వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక.. నేరాలు, మోసాల రూపం మారుతోంది! సులువుగా డబ్బు సంపాదించేందుకు దీనిని ప్రధాన సాధనంగా వాడేస్తున్నారు. ఇప్పటికే ఫేక్ న్యూస్‌లతోనే పలు నేరాలు జరుగుతుంటే.. ఇప్పడు వాట్సాప్ లో మరో స్కామ్ బయటపడింది. అదే SEXTING. పురుషులందరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరి స్తున్నారు నిపుణులు. అమ్మాయినని పరిచయమవుతారు! కమ్మని మాటలు చెబుతారు. తియ్యని పదాలతో ముగ్గులోకి దించుతారు. తమకు సంబంధించిన అశ్లీల చిత్రాలు పంపి వలలోకి లాగుతారు. ఇక్కడ నియంత్రణ తప్పి.. మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోలను పంపించారో వాటితో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు లాగేస్తారు!
ఆన్‌లైన్‌లో బిజీగా ఉండే వారే టార్గెట్
వాట్సాప్‌లో ఏదైనా కొత్త నంబర్ నుంచి మెసేజ్ వస్తే.. కొంతమంది రిప్లై ఇస్తుంటారు. మరికొందరు లైట్ తీసుకుంటారు! ఇదే ఇప్పుడు మోసగాళ్లకు ఆయుధంగా మారింది. ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లలో నిత్యం బిజీగా ఉండే పురుషులను నేరగాళ్లు ఎంచుకుంటారు. వారి అకౌంట్ నుంచి ఫోన్ నంబర్‌తో పాటు ఇతర వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకుంటారు. తర్వాత వారి నంబరుకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తారు. ఎవరైనా రిప్లై ఇస్తే.. అమ్మాయిగా పరిచయం చేసుకుంటారు.
బెదిరింపులు.. బ్లాక్ మెయిల్
అప్పటి నుంచి చాటింగ్ మొదలు పెడతారు. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఈ చాటింగ్ స్టైల్‌ను SEXTINGగా మార్చేస్తారు. ఇందులో అశ్లీల మెసేజ్‌లతో పాటు చిత్రాలు పంపి ముగ్గులోకి దించుతారు. చాలా సందర్భాల్లో ఫొటోషాప్‌లో మార్ఫింగ్ చేసిన చిత్రాలనే పంపిస్తారు. ఇక ముందు మాట్లాడాలంటే తమ చిత్రాలు పంపించాలని అడుగుతారు. ఒకవేళ పంపితే.. బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెడతారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు పంపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడతారు. ఒకవేళ చిత్రాలు పంపకపోతే.. సోషల్ మీడియాలోనో ఎక్కడో ఒకచోట మన ఫొటో సంపాదించి.. వాటితో అశ్లీల చిత్రాలు రూపొందించి మరీ బ్లాక్ మెయిల్‌కు పాల్పడతుంటారు.
పోలీసులకు ఫిర్యాదు చేయకుండా..
ముందుగా తక్కువ అమౌంట్‌తో మొదలుపెడతారు. తక్కువ అమౌంటే కనుక బాధితులు పోలీసుల వరకూ వెళ్లరనేది మోసగాళ్ల వ్యూహం. ఇలా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళతారు. ఆ తర్వాత భారీ మొత్తంలో డిమాండ్ చేస్తుంటారు. ప్రస్తుతం మన దేశంలో ఇటువంటి కేసులు నమోదు కాకపోయినా దక్షిణాఫ్రికాలో ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయ ట. తెలియని వ్యక్తులతో చాటింగ్ మొదలు పెట్టేముందు వారికి సంబంధించిన వివరాలు నిర్ధారణ చేసుకుంటే ఇటువంటి మోసాల్లో ఇరుక్కోకుండా ఉండొచ్చు.
మోసాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తలు
అతి త్వరలోనే వాట్సాప్ Forwarded లేబుల్‌ని తీసుకురాబోతోంది. ఫార్వర్డ్ చేసిన మెసేజ్‌లకి ఇక నుంచి ఈ లేబుల్ కనిపిస్తుంది. వాట్సాప్‌లో వస్తున్న ప్రతి విషయాన్నీ గుడ్డిగా నమ్మకుండా క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. మోసపుచ్చే ప్రకనటలు, ఫేక్ న్యూస్‌కు సంబంధించిన లింక్‌ల్లో అక్షరాలతో పాటు కొన్ని చిన్నచిన్న తప్పులు ఉంటాయి. వీటిని గుర్తిస్తే.. మోసపోయే అవకాశాలు తక్కువ. టెక్ట్స్ మెసేజ్‌ల్లానే.. ఫొటోలు, వీడియోలను జాగ్రత్తగా పరిశీలించాలి. వీటిని మార్ఫింగ్ చేశారా? లేదా నిజమేనా అనే విషయాలు తెలుసుకోవాలి.