భారత్‌లో టెలికాం కంపెనీల మధ్య పోటీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. నువ్వు ఒక మోడల్ దింపితే నేను అంతకుమించిన మోడల్‌ను రంగంలోకి తీసుకోస్తా అన్నట్లు సాగుతోంది వ్యాపారం. భారత టెలికాం రంగాన్ని ఆవరించిన చైనా మొబైళ్ల నుంచి పోటీని తట్టుకోవడానికి భారత కంపెనీలు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో అన్ని కంపెనీల కన్నా మైక్రోమ్యాక్స్ ముందంజలో ఉంది. వినియోగదారులకు నచ్చే, వారు మెచ్చే సదుపాయాలతో ఫోన్లను బరిలో దింపడానికి మైక్రోమాక్స్ నడుం బిగించింది. ఈ ఏడాది భారత్‌లో 10 స్మార్టుఫోన్లు రంగంలోకి దింపాలని మైక్రోమాక్స్ ప్రయత్నిస్తోంది. ఆరు నెలలు స్తబ్ధుగా ఉన్న మైక్రోమాక్స్ ఇప్పుడే ఒకేసారి మార్కెట్‌పై దండయాత్రకు దిగుతోంది. మూడు ప్రత్యేక రేట్లలో ఈ మొబైల్‌లను అమ్మాలని మైక్రోమాక్స్ వర్గాలు తెలిపాయి. రూ.10,000, రూ.20,000, రూ.6000 ధరల్లో ఈ ఫోన్లను అమ్మకాలకు పెట్టాలని భావిస్తోంది. ఈ ఏడాది భారత మార్కెట్లోకి వచ్చిన ఫోన్లు తక్కువ రేట్లు ఉండడంతో వినియోగదారులను ఆకర్షించడానికి మైక్రోమాక్స్ వ్యూహరచన చేస్తోంది.
న్యూ ఎవోక్ సిరీస్
ఈసారి మైక్రోమాక్స్ ప్రవేశపెడుతున్న మొబైళ్ల ప్రత్యేకత ఏంటంటే అవి న్యూ ఎవోక్ సిరీస్‌కు సంబంధించివి. ఆన్‌లైన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్‌ను లాంచ్ చేయాలని ఆ సంస్థ భావిస్తోంది. ఈ సిరీస్‌లో రెండు స్మార్టుఫోన్లను లాంచ్ చేయాలనేది ఆ సంస్థ ఆలోచన. ఎవోక్ నోట్, ఎవోక్ పవర్ పేరుతో ఆ స్మార్టుఫోన్లను మార్కెట్లోకి తీసుకు రావడానికి మైక్రోమాక్స్ ప్రయత్నిస్తోంది. ఫ్లిప్‌కార్టుతో ఒప్పందం చేసుకున్న ఈ సంస్థ కేవలం ఈ ఒక్క ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్లోనే తమ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, వాటి పూర్తి ధరలు బయటకు వస్తాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.
అదిరే ఫీచర్లు
తమ మొబైళ్లకు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉందని.. 13 మెగా పిక్సల్ సెన్సర్ ఆప్షన్‌తో వీటిని రూపొందించినట్లు తెలిపింది. రెగ్యులర్ ఆర్‌జీబీ సెన్సర్ కాకుండా తాము ఆధునిక సెన్సర్లను వాడుతున్నామని చెప్పింది. మైక్రోమాక్స్ కొత్త ఫోన్లలో వస్తున్న ఫీచర్లలో సెక్యూరిటీ కూడా ఉంది. సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ ఫీచర్లనే కాదు.. హార్డ్‌వేర్ సెక్యూరిటీని కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఆప్షన్లను తమ మొబైళ్లలో ప్రవేశపెడుతున్నట్లు మైక్రోమాక్స్ తెలిపింది.