వయో వృద్ధులకు ఉపయోగపడే గాడ్జెట్స్ తయారు చేసే సీనియర్ వరల్డ్ సంస్థ.. వృద్ధుల కోసమే ప్రత్యేకంగా ఒక ఫోన్ తయారు చేసింది. తన ఈజీఫోన్ బ్రాండ్ కింద ఈజీఫోన్ గ్రాండ్ పేరుతో ఈ ఫోన్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. వృద్ధులకు పలు రకాలుగా ఉపయోగపడేఈ ఫోన్ వారికి చేయూతగా ఉపయోగపడుతుందని, పెద్ద వయసులో వచ్చే వినికిడిపరమైన సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుందని కంపెనీ చెబుతోంది. ఆ ఫోన్ విశేషాలేమిటో చూడండి.
హియరింగ్ ఎయిడ్ అక్కర్లేదు
వయసు మీరే కొద్దీ వచ్చే ప్రధాన సమస్య వినపడకపోవడం. ఇక ఫోన్లో మాట్లాడాలంటే అవతలి వారిమాట సరిగ్గా వినపడక వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ ఇబ్బంది తొలగించేలా, వృద్ధులకు పెద్ద సౌండ్ తో అవతలివారి వాయిస్ వినిపించేలా యూనిక్ టెక్నాలజీని ఈ ఫోన్లో వినియోగించామని, దీనితోపాటు స్పెషల్ ఇయర్‌ఫోన్స్ కూడా అందిస్తున్నామని.. కాబట్టి హియరింగ్ ఎయిడ్ (చెవిలో పెట్టుకునే వినికిడి పరికరం) అవసరం లేకుండానే వృద్ధులు ఫోన్ కాల్‌ను స్పష్టంగా వినగలుగుతారని సంస్థ చెబుతోంది. ఇలాంటి ఫీచర్‌తో ప్రపంచంలో తొలిఫోన్ తమదేనని ప్రకటించింది.
అంతేకాదు టీవీ చూసేటప్పుడు, ఎదుటివారితో ముఖాముఖి మాట్లాడేటప్పుడు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
మంచి ఫీచర్లు
* ఫేవరెట్ కాంటాక్ట్స్‌కు ఫోన్ చేయడానికి కాంటాక్ట్ లిస్ట్‌లో పేరుతో వెతకడం వృద్ధులకు కొద్దిగా కష్టమే. అందుకే ఫోటో డయలింగ్ ఫీచర్ పెట్టారు. జస్ట్ కాంటాక్ట్ ఫోటో మీద ప్రెస్ చేస్తే కాల్ వెళుతుంది.
* అత్యవసరం పరిస్థితుల్లో ఫోన్ వెనక ఉన్న ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేస్తే ముందే ఫీడ్ చేసి పెట్టుకున్న ఐదు నెంబర్లకు వెంటనే కాల్ వెళ్లిపోతుంది. అంతేకాదు పక్కవాళ్లను అలర్ట్ చేసేందుకు సైరన్ ఫీచర్ ఇచ్చారు.
* సులువుగా చదవగలిగేలా పెద్ద ఫాంట్స్, క్వాడ్ బాండ్, ఎఫ్ఎం ఉన్నాయి.
* మందులు వేసుకోవడం, వ్యాయామం, నడక వంటివి మరిచిపోకుండా రిమైండర్ ఫీచర్
* ఫోన్ వాల్యూమ్ పెంచడానికి, తగ్గించడానికి, టార్చ్ లైట్ ఆన్, ఆఫ్‌కి, ఫోన్ లాక్, అన్‌లాక్‌కు ప్రత్యేకంగా సైడ్ కీస్ ఉన్నాయి.
* అన్‌వాంటెడ్ కాల్స్ రాకుండా వైట్‌లిస్ట్ కీప్యాడ్ కూడా పెట్టారు.
ధర 3,990
ఈ ఫోన్ ధర 3,990. Seniorworld.com, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో దొరుకుతుంది.