• తాజా వార్తలు

ఉగ్రవాదుల కొత్త ఆయుధంగా వాట్స్ యాప్..

నివారణకు నిఘా బృందాల కంటే హ్యా''కింగ్"లే బెటర్

సోషల్ మీడియా ప్రపంచాన్ని ఎంతగా ఓపెన్ యాక్సెస్ లోకి తెచ్చేసిందో తెలిసిందే. సోషల్ మీడియా, మెసేంజర్ యాప్ లతో మనుషుల మధ్య సంబంధాలు, కమ్యూనికేషన్స్ లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. సామాన్యులకు సాటి మనుషుల అండ దొరికేలా చేసి ఎన్నో సమస్యలకు పరిష్కారంగా మారుతున్న సోషల్ మీడియా ఒక్కోసారి ప్రమాదకరంగానూ మారుతోంది. కత్తితో కూరగాయలు కోయొచ్చు... పీకలూ కోయొచ్చు అన్నట్లుగా సోషల్ మీడియా కూడా వినాశకర కార్యకలాపాలకూ సాధనంగా మారి భయపెడుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదులు సోషల్ మీడియాను తమకు అనుకూలంగా మార్చుకుంటూ విధ్వంసాలు సృష్టిస్తున్నారని తేలింది. ప్రపంచానికే పెను సవాల్ విసురుతున్న ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు సోషల్ మీడియా సహాయంతో తమ టార్గెట్లను ఇట్టే కొడుతున్నాయి. ముఖ్యంగా వాట్స్ యాప్, ట్విట్టర్, వైబర్ వంటివాటిని ఉగ్రవాదులు విస్తారంగా ఉపయోగిస్తున్నారని ప్రపంచ దేశాల నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేయడానికే కాకుండా ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా టెర్రరిస్టులు ట్విట్టర్ ను ఉపయోగించుకుంటున్నార. ట్విట్టర్ లోనే తమ యాక్షన్ టీంలకు కోడ్ భాషలో ఆదేశాలిస్తున్నారంటే ఆశ్చర్యపోకమానదు. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. దాన్ని నిరోధించలేక నిఘా వర్గాలు సతమతమవుతున్నాయి.

ముఖ్యంగా మెసేంజర్ సర్వీసుల నుంచి పంపించుకునే ఉగ్రవాద సమాచారాన్ని డీకోడ్ చేయడం... అసలు ఆ సమాచారాన్ని సేకరించడం నిఘా వర్గాలకు కష్టమవుతోంది. ఇలాంటి మెసేంజర్ సర్వీసుల్లోకి చొరబడి ఉగ్రవాద సమాచారాన్ని తీసుకోవడం సాధ్యం కావడం లేదని పలు రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు కూడా అంటున్నారు. ఆయా సర్వీసు ప్రొవైడర్లు సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదని... సర్వీసు ప్రొవైడర్ల నుంచి సహకారం ఉండడం లేదని  పోలీసు శాఖకు చెందిన ఫోరెన్సిక్ విభాగ నిపుణులు చెబుతున్నారు. 

అయితే... ఏ మెసేంజర్ యాప్ కూడా అంత పటిష్ఠమైనది కాదని.. ఎందులోకైనా చొరబడవచ్చని హ్యాక్ మేనియా వ్యవస్థాపకుడైన సైబర్ నిపుణుడు రజత్ సాహి చెబుతున్నారు. నిఘా, దర్యాప్తు బృందాల్లో అంత సత్తా ఉన్న నిపుణులు లేకపోవడం వల్లే వారికి అది సాధ్యం కావడం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదుల సమాచార మార్పిడి మాధ్యమాలు.. వారి అకౌంట్లు, వారు ఉపయోగించిన డివైస్లను హ్యాక్ చేయడం సాధ్యమేనన్నది ఆయన మాట. 

సొంతంగా సాంకేతిక సామర్థ్యం లేనప్పుడు ఉగ్రవాద నిరోధానికి ఇలాంటి సైబర్ నిపుణుల సేవలను ఉపయోగించుకునే దిశగా దర్యాప్తు బృందాలు కృషి చేయడం మంచిది. ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు కూడా ప్రత్యేకంగా హ్యాకర్లను నియమించుకుని మరీ ప్రభుత్వ వెబ్ సైట్లను దెబ్బతీస్తున్న నేపథ్యంలో దర్యాప్తు, నిఘా బృందాలు ఇలాంటి హ్యాకింగ్ మేధావులను వాడుకోవడం తప్పనిసరి అనిపిస్తోంది.

 

జన రంజకమైన వార్తలు