• తాజా వార్తలు

ఫ్లిప్‌కార్ట్‌లో మన డేటాతో మోసం చేస్తున్న ముఠా ఆట కట్టు 

ఈకామర్స్ వెబ్ సైట్లు ఫ్లిప్‌కార్ట్‌, మింత్రాల్లో మన షాపింగ్ వివరాలు చోరీ చేసి ఆ కంపెనీల ప్రతినిధుల‌మ‌ని.. ప్రొడక్ట్స్ అమ్ముతామని డబ్బులు కొట్టేస్తున్న ఒక ముఠాను నోయిడా పోలీసులు ఆట కట్టించారు. ఇందుకోసం ఆ ముఠా ఏకంగా 45 మందితో ఢిల్లీలో రెండు కాల్ సెంటర్లే నడుపుతోంద‌ని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. వీళ్లంద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ స్కామ్‌లో కీ రోల్ ప్లే చేసిన ద‌లీప్ స‌రోజ్ ప‌రారీలో ఉన్నాడ‌ని నోయిడా పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ శ్రద్ధ పాండే ఈ వివరాలను మీడియాకు తెలిపారు. 

ఎలా చేస్తారంటే..
ఈ ముఠా ముందుగా ఫ్లిప్‌కార్ట్‌, మింత్రాల్లో   షాపింగ్ చేసేవారు ఎవ‌రు?  వారి షాపింగ్ ట్రెండ్స్ ఏమిటో ప‌రిశీలిస్తుంది. వారు ఎలాంటి వస్తువులు కొంటున్నారో గ‌మ‌నిస్తుంది. ఆ త‌ర్వాత వారి ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు తెలుసుకొంటుంది. 
తర్వాత ఆ కస్టమర్ల‌కు ఫోన్ చేసి తాము ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా  ప్రతినిధుల‌మ‌ని పరిచయం చేసుకుంటున్నారు. ఫలానా ప్రొడక్ట్ తమ దగ్గర డిస్కౌంట్‌లో లభిస్తుందంటారు. పేటీఎం లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా తమకు డబ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే వెంటనే ప్రొడక్ట్ పంపిస్తామని నమ్మిస్తారు. డబ్బులు వారి అకౌంట్లో పడగానే ముఖం చాటేస్తున్నారు. ఆ తర్వాత ఆ నెంబర్లకు కాల్ చేస్తే  ఎలాంటి రెస్పాన్స్ ఉండటం లేదు. 

 

కోట్లు కొట్టేశారు
కస్టమర్లు కంప్లైంట్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గట్టిగా ఆరా తీయగా ఈ ముఠా గత ఏడాదిన్న‌ర కాలంగా కొన్ని వేల మందిని ఈ రకంగా మోసం చేసి కోట్ల రూపాయలు పోగేసిందని గుర్తించారు. కస్టమర్లను కాంటాక్ట్ చేయడానికి ఏకంగా 2 కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకున్నార‌ని తెలిసి పోలీసుల‌కే నోట మాట రాలేద‌ట‌.  ఈ కాల్‌సెంట‌ర్ల‌లో  44 మంది ఉద్యోగులను కూడా పెట్టుకున్నారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు. 

డేటా ఎక్కడిది? 
ఫ్లిప్‌కార్ట్‌, మింత్రాల్లో మన షాపింగ్ వివరాలు ఈ ముఠాకు ఎలా తెలుస్తున్నాయ‌నేది ఇప్పుడు పెద్ద చిక్కుప్ర‌శ్న‌గా మారింది. ఈ  విషయంపైనే పోలీసులు  ఆరా తీస్తున్నారు. ఆ సంస్థల్లో పని చేసే ఎంప్లాయిస్ ఎవరైనా నా ఈ ముఠాకు సహకరిస్తున్నారా అని విచారణ చేస్తున్నామని నోయిడా ఏసీపీ పాండే చెప్పారు.

జన రంజకమైన వార్తలు