`మేము చాలా తెలివైన వాళ్లం` అనుకున్న వాళ్లు కొన్ని సందర్భాల్లో బొక్కబోర్లా పడుతుంటారు. తప్పు చేసి ఎవరికీ దొరకలేదని సంబరపడిన వాళ్లు.. ఏదో ఒక సమయంలో నోరు జారి కటకటాల పాలవుతుంటారు. పాపం ఇలాగే ఒక హ్యాకర్ అడ్డంగా బుక్కయిపోయాడు. తాను పనిచేస్తున్న హ్యాకింగ్ సంస్థలో.. ఐఫోన్‌ని హ్యాక్ చేసే కొన్ని టూల్స్ దొంగిలించి.. భారీ మొత్తంలో ఇతరులకు అమ్మేసే ప్రయత్నంలో దొరికిపోయి జైలుపాలయ్యాడు.
ఎలా దొరికాడంటే
అత్యాశకు పోతే కటకటాలు తప్పవని నిరూపించాడు ఇజ్రాయిల్‌లోని హ్యాకింగ్ సంస్థ ఎన్ఎస్‌వోకు చెందిన మాజీ హ్యాకర్! ఈ సంస్థ ఇజ్రాయిల్ సాయుధ బలగాలకు టూల్స్ అందజేయడంతో పాటు ఐఫోన్స్, స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేస్తూ ఉంటుంది. ఐఫోన్‌ను హ్యాక్ చేసేందుకు ఎన్ఎస్‌వో గ్రూప్ ఉపయోగించే ఒక టూల్‌ను 38 ఏళ్ల ఒక హ్యాకర్ జాగ్రత్తగా కొట్టేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హ్యాకర్ కంపెనీ కోడ్‌ని గత ఏడాది దొంగింలిచేశాడు. కంప్యూటర్ నుంచి దీనిని హార్డ్ డిస్క్‌లోకి లోడ్ చేసే సమయంలో సిస్టమ్‌లోని మెకాఫీ యాంటీ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ని డిజేబేల్ చేశాడు. ఈ టూల్‌ని డార్క్ వెబ్( నేరపూరిత కార్యకలాపాలకు వేదిక)లో ఏకంగా 50 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.343 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. డార్క్ వెబ్‌లో తనను తాను.. ఎన్ఎస్‌వోని టూల్స్‌ని బ్రేక్ చేసిన బృందంలో ఒక మెంబర్‌గా అందరికీ చెప్పాడట. ఈ డార్క్ వెబ్‌లో అతడికి పరిచయమైన వ్యక్తుల్లో ఒకరు ఈ హ్యాకర్ గుట్టు అంతా తెలుసుకుని..ఈ వ్యవహారంపై ఇజ్రాయిల్ జస్టిస్ మినిస్ట్రీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ హ్యాకర్‌ను పోలీసులు ట్రేస్ చేసి అరెస్టుచేశారు. ఐఫోన్ హ్యాక్ చేసే టూల్‌ను భద్రపరిచారు.
ఎవరికీ షేర్ చేయలేదట
హ్యాక్ చేసిన డేటా, ఐపీ అడ్రస్‌తో పాటు ఇతర సమాచారాన్ని థర్డ్ పార్టీ కంపెనీలకు షేర్ చేయలేదని ఎన్ఎస్‌వో తెలిపింది. ఈ టూల్‌ను దొంగిలించిన కొద్ది సమయంలోనే మాజీ ఉద్యోగిని అరెస్టు చేశామని వివరించారు. భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ఎప్పటికప్పుడు కొత్త టూల్స్ ప్రవేశపెట్టే యాపిల్ ఐఫోన్స్ హ్యాకింగ్ గురవుతుండటంతో యూజర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసేందుకు యూఎస్‌బీ రిస్ట్రిక్ట్ మోడ్ అనే సెక్యూరిటీ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు యాపిల్ తెలిపింది. ఐఫోన్ ను హ్యాక్ చేయడం అంత సులువు కాదని చెబుతోంది.