కంప్యూటర్లను కొల్లగొట్టే మాల్ వేర్ లు కుప్పలుతెప్పలుగా ఉంటాయి. అయితే, అందులో రాన్సమ్ వేర్లు మరింత ప్రమాదం. చాలా మాల్ వేర్ లు కంప్యూటర్లను నాశనం చేస్తే చేయొచ్చు కానీ, ర్యాన్సమ్ వేర్ అలా కాదు. మన నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేస్తుంది. అడిగినంత ఇస్తేనే మన కంప్యూటర్ ను మళ్లీ పనిచేసేలా చేస్తానంటుంది. తీరా మనం డబ్బులిచ్చాక అది పనిచేసేలా చేయొచ్చు, కరప్ట్ చేసేయొచ్చు కూడా. అందుకే వైరస్ లలో రాన్సమ్ వేర్ అంత ప్రమాదకరమైనది ఇంకొకటి లేదు. ఇది దానికదే వివిధ నెట్ వర్కుల ద్వారా వ్యాపించేస్తుంది కూడా. ఇప్పుడు 99 దేశాల్లోని 75 వేల కంప్యూటర్లను హ్యాక్ చేసేసిన ‘వన్నా క్రై’ కూడా ఇలాంటి రాన్సమ్ వేరే.
వన్నా క్రై వంటి రాన్సమ్ వేర్లు వల్నర్ బుల్ ఓఎస్ లు వాడుతున్న అన్ని సిస్టమ్స్ పై దాడి చేస్తాయి. ఓఎస్ అప్ గ్రేడ్ చేసుకోని వారంతా దీనివల్ల నష్టపోతారు. ఓఎస్ అప్ డేషన్ ఇచ్చేటప్పుడు అందులో సైబర్ సెక్యూరిటీ ప్యాచ్ లు కూడా ఉంటాయి. అప్ డేట్ చేసుకోకపోవడం వల్ల వాటిని మనం పొందలేకపోతాం. ఏమీ జరగనప్పుడు అది చిన్నవిషయం లాగే ఉంటుంది కానీ, ఇలాంటి సైబర్ అటాక్స్ లో నష్టపోయినప్పుడు అది ఎంత ముఖ్యమో తెలుస్తుంది.
వన్నా క్రై వంటి రాన్సమ్ వేర్ లు ఈమెయిళ్ల ద్వారా ప్రధానం వ్యాపించేస్తాయి. అటాచ్ మెంట్ల రూపంలో ఈ వైరస్ ఉంటుంది. మనకు తెలియకుండానో, తెలిసో వాటిని క్లిక్ చేస్తే చాలు వచ్చి కంప్యూటర్లో కూర్చుంటాయి.
ఈ లేటెస్టు వైరస్ వన్నా క్రై ప్రపంచ దేశాలను వణికించేసింది. ముఖ్యంగా బ్రిటన్, స్కాట్లాండ్లలో నేషనల్ హెల్త్ సర్వీసెస్ సిస్టమ్ ను మొత్తం కొలాప్స్ చేసేసింది. దానివల్ల ఎన్నో ఆపరేషన్లు ఆగిపోయాయి. డాక్టర్ల అపాయింటుమెంట్లు నిలిచిపోయాయి. అంబులెన్సులు కూడా తిరగడం మానేశాయి. అంతగా దెబ్బకొట్టిందీ వైరస్.
రష్యాలో కూడా ఈ మాల్వేర్ తీవ్ర ప్రభావం చూపించి అక్కడి ఎయిర్ లైన్సుపై భారీ ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇటలీ, ఫిన్లాండ్, పోలాండ్, బెలారస్ వంటి ఎన్నో దేశాలు దీని దెబ్బకు దొరికిపోయాయి. చైనా కూడా బయటకు చెప్పుకోనప్పటికీ పలు విశ్వవిద్యాలయాలు, రీసెర్చి సెంటర్లలో కంప్యూటర్లలోని సమాచారమంతా కోల్పోయినట్లు తెలుస్తోంది.
భారత్ లోనూ జరిగిన నష్టం తక్కువేమీ కాదు. ముఖ్యంగా ఇండియాలోని పోలీస్ డిపార్టుమెంటు కంప్యూటర్లన్నీ దీని దెబ్బకు దొరికాయి. ఏపీలో సుమారు 25 శాతం పోలీసు స్టేషన్లలోని కంప్యూటర్లనీ నాశనమయ్యాయి.