• తాజా వార్తలు

ఈ వాచీలు కాపీ మాస్టర్లు ఇన్విజిలేటర్లు జర గిది చదువు౦డ్రి

టెక్నాలజీ అనే నాణానికి బొమ్మా బొరుసూ రెండూ ఉన్న సంగతి తెలిసిందే. టెక్నాలజీ విస్తృతమవుతున్న నేపథ్యంలో మంచి పనులు, చెడు పనులూ అన్నిటికీ సాంకేతికతే సాయపడుతోంది. స్మార్ట్ గాడ్జెట్స్ వచ్చాక ప్రతి పనీ సులభమైపోయింది. ఇప్పటికే ఎన్నో పనులు చక్కబెడుతూ మనిషికి కుడిభుజంలా వ్యవహరిస్తున్న స్మార్ట్ వాచీలు ఒక్కోసారి దుర్వినియోగం అవుతున్నాయి కూడా. కాపీయింగ్ ను ప్రోత్సహించేలా ఇప్పుడు కొన్ని వాచీలను తయారుచేసి బహిరంగంగా విక్రయిస్తున్నారు.

ఈజీ స్టడీయింగ్ పేరుతో కొన్ని స్మార్ట్ వాచీలకు ప్రకటనలు గుప్పిస్తూ కాపీయింగ్ కు ఆ వాచీలు ఎలా పనికొస్తాయో చెబుతున్నారు. ఈ వాచీల్లో డాటాను స్టోర్ చేసుకోవచ్చు. పరీక్ష రాస్తున్నప్పుడు ఆ వాచీలో ఉన్న డాటా అది డిస్ ప్లే చేయడమో చదివి వినిపించడమో చేస్తుంది. కొన్ని కంపెనీలు వీటిని ఈజీ స్డడీయింగ్ టూల్ గా పరిచయం చేస్తుంటే మరికొందరు మాత్రం నిస్సిగ్గుగా పరీక్షల్లో కాపీ కొట్డడానికి దీనికి మించింది లేదంటూ విక్రయాలు చేస్తున్నారు.

అంతా మాయే..
ఈ వాచీలను నిజంగా పరీక్షల్లో కాపీకొట్టేవారి కోసమే తయారుచేశారని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఉన్న ఎమర్జన్సీ బటన్ క్లిక్ చేయగానే సెకన్ కంటే తక్కువ సమయంలో ఇది టెక్స్ట్ మోడీ నుంచి క్లాక్ మోడ్ లోకి వచ్చేస్తుంది. అంటే... ఎవరైనా వచ్చి చెక్ చేసినా కూడా కాపీ కొడుతున్నట్లు తెలియదు. అంతేకాదు... ఈ వాచ్ కు అనుసంధానంగా చిన్న వైర్ లెస్ ఇయర్ పీస్ ఉంటుంది. దీని సహాయంతో వాచీలో ముందే స్టోర్ చేసి ఉన్న సమాచారాన్ని వింటూ రాసేయొచ్చు. ఇలాంటి వాచీలు ఎక్కువవుతుండడంతో విద్యార్థులు వీటి మాయలో పడే ప్రమాదముందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. గూగుల్ సెర్చ్ లో ''వాచ్ టు చీట్ ఇన్ ఎగ్జామ్స్'' అని కొట్టగానే ఇలాంటివి కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. 4జీబీ, 8 జీబీ స్టోరేజి సామర్థ్యంతో వస్తుండగా పరీక్షకు కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అమెజాన్, ఈబే వంటి ప్రముఖ ఈకామర్స్ సంస్థలూ వీటిని విక్రయిస్తున్నాయి. సుమారు పాతికేళ్ల కిందట కేలిక్యులేటర్ వాచీలు కూడా ఇలాగే పరీక్షల్లో మస్కా కొట్టడానికి దుర్వినియోగం అయ్యాయి. అందుకే ఇప్పుడు అలాంటి వాచీలు పరీక్ష హాల్లోకి నిషిద్ధం. ఇకపై ఇలాంటి వాచీలూ వచ్చేస్తే అసలు వాచీయే కట్టుకుని రావవద్దంటూ కొత్త నిబంధనలు తేవాల్సి ఉంటుందేమో?

 

జన రంజకమైన వార్తలు