ఆపరేటింగ్ సిస్టమ్ పాతబడితే వైరస్ ల భయం ఎక్కువవుతోంది. ఇటీవలే వానా క్రై, పెట్యా వంటి రాన్సమ్ వేర్ వైరస్ లు విండోస్ పాత వెర్షన్లను టార్గెట్ చేసి ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టం కలిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో పాత వెర్షన్లు వాడుతున్న ఫోన్లే టార్గెట్ గా స్పైడీలర్ అనే వైరస్ వ్యాప్తి చెందుతోంది.
ముఖ్యంగా ఇది చైనాలో ఇప్పటికే భారీ ఎత్తున వ్యాపించినట్లు తెలుస్తోంది. చైనాలో ఉన్న పలు పబ్లిక్ వైఫై హబ్‌ల ద్వారా ఈ వైరస్ వ్యాపించినట్లు గుర్తించారు. ఆండ్రాయిడ్ 2.2 నుంచి ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ వరకు ఉన్న ఆండ్రాయిడ్ ఓఎస్‌లను వాడుతున్న యూజర్ల ఫోన్లలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది.
40 యాప్స్ లో వివరాలు హుష్ కాకి స్పైడీలర్ మాల్‌వేర్ వైరస్ యూజర్ ఫోన్‌లో ఉన్న ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్, టెలిగ్రాం తదితర 40 యాప్స్‌కు ఇన్‌ఫెక్ట్ అవుతుందని ఐటీ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆ వైరస్ ఇన్‌ఫెక్ట్ అయిన ఫోన్‌లో ఉన్న యూజర్‌కు చెందిన ఫోన్ నంబర్లు, మెసేజ్‌లు, కాంటాక్ట్స్, కాల్ హిస్టరీ, నెట్‌వర్క్ ఇన్‌ఫర్మేషన్‌ను సేకరించి హ్యాకర్లకు చేరవేస్తుందని పేర్కొంటున్నారు.
ఈ విషయమై గూగుల్ ఇప్పటికే తన ప్లే స్టోర్‌లో ఉన్న యాప్ పబ్లిషర్లకు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. తమ తమ యాప్స్‌కు సెక్యూరిటీని మరింత పటిష్టం చేసుకోవాలని గూగుల్ యాప్ డెవలపర్లకు సూచించినట్టు సమాచారం. కాగా ఇప్పటి వరకు ఈ వైరస్ సుమారుగా 1.4 కోట్ల ఆండ్రాయిడ్ డివైస్‌లకు వ్యాప్తి చెందినట్టు అంచనా వేస్తున్నారు.