• తాజా వార్తలు

ఆపిల్ నుంచి కొత్త సెక్యూరిటీతో ఐఫోన్లు, ఐఫోన్ 11 రిలీజ్ డేట్ మీకోసం 

ప్రపంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న దిగ్గజం ఆపిల్ నుంచి వచ్చిన ఐపోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీకి ఈ ఫోన్లు పెద్ద పీఠ వేస్తాయి, ఎవ్వరూ హ్యాక్ చేయలేని విధంగా ఈ కంపెనీ ఫోన్లు ఉంటాయి. అందుకే ధర ఎక్కువైనా వాటిని కొనేందుకే చాలామంది ఆసక్తిని చూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే  ‘ఐఫోన్లు’ మరింత భద్రతతో వినియోగదారుల ముందుకు రాబోతున్నాయి. 

ఐఫోన్ X స్మార్ట్‌ఫోన్‌లో టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు బదులుగా ఫేస్ ఐడీ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. అయితే ఆ తరువాత వచ్చిన ఐఫోన్ XR, XS, XS మ్యాక్స్ ఫోన్లలోనూ టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. కేవలం ఫేస్ ఐడీనే ఇచ్చారు. కానీ 2021లో రానున్న ఐఫోన్లలో ఫేస్ ఐడీతోపాటు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను కూడా ఆపిల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. 

2021లో రానున్న ఐఫోన్లలో క్వాల్‌కామ్ రూపొందించే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌లను ఉపయోగించనున్నారట. ప్రస్తుతం అనేక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఇప్పటికే ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. దీంతో అదే బాటలో ఆపిల్ కూడా ఇన్‌స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను ఏర్పాటు చేస్తున్నదని తెలిసింది. ఇక డిస్‌ప్లేపై ఫింగర్ ప్రింట్ సెన్సింగ్ ఏరియాను కూడా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాగా 2021 ఐఫోన్లలో 5జీ ఫీచర్ ఉండబోతోంది. ఈ క్రమంలో ఆ ఫీచర్‌కు పైన తెలిపిన ఇన్‌స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా జత కానుంది.

అండర్‌ స్క్రీన్‌ ఫింగర్‌ ప్రింట్‌’ సెన్సార్లతో ఐఫోన్లు 2021 నాటికి మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఐఫోన్ల యాజమాన్యం 2017లోనే ఈ టెక్నాలజీ పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకుంది.కాగా ఐఫోన్ల భద్రతకు ఇంతకుముందు ‘టచ్‌ఐడీ’ పద్ధతి ఉండేది. స్క్రీన్‌కు దిగువన సెట్‌పైన ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా ఫోన్‌ను లాక్, అన్‌లాక్‌ చేసే వెసులుబాటు ఉండేది. ఆ తర్వాత ఐఫోన్లతో ‘ఫేస్‌ఐడీ’ పద్ధతి వచ్చింది. ఆ తర్వాత 8 ప్లస్‌ సిరీస్‌ నుంచి ఈ ఫింగర్‌ ఐడీని తీసివేసి ఒక్క పేస్‌ఐడితో ఐఫోన్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ‘ఇన్‌స్క్రీన్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడీ (స్క్రీన్‌ మీద వేలి ముద్రను రిజిస్టర్‌ చేయడం ద్వారా సౌకర్యంతో ఐఫోన్లు వస్తున్నాయట. 

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో తన నూతన ఐఫోన్ మోడల్స్‌ను విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన ఐఫోన్ 11 ఫోన్లను విడుదల చేస్తుందని తెలిసింది. ఐఫోన్ 11 మోడల్స్ సెప్టెంబర్ 10వ తేదీన విడుదలవుతాయని, వాటికి 13వ తేదీ నుంచి ప్రీ ఆర్డర్లను ప్రారంభిస్తారని, సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఆ ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.