కంప్యూటరు యుగం మనిషి జీవనాన్ని ఎంత వేగవంతం, ఎంత సుఖమయం చేసిందో అంతేస్థాయిలో అభద్రంగా కూడా మార్చేసింది. ఇల్లు కదలకుండా బ్యాంకు పనులు చేసుకోవచ్చు... బిల్లులు కట్టొచ్చు... షాపింగ్ చేసుకోవచ్చు... అయితే, ఎవరైనా హ్యాకర్ మన క్రెడిట్ కార్డులు, ఆన్ లైన్ బ్యాంకింగు పాస్ వర్డులు వంటివి తెలుసుకున్నారా.. మన పని అంతే. అయితే... తాజాగా మషాచూషెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి(ఎంఐటీ) చెందిన శాస్త్రవేత్తలు తయారుచేసిన ఓ చిప్ మాత్రం హ్యాకర్లు కాదు కదా వారి తాతలు దిగొచ్చినా కూడా తాను లొంగనంటోంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) విధానంలో రూపొందించిన ఈ చిప్ ఉంటే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వంటివన్నీ సూపర్ సేఫ్ అని చెబుతున్నారు దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు. సాధారణంగా చిప్ ఆధారిత కార్డులను వినియోగించేటప్పుడు పవర్ ఫ్లక్చుయేషన్స్ తో చిప్ డాటాను హ్యాకర్లు తస్కరిస్తారు. అయితే.... ఇది అలాంటివన్నీ తట్టుకుంటుందని చెబుతున్నారు. కాగా ప్రస్తుతానికి ఇది హ్యాక్ ప్రూఫ్ అయినా భవిష్యత్తులో హ్యాకర్టు దీనికి విరుగుడు కనిపెట్టే ప్రమాదముందని చెబుతున్నారు సాంకేతిక నిపుణులు. తెలుగువారైన ఎంఐటీ ప్రొఫెసర్ ఆచంట చంద్రశేఖర్, ఆయన బృందం కలిసి చిప్ ను తయారుచేశారు. |