తాజా పరిణామలతో విండోస్ అప్ డేట్ వచ్చే వరకూ ఏపీఎంలను తెరవద్దని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. సోమవారం మరో సారి వాన్నా క్రై వైరస్ హ్యాకింగ్ వార్తలతో అప్రమత్తమైన ఆర్బీఐ ఈ మేరకు బ్యాంకులకు సూచించింది. దేశంలోని ఏటీఎంలలో అత్యధికం విండోస్ ఎక్స్ పీతో పనిచేస్తున్నాయి. దీంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇవి హ్యాక్ కావడం ఖాయమన్న ఆందోళనతోనే ఆర్బీఐ ఈ సూచనలు చేసింది.
ప్యాచ్ అప్
కాగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు, ప్రభుత్వ విభాగాల కంప్యూటర్లను దెబ్బతీసిన వాన్నా క్రై సోమవారం కూడా తన తడాఖా చూపించింది. ఆంధ్రప్రదేశ్ లో పోలీసు శాఖ కంప్యూటర్లను నాశనం చేసిన ఈ వైరస్ పలు ప్రయివేటు సంస్థల కంప్యూటర్లనూ హ్యాక్ చేసింది. ఓ ప్రముఖ దినపత్రికకు చెందిన కొన్ని కార్యాలయాలు దీని బారిన పడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలూ ఆగమేఘాల మీద విండోస్ ప్యాచ్ లు వేస్తున్నాయి.