స్మార్ట్ ఫోన్ రూపాన్ని ఎప్పటికప్పుడు ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ఇతర బ్రాండ్లకన్నా విభిన్నమైనదిగా చూపడం కోసం వివిధ కంపెనీలు అనేక వినూత్న మార్పుచేర్పులు చేస్తున్నాయి. సంప్రదాయకంగా వచ్చే 3.5 మిల్లీమీటర్ల హెడ్‌ఫోన్ జాక్ తొలగింపు, వేలిముద్రల స్కానర్ బదులు ముఖాన్ని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం వంటివి ఇందులో భాగమే. వీటి తరహాలోనే ఇప్పుడు వాడుకలో ఉన్న చాలా ఫీచర్లు కూడా త్వరలో మాయం కానున్నాయి. వాటిలో ఓ పదింటిని పరిశీలిద్దామా!
ఫింగర్ ప్రింట్ స్కానర్లు
ఈ ఫీచర్ త్వరలోనే అదృశ్యం కానుంది. యాపిల్ తన కొత్త ఐఫోన్లు- XS, XS Max, XRలలో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ బదులు ముఖాన్ని గుర్తించే పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. అలాగే ఆండ్రాయిడ్‌ను వాడే Vivo, Oppo కంపెనీలు కూడా డిస్‌ప్లేలో అంతర్భాగంగా ఉండే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అత్యాధునిక మోడళ్లలో వినియోగించాయి. ఇదే పద్ధతిని OnePlus 6T, Samsung Galaxy S10లలో కూడా వినియోగించబోతున్నారట!
హెడ్‌ఫోన్ జాక్
స్మార్ట్ ఫోన్లలో 3.5 మిల్లీమీటర్ల సంప్రదాయక హెడ్‌ఫోన్ జాక్ ఎప్పుడో మాయమైంది. ఆధునిక ఫోన్లలో అధికశాతం దీన్ని వదిలించుకుంటున్నాయి. ఆ మేరకు తాజాగా రంగ ప్రవేశం చేయబోతున్న OnePlus 6T కూడా హెడ్‌ఫోన్ జాక్ లేకుండానే రానుందని సమాచారం.
సిమ్‌కార్డ్ స్లాట్
యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన కొత్త తరం ఐఫోన్లలో సిమ్‌కార్డ్ స్లాట్‌ను తొలగించి, డ్యూయెల్ సపోర్ట్ eSIMను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా భౌతిక సిమ్‌కార్డులకు స్వస్తిచెప్పే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికైతే మన దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ సంస్థలు మాత్రమే eSIM ఆధారిత సేవలందిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఇతర టెలికామ్ సంస్థలు కూడా ఇదే బాట పట్టనున్నాయి.
మైక్రో SD కార్డ్ స్లాట్
ఎక్స్‌టర్నల్ microSD కార్డులు స్మార్ట్‌ఫోన్ పనితీరుపై దుష్ప్రభావం చూపుతాయని అందరికీ తెలిసిందే. అందుకే స్మార్ట్ ఫోన్ల తయారీదారులు అంతర్గత స్టోరేజీ సామర్థ్యాన్ని 512 జీబీల స్థాయికి పెంచారు. భవిష్యత్తులో మైక్రో ఎస్డీ కార్డులు మాయమైపోతాయనడంలో సందేహం లేదు.
సంప్రదాయక మొబైల్ చార్జర్
వైర్‌లెస్ చార్జింగ్ క్రమంగా ప్రాచుర్యంలోకి వస్తోంది. కొత్తగా వచ్చే కార్లలో వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్స్ ఉంటున్నాయ్. మరి చార్జింగ్ వైర్లు, అడాప్టర్లు త్వరలోనే మరుగున పడతాయనడంలో సందేహమేమైనా ఉందా?
స్పీకర్లు, ఇయర్‌పీస్ కనుమరుగు... డిస్‌ప్లేలోనే ఆ సదుపాయాలు
కొంతకాలం తర్వాత స్పీకర్ పాత్రను డిస్‌ప్లే పోషించనుంది. దీంతో స్పీకర్లు రద్దవుతాయ్. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే అందుబాటులో ఉంది. Vivo Nexలో డిస్‌ప్లేలోనే శబ్దం వినిపించడమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. కాబట్టి సమీప భవిష్యత్తులోనే స్పీకర్లు లేని స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయ్. అంతేకాదు.. ఫోన్ కాల్ మాట్లాడాలంటే ఇయర్‌పీస్‌ను మనం చెవిదగ్గర ఉంచుకోవాల్సిన పని కూడా ఉండదు. అప్పుడు అవతలివారి మాట వినడానికి డిస్‌ప్లేలో ఏ భాగాన్నైనా ఉపయోగించవచ్చు.
వాల్యూమ్ బటన్ల స్థానే పవర్/వేక్ బటన్లు
ఇప్పుడు ఆన్/ఆఫ్, వాల్యూమ్ బటన్లు కనిపిస్తున్నాయ్‌గానీ, రాబోయే రోజుల్లో వాల్యూమ్ బటన్ పనిని కూడా power/wake బటన్ నెరవేర్చనుంది.
ఫోల్డబుల్ ఫోన్లు వస్తే... సంప్రదాయక చతురస్రాకారం మాయం
మనం కొద్దికాలంలోనే మడిచే ఫోన్ల యుగంలోకి ప్రవేశించబోతున్నాం. శామ్‌సంగ్, LG, షియోమీ తదితర కంపెనీలు దీన్ని మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయట! మడిచే ఫోన్లు వస్తున్నాయంటే చతురస్రాకారపు ఫోన్లకు కాలం చెల్లబోతోందనే కదా!
ఫోన్ వెనుక సింగిల్ లెన్స్ కెమెరా
కెమెరా ప్రధాన మాడ్యూల్ (వెనుకభాగం)లో ఒకటికిమించి లెన్స్ వాడకానికే కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. కాబట్టి సింగిల్ లెన్స్ కెమెరాలకు మంగళం పాడేందుకు రంగం సిద్ధమైంది. దీని స్థానంలో రెండు లేదా మూడు లెన్స్ వ్యవస్థగల కెమెరా కనిపిస్తుందన్న మాట! శామ్‌సంగ్ ఇటీవలే తొలి మూడు లెన్సుల వెనుక కెమెరాతో తన ఫోన్‌ను మార్కెట్లోకి వదిలడం ఇందుకు నిదర్శనం.