వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో ఫోన్లను రంగంలోకి దింపడంలో శాంసంగ్ స్టయలే వేరు. ఆరంభం నుంచి ఒక స్టాండర్ఢ్ టెంప్లెట్ మెయిన్‌టెన్ చేస్తూ వేగంగా ఎదిగిందీ ఈ సంస్థ. అందుకే ఏడాదిలో వీలైనన్ని ఎక్కువ మోడల్స్‌ను బరిలో దింపడానికి ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. చిన్న చిన్న మార్పులతోనే వినియోగదారులను తమవైపు తిప్పుకుని ప్రత్యర్థులను దెబ్బకొట్టాలనేది శాంసంగ్ ప్రయత్నం. అందుకే మార్కెట్లోకి ఎన్ని ఫోన్లు వచ్చినా శాంసంగ్‌ను దాటలేకపోయాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిందీ సంస్థ. గతంలో శాంసంగ్ గెలాక్సీ మోడల్‌లో చాలా రకాల ఫోన్లు వచ్చాయి. ఆ శ్రేణిలో వచ్చిన ఫోన్లకు భారత్‌లో విశేష ఆదరణ ఉంది. అందుకే అదే శ్రేణిలో మరో ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది శాంసంగ్. దాని పేరు గెలాక్సీ ఎస్8. ఏప్రిల్ 19, బుదవారమే దీన్ని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ప్రత్యర్థుల నుంచి విపరీమైన పోటీ ఉన్న నేపథ్యంలో దీని ధర, స్పెసిఫికేషన్ తదితర వివరాలకు శాంసంగ్ గోప్యంగా ఉంది.
రెండు మోడల్స్‌లో..
శాంసంగ్ తన తాజా ఫోన్లను రెండు మోడల్స్‌లో తయారు చేసింది. ఒకటి శాంసంగ్ గెలాక్సీ ఎస్8, మరొకటి శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్. ఈ రెండింట్లో దాదాపు ఫీచర్లు ఒకేలా ఉన్నా.. పనితీరులో తేడా ఉంటుందని ఈ కొరియా దిగ్గజ కంపెనీ చెబుతోంది. దిల్లీలో ఈ మధ్యాహ్నం జరగబోయే ఈవెంట్లో ఘనంగా ఈ రెండు ఫోన్లను లాంచ్ చేయనున్నారు. శాంసంగ్ ఎక్స్‌నొయిస్ 8895 ఎస్ఓసీతో వీటిని రూపొందించినట్లు తెలిసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఒసీ కంటే ఎక్స్‌నొయిస్ 8895 ప్రభావవంతమైందని... అందుకే కొత్త ఫోన్లలో అదే టెక్నాలజీని వాడుతున్నట్లు శాంసంగ్ తెలిపింది.
ప్రి ఆర్డర్స్ మొదలయ్యాయ్
శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ఫోన్ మోడల్ సొంతం చేసుకోవడానికి వినియోగదారులు కూడా ఉవ్విళ్లూతున్నారు. ముఖ్యంగా శాంసంగ్‌ను ఇష్టపడే వారు ఈ కొత్త మోడల్ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ రెండు ఫోన్ల కోసం ప్రి ఆర్డర్‌ను కూడా శాంసంగ్ బుదవారమే ప్రారంభించనుంది. ఏప్రిల్ 5నే గెలాక్సీ 8 మోడల్ గురించి ఒక ప్రి రిజిస్ట్రేషన్ పేజ్‌ను ప్రారంభించిన ఈ సంస్థ ఈ స్మార్టుఫోన్ లాంచ్ వివరాలను ఎప్పటికప్పుడు కస్టమర్లకు అందజేసింది. ఈ రెండు ఫోన్ల గురించి ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వారం రోజుల నుంచే టీజర్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ఫోన్ల ప్రి ఆర్డర్లు మిలియన్ దాటినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీని ధర సుమారు రూ.46000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. 5.5 అంగుళాల స్ర్ర్కీన్, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ డ్యుయల్ పిక్సల్ రేర్ కెమెరా ఈ ఫోన్ సొంతం.