మంచి ఫీచర్లతో అందుబాటు ధరలతో మొబైల్ ఫోన్లను తయారు చేయడంలో మొటరోలాకు తిరుగేలేదు. మోటో ఇ నుంచి మోటో 5 జీ ప్లస్ వరకు ఆ సంస్థ ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది. ఆరంభంలో శాంసంగ్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న మోటో ఇప్పుడు మొబైల్ రంగంలో రోజు రోజుకు ఎదుగుతోంది. తక్కువ ఖర్చుతో ఒక స్మార్టుఫోన్‌ను కొనాలంటే వెంటనే మోటో గుర్తుకొచ్చేలా చేయడంలో ఆ సంస్థ సఫలమైంది. ఇటీవల ఈ మొబైల్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసిన మోటో జి5, మోటో జి5 ప్లస్ లకు గొప్ప ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టాలని ఆ చైనా కంపెనీ భావిస్తోంది. లెనొవో టేక్ ఓవర్ చేశాక మోటో మొబైళ్లు మరింత అందంగా నాజూగ్గా తయారయ్యాయి. ఇటీవలే విడుదలైన మోటో జి ప్లస్, మోటో జి 5 ఫోన్లే ఇందుకు ఉదాహరణ. అయితే మార్కెట్లో తిరుగులేకుండా ఉన్న మోటోకి ఒక ముప్పొచ్చి పడింది. అదీ నోకియా లాంటి దిగ్గజం. గతంలో ఒక్క వెలుగు వెలిగిన నోకియా... ఆండ్రాయిడ్ రావడంతో వెనకబడిపోయింది. ఐతే తాజాగా భారత మార్కెట్‌ను కొల్లగొట్టడానికి మళ్లీ వస్తోందీ ఆ మొబైల్ సంస్థ. అత్యాధునిక ఫీచర్లతో పాటు అందర్ని ఆకర్షించే ధరలతో బరిలో దిగుతోంది నోకియా.
నోకియాకు పోటీగా..
నోకియా నుంచి ఎదురవుతున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టిన మోటరోలా జాగ్రత్తపడుతోంది. వినియోగదారులను ఆకర్షించే మొబైల్స్‌ను రంగంలోకి దింపుతోంది. ఆ వ్యూహంలో భాగంగా మోటో సి మొబైల్‌ను తీసుకు వస్తోంది మోటో. బడ్జెట్ ఫోన్‌గా రంగలోకి దిగుతున్న ఈ ఫోన్‌లో అన్ని మంచి ఫీచర్లు ఉండేలా మోటో తీర్చిదిద్దుతుంది. తక్కువ రేటుతో స్మార్టుఫోన్లు కొనాలనుకునే వారిని తమవైపు తిప్పుకోవడానికి మోటో పెద్ద ప్రయత్నమే చేస్తోంది. రూ.2 నుంచి 3 వేల మధ్య 4 జీ ఫోన్‌ను అందించాలని చూస్తోంది. నిజానికి ఆ రేటులో పెద్ద కంపెనీ నుంచి స్మార్టుఫోన్లు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా వాటిలో ఉండే ఫీచర్లు చాలా నామమాత్రం. కానీ తక్కువ ఖర్చుతో మంచి ఫీచర్లు ఉన్న మొబైల్ అందిస్తే ఎక్కువమంది వినియోగదారులు తమవైపు తిరుగుతారని.. అప్పుడు నోకియా నుంచి ఎదురయ్యే పోటీ నుంచి తట్టుకోవచ్చని మోటరోలా భావిస్తోంది.
రెండు మోడల్స్‌లో..
మోటరోలా తన బడ్జెట్ ఫోన్లను మోటొ సి, మోటొ సి ప్లస్ అని రెండు మోడల్స్‌లో మార్కెట్లోకి వదులులోంది. తొలిసారి స్మార్టుఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులే లక్ష్యంగా ఫోన్లను తయారు చేస్తోంది మోటో. ఈ రెండు స్మార్టుఫోన్లు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ వెర్షన్‌తో రూపొందించారు. ఈ రెండు ఫోన్లను ఎక్కువ రిజల్యూషన్‌తో 3జీ, 4జీ అనుకూలంగా రూపొందించారు. 5 అంగుళాల తెరతో స్పోర్ట్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ప్రొసెసర్‌తో 32 బిట్, 64 బిట్ వెర్షన్ ఫీచర్లతో
ఈ ఫోన్లు తయారయ్యాయి. ఇవి 1 జీబీ నుంచి 2 జీబీ ర్యామ్ వరకు ఉంటాయిని. ..స్టోరేజీ 16 జీబీ ఉంటుందని మోటో వర్గాలు అంటున్నాయి. 2350 ఎంఏహెచ్ బ్యాటరీ మరో ప్రత్యేకత అని చెబుతున్నారు. మోటో సి ప్లస్‌లో బ్యాటరీ సామర్థ్యం దాదాపు 4000 ఎంఏహెచ్ వరకు ఉంటుందని అంచనా.