• తాజా వార్తలు

ఏమిటీ డిస్‌ప్లే నాచ్‌? ఆ సౌకర్యం క‌లిగిన 10 ఫోన్లు ఏవో తెలుసా? 

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ఎంత పెద్ద‌ద‌యితే అంత క్రేజ్‌. ఇది పాత ట్రెండ్‌. స్క్రీన్ సైజ్ ఎంత‌యినా ప‌ర్లేదు. బీజిల్‌లెస్ (అంచుల వ‌ర‌కు) డిస్‌ప్లే ఉండాలి. ఇది కొత్త ట్రెండ్‌. అయితే ఇలా బీజిల్‌లెస్ డివైస్ పేరుతో ఫోన్ అంచుల వ‌ర‌కు స్క్రీన్ ఉంటే మ‌రి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఎక్క‌డుంటుంది?  ఫోన్ కాల్‌లో మ‌నకు టోన్ వినిపించే రిసీవ‌ర్ ఎక్క‌డ పెడ‌తారు? అదిగో దానికోసం వ‌చ్చిందే  డిస్‌ప్లే నాచ్ ఫీచ‌ర్‌. అంటే ఫోన్ టాప్‌లో క‌రెక్ట్‌గా సెంట‌ర్‌లో చిన్న భాగాన్ని మాత్రం స్క్రీన్ లేకుండా ఉంచుతారు. దాన్నే డిస్‌ప్లే నాచ్ అంటున్నారు. ఆ ప్లేస్‌లోనే మీకు వాయిస్ వినిపించే చిన్న రిసీవ‌ర్‌, ఫ్రంట్ కెమెరా లెన్స్ పెడ‌తారు.

ఐ ఫోన్ టెన్‌తో మొద‌లు
త‌న ప‌దో యానివ‌ర్స‌రీ ఎడిష‌న్‌గా యాపిల్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా గ‌త సంవ‌త్స‌రం లాంచ్ చేసిన ఐఫోన్ టెన్‌లో  ఈ డిస్‌ప్లే నాచ్‌ను తొలిసారిగా ప్ర‌వేశ‌పెట్టింది. అది ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయిపోయింది. అక్క‌డి నుంచి  శాంసంగ్‌, ఎల్జీ, ఒప్పో, వివో, వ‌న్‌ప్ల‌స్ వంటి పెద్ద కంపెనీల‌న్నీ బీజిల్‌లెస్ డిస్‌ప్లే, డిస్‌ప్లే నాచ్‌తో ఫోన్లు రిలీజ్ చేయ‌డానికి పోటీ ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఇలాంటివి ప‌ది ర‌కాల ఫోన్లున్నాయి. అవేంటో చూడండి. 

1 .ఐఫోన్ టెన్ (iPhone X)
5.8 ఇంచెస్ సూప‌ర్ రెటీనా డిస్‌ప్లేతో వ‌చ్చిన ఈ ఫోన్‌లో మినిమ‌ల్ బీజిల్స్ ఉన్నాయి.  డిస్‌ప్లే నాచ్ ప్రారంభమ‌య్యిందే ఈ ఫోన్‌తో. ధ‌ర దాదాపు ల‌క్ష రూపాయ‌లు.

2. వ‌న్‌ప్ల‌స్ 6 (OnePlus 6)
త‌క్కువ ధ‌ర‌లో టాప్ ఫీచ‌ర్ల‌తో ఫోన్ రిలీజ్ చేసే వ‌న్‌ప్ల‌స్‌.. త‌న లేటెస్ట్ మోడ‌ల్ వ‌న్‌ప్ల‌స్ 6లో డిస్‌ప్లే నాచ్ తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 16ఎంపీ, 20 ఎంపీ డ్యూయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా దీని ప్ర‌త్యేక‌త‌లు. 19:8 ఎలాంగేటెడ్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లేతో కూడిన 6.28 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌తో చూడానికి చాలా బాగుంది. 

3.  హాన‌ర్ 10 (Honor 10)
వ‌న్‌ప్ల‌స్ 6కి కాంపిటీష‌న్‌గా హువావే రిలీజ్ చేసిన హాన‌ర్ 10లోనూ డిస్‌ప్లే నాచ్ ఫీచ‌ర్ ఉంది. 5.84 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌పై టాప్ నాచ్ ఉంటుంది. కైరిన్ 970 ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్‌, 16, 24 మెగాపిక్సెల్స్‌తో డ్యూయ‌ల్ రియ‌ర్ కెమెరా సెట‌ప్‌, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీని స్పెషాలిటీలు..

4. హువావే పీ 20 ప్రో (Huawei P20 Pro)
హువావే ఫ్లాగ్‌షిప్ ఫోన్ హువావే పీ20 ప్రోలోనూ డిస్‌ప్లే నాచ్ ఫీచ‌ర్ పెట్టారు. 6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్‌ ప్యానెల్‌పై టాప్ నాచ్ ఉంటుంది. కైరిన్ 970 ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్ ఉన్న ఈ ఫోన్లో వెన‌క‌ప‌వైపు మూడు కెమెరాలున్నాయి.  8,20, 40 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట‌ప్ అమ‌ర్చారు. మూడు రియ‌ర్ కెమెరాల‌తో వ‌చ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ ప్ర‌పంచంలో ఇదే.

5. వివో వీ 9( Vivo V9)
స్నాప్‌డ్రాగ‌న్ 626 ప్రాసెస‌ర్‌,  4జీబీ ర్యామ్‌తో వ‌చ్చిన వివో వీ9లో 16ఎంపీ, 5ఎంపీ డ్యూయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 24ఎంపీ సెల్ఫీ కెమెరా ప్ర‌త్యేక‌త‌లు. 6.28 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ స్క్రీన్ మీద 19:9 ఎలాంగేటెడ్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లేతో కూడిన ఈ ఫోన్‌లోనూ డిస్‌ప్లే నాచ్ ఉంది.

ఇవే కాక నోకియా ( Nokia X6), లెనోవో జెడ్‌5 (Lenovo Z5), షియోమి ఎంఐ8 (Xiaomi Mi 8), హువావే పీ20లైట్ (Huawei P20 Lite), ఓపో ఎఫ్ 7 (Oppo F7) కూడా డిస్‌ప్లే నాచ్ ఫీచ‌ర్‌తో మార్కెట్‌లో కాంపిటీష‌న్‌కు సై అంటూ వ‌చ్చేశాయి.