దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్ జట్టు కట్టాయి. ఈ రెండు కంపెనీలు కలిసి 6వేల నుంచి 12 వేల రూపాయల సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లు తయారు చేసి విక్రయించడానికి ఒప్పందానికి వచ్చాయి. ఇప్పటి వరకు కొన్ని కంపెనీల ఫోన్లను కొన్ని ఈ కామర్స్ సైట్లలోనే ఎక్స్‌క్లూజివ్‌గా అమ్ముతున్నారు కానీ ఈ కామర్స్ కంపెనీ, సెల్ కంపెనీతో కలిసి ఫోన్లు తయారుచేసి అమ్మడం బహుశా ఇండియాలో ఇదే ఫస్ట్‌టైం. అలా చూస్తే టెక్నాలజీ రంగంలో ఇదో రకమైన ముందడుగు.
కొన్నాళ్ల కిందటి వరకు ఇండియన్ మొబైల్‌ఫోన్ మార్కెట్‌లో టాప్ 5లో ఉన్న మైక్రోమ్యాక్స్.. రెడ్‌మీ, లీఎకోలాంటి కంపెనీల రాకతో వెనకబడిపోయింది. ఇప్పుడు మళ్లీ పాత వైభవాన్ని దక్కించుకోవాలంటే ఇండియాలో స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యే బేసిక్ రేంజ్‌లోనే సత్తా చాటాలని మైక్రోమ్యాక్స్ భావిస్తోంది. ఇండియాలో 50 శాతం స్మార్ట్‌ఫోన్లు ఈ ప్రైస్ రేంజిలోనే అమ్ముడవుతున్నాయి. మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 40% ప్రైస్ షేర్ ఈ రేంజ్‌లోని ఫోన్లదే. అందుకే వీటిని కొనే యూజర్లే టార్గెట్‌గా ఫ్లిప్‌కార్ట్ తో కలిసి మొబైల్ ఫోన్లు తయారు చేయబోతోంది. అంతేకాదు వీటిని ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే అమ్మబోతున్నారు.
ఇద్దరికీ మంచిదే..
మళ్లీ టాప్ 5లోకి రావాలనే టార్గెట్‌తో మైక్రోమ్యాక్స్ ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌మీదా దృష్టి పెడుతోంది. ఇప్పటికీ మైక్రోమ్యాక్స్ 6వేల నుంచి 12 వేల రేంజిలో అమ్మే ఫోన్లలో సగం ఆన్‌లైన్లో నే అమ్ముతుంది. ఫ్లిప్‌కార్ట్‌తో లాంగ్‌టర్మ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని, కస్టమర్ కు ఏం అవసరమో ఎప్పటికప్పుడు మార్కెట్‌ను గమనిస్తూ ముందుకెళతామని మైక్రోమ్యాక్స్ ప్రకటించింది. మైక్రోమ్యాక్స్ ఆన్‌లైన్ సేల్స్ షేర్ పెరిగితే అది ఫ్లిప్‌కార్ట్‌కూ లాభమే. ఎందుకంటే వాటిని మేమే ఎక్స్‌క్లూజివ్‌గా అమ్ముతాం కాబట్టి అమ్మకాలు పెరిగితే టైర్ 2, టైర్ 3 సిటీల్లోకి మేం మరింత వేగంగా చొచ్చుకెళ్లగలుగుతామని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. అయితే ఈ డీల్‌లో ఎవరి వాటా ఎంతన్నది ఇంకా బయటకు రాలేదు.
వచ్చే వారమే రిలీజ్
ఇవోక్ బ్రాండ్ తో రెండు ఫోన్లు వచ్చే వారమే మార్కెట్‌లోకి రాబోతున్నాయి. 25వేల రూపాయలకు విక్రయిస్తున్న మైక్రోమ్యాక్స్ డ్యూయల్ 5ను ఫ్లిప్‌కార్ట్‌లోనే ఎక్స్‌క్లూజివ్‌గా అమ్ముతోంది.