హార్డ్ డిస్క్ శబ్దాలని ఉపయోగించి మన డాటా ని తస్కరించొచ్చు తెలుసా ? కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అని ఓ మహా కవి అన్నట్లు.... ఆన్ లైన్, ఆఫ్ లైన్, హార్డ్ డిస్క్ .. కాదేదీ హ్యాకింగ్ కు అనర్హం అంటున్నారు మన టెక్ పరిశోధకులు. కంప్యూటర్ యొక్క హార్డ్ డిస్క్ డ్రైవ్ ల లోనుండి వచ్చే శబ్దాల ద్వారా మన డేటా ను తస్కరించ వచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ప్రాక్టికల్ గా ఇది అంత సులభం కాక పోయినప్పటికీ ఎయిర్ గ్యాప్ద్ సిస్టమ్స్ లేదా కంప్యూటర్ లకు ఈ ప్రమాదం ఎక్కువ అని పరిశోధనలో తేలింది. ఇస్రాయెల్ కు చెందిన బెన్ - గురియన్ యూనివర్సిటీ కి చెందిన పరిశోధక బృందం ఎయిర్ గ్యాప్ద్ కంప్యూటర్ ల నుండి వచ్చే శబ్దాలను ఉపయోగించి కంప్యూటర్ లో ఉన డేటా ను ఎలా తస్కరించవచ్చు అని చేసిన పరిశోధనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. పర్సనల్ కంప్యూటర్ యొక్క కూలింగ్ ఫ్యాన్ కూడా మన సిస్టం లో ఉన్న డేటా ను పాస్ వర్డ్ లు ఎన్ క్రిప్షన్ కీ ల తో సహా చెప్పేస్తుంది అని వీరు గత జూన్ నెలలో జరిపిన పరిశోధనలో కనుగొన్నారు. మన PC యొక్క హార్డ్ డిస్క్ డ్రైవ్ కూడా డేటా తస్కరణకు సరిపడా శబ్దాలను ఉత్పత్తి చేస్తుందని కనుగొన్నారు. డ్రైవ్ యొక్క ఇంటర్ నల్ మెకానికల్ ఆర్మ్ ను ఉపయోగించి బైనరీ సిగ్నల్ లను ఉత్పత్తి చేయడం ద్వారా ఇది సాధ్య పడుతుందని వారు కనుగొన్నారు. వాస్తవానికి ఈ మెకానికల్ ఆర్మ్ అనేది హార్డ్ డ్రైవ్ లోపల డేటా ను మాత్రమే చదవడం మరియు రాయడం చేస్తుంది. కానీ ఇది పని చేసేటపుడు మాత్రం వివిధ ఫ్రీక్వెన్సీ లలో ఉన్న శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ శబ్దాలు హ్యాకింగ్ కు అనువుగా ఉంటాయి. ఈ పరిశోధకులు దీని కోసం డిస్క్ ఫిల్టరేషన్ అనే ఒక మాల్ వేర్ ను డెవలప్ చేశారు. ఇది లైనక్స్ PC లో ఉన్న హార్డ్ డిస్క్ డ్రైవ్ లో ఉన్న ఆపరేషన్ లను కంట్రోల్ చేయగలదు. ఈ ఉత్పత్తి అయిన శబ్దాలను రికార్డు చేయడానికి సామ్ సంగ్ గాలక్సీ S 4 ఫోన్ ను PC దగ్గర ఉంచుతారు. ఇది రికార్డింగ్ తో పాటు సిగ్నల్ లను డి క్రిప్ట్ చేస్తుంది. దీనిద్వారా వీరికి డేటా బిట్ ల రూపం లో అంటే 0 మరియు 1 ల రూపం లో లభిస్తుంది. దీనిని ఆ తర్వాత డి క్రిప్ట్ చేస్తారు. కాకపోతే ఈ ట్రాన్స్ మిషన్ రేటు చాలా తక్కువగా అంటే 180 బిట్స్ పర్ మినిట్ మాత్రమే ఉంటుంది అది కూడా PC కి ఆరు అడుగుల లోపు మాత్రం మాత్రమే వీలు అవుతుంది. ఈ తరహా హ్యాకింగ్ ను నివారించాలంటే ఎయిర్ గ్యాప్ద్ సిస్టమ్స్ ను కలిగి ఉన్న వారు సాలిడ్ స్టేట్ డ్రైవ్ లను వాడవలసినదిగా పరిశోధకులు సూచిస్తున్నారు. |