స్మార్ట్ ఫోన్ల పరిశ్రమ అనూహ్య వేగంతో విస్తరిస్తోంది. కుత్తుకలదాకా పాకిన పోటీ ప్రపంచంలో తయారీదారులు కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సరికొత్త ఉత్పత్తులను రంగంలోకి తెస్తున్నారు. కొన్నిటికి ఇది అగ్రస్థానం కోసం పరుగు పందెమైతే.. మరికొన్నిటికి మనుగడ కోసం పోరాటం. ఈ నేపథ్యంలో అగ్రశ్రేణి ఫోన్ల కంపెనీలు త్వరలో ప్రవేశపెట్టబోతున్న కొత్త ఉత్పత్తుల గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. అయితే, వాటి ప్రత్యేకతలపై పలు మార్గాల్లో అందుతున్న రకరకాల సమాచారం తప్ప వాస్తవాలేమిటో సదరు ఫోన్ల ఆవిష్కరణ తర్వాతే స్పష్టమవుతుంది. పెద్ద కంపెనీలు త్వరలో తీసుకురాబోతున్న సరికొత్త ఫోన్లు ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం:
GOOGLE PIXEL 3, PIXEL 3 XL
గూగుల్ నుంచి రాబోతున్న ఈ రెండు ప్రతిష్ఠాత్మక ఫోన్ల కోసం చాలామంది ఆసక్తిగా.. కొందరు ‘అనాసక్తిగా’నే అయినా ఎదురుచూస్తున్నారు. వీటి గురించి లీకవుతున్న సమాచారం గందరగోళం సృష్టించడమే ఇందుకు కారణం. అయితే, ఆసక్తి మొత్తం కేంద్రీకృతమైంది వీటి ధర ఏ స్థాయిలో ఉంటుందన్న అంశంపైనే. మిగిలిన కంపెనీలతో పోలిస్తే గూగుల్ పిక్సెల్ ఫోన్లు 2019లో కూడా సింగిల్ లెన్స్ కెమెరాతోనే రానున్నాయి. అంతమాత్రాన ఈ ఫోన్ల నాణ్యతను సందేహించాల్సిన అవసరం లేదు. కెమెరా విషయానికొస్తే ఏడాది కిందట వచ్చిన పిక్సెల్ 2 ఇప్పటికీ అగ్రస్థానంలోని ఫోన్లలో ఒకటిగా కొనసాగుతోంది. కాబట్టి Pixel 3, Pixel 3 XL ఫోన్లలోనూ గూగుల్ అదే పంథాను అనుసరించనుంది. కానీ, స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు ఈ కంపెనీ కొత్త ధోరణిని పరిచయం చేయబోతోంది. అందరి నోళ్లలోనూ నానుతున్న వాటర్ డ్రాప్ ‘నాచ్’ (రంధ్రం)ని పట్టించుకోకుండా సంప్రదాయబద్ధ డిజైన్‌లోనే ఈ ‘అతిపెద్ద ఫోన్... అతిపెద్ద నాచ్’తోనే ఉంటుందని సమాచారం. మొత్తంమీద పిక్సెల్ కొత్త సిరీస్ ఫోన్లు రెండూ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్, 5.4 అంగుళాల డిస్‌ప్లేతోనే రాబోతున్నాయి. రెండు ప్రాథమిక వేరియెంట్లలోనూ 4 GB ర్యామ్, 64 GB స్టోరేజ్ సదుపాయం ఉంటుంది. అయితే, టాప్ వేరియంట్ మాత్రం 256 GB స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. చిన్న పిక్సెల్ 3లో 3000 mAh బ్యాటరీ ఉండగా, XLలో మాత్రం 3400 mAh బ్యాటరీ ఉంటుంది.
గమనిక: Pixel 3, Pixel 3 XL ఫోన్లను ఈ నెల 9న గూగుల్ ఆవిష్కరించబోతోంది.
ONE PLUS 6T
పిక్సెల్ తరహాలోనే OnePlus 6T రంగ ప్రవేశం కోసం ఈ ఫోన్ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. డిస్‌ప్లేలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌సహా ‘వాటర్ డ్రాప్ నాచ్’ వంటి ఆసక్తికర మార్పులుంటాయని భోగట్టా. అలాగే కెమెరా, బ్యాటరీ, వేగం తదితరాల్లోనూ మార్పులతో మరింత ఆకర్షణీయంగా ఉంటుందని అంచనా. అయితే, హెడ్‌ఫోన్ జాక్‌ను తొలగించాలని OnePlus నిర్ణయించినట్లు వస్తున్న సమాచారం అభిమానులను కాస్త కలవరపెడుతోంది. ఒకవేళ అది నిజమే అయినా, కేవలం ఈ ఒక్క కారణంతో ఫోన్‌ను కాదనుకునే వారు నిస్సందేహంగా ఉండబోరు. ఇక OnePlus 6T స్పెసిఫికేషన్ల మాటకొస్తే ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 SoC, 8 GB ర్యామ్, 512 GB స్టోరేజి సామర్థ్యంతో ఉండొచ్చు. OnePlus ఎలాగూ మైక్రో SD కార్డును సపోర్ట్ చేయదుగనుక స్టోరేజి సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఇది Android 9.0 Pieతో నడిచేది కాగా, 6.41 సూపర్ AMOLED డిస్‌ప్లే, చిన్ని వాటర్ డ్రాప్ నాచ్, 3,700 mAh బ్యాటరీ ఉంటాయి.
గమనిక: OnePlus 6T ఈ నెల 17న రంగప్రవేశం చేసే అవకాశాలున్నాయి
NOKIA 9 PUREVIEW
కొత్తగా రాబోయే ఫోన్ల జాబితాలోని Nokia 9 PureViewను ఐదు లెన్స్‌ల కెమెరా సెటప్‌తో రానున్న విశిష్ట ఉత్పత్తిగా ఓ కథనం పేర్కొంటోంది. ఇది Zeiss సంస్థకు ప్రత్యేకమైన పేటెంట్‌గల సాంకేతిక పరిజ్ఞానం. దీన్ని ఏదైనా మరో కంపెనీ అనుసరించే అవకాశం సమీప భవిష్యత్తులో లేదు. అంతేకాకుండా కెమెరా పనితీరుకు సంబంధించి విప్లవాత్మక ప్యూర్‌వ్యూ ట్యాగ్ Nokia 9కు లభించడం దీన్నొక ప్రత్యేక ఫోన్‌గా పరిగణనలోకి తెచ్చింది. ఇక 4150 mAh సామర్థ్యంగల బ్యాటరీ ఉండటం ఈ ఫోన్‌కు మరింత ప్రత్యేకతను ఆపాదిస్తోంది. దీంతోపాటు 6 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేలోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండటం గమనార్హం. ఇది స్నాప్ డ్రాగన్ 845 SoC, 8 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో, IP68 సర్టిఫికేషన్‌తో రానుంది.
HUAWEI MATE 20 PRO
వా-వే కంపెనీ ప్రవేశపెట్టనున్న Mate 20 Pro ఫోన్ అప్పుడే అభిమానుల్లో ఉత్కంఠను సుడులు తిప్పుతోంది. తనకే సొంతమైన మూడు కెమెరాలు, LED flash కలసిన ‘నలు చదరపు’ డిజైన్‌తో రానుందీ ఫోన్. ఇది తమ ప్రతిష్ఠాత్మక కొత్త తరం ప్రాసెసర్ Kirin 980 SoCతో వస్తుందని వా-వే ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా యాపిల్ తాజా ఆవిష్కరణ A12 Bionic chipకన్నా వేగవంతమైనదని పేర్కొంటోంది. ఈ ఫోన్ కూడా ఒన్‌ప్లస్ తరహాలో వాటర్ డ్రాప్ నాచ్, 6.3 అంగుళాల డిస్‌ప్లేతో రాబోతోంది. ఇందులో Mali G76 MP10 GPU, AI processing Unit, DDR4 ర్యామ్‌సహా 4,000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే డిస్‌ప్లేలోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
గమనిక: Huawei Mate 20 Pro అక్టోబరు 16న విడుదల కాబోతోంది.
SAMSUNG GALAXY A9 STAR PRO
శామ్‌సంగ్ నుంచి రాబోతున్న మరో పెద్ద కుదుపు Samsung Galaxy A9 Star Pro అని సమాచారం. ఇటీవలే Galaxy A7ను ట్రిపుల్ కెమెరాతో తెచ్చిన ఈ కంపెనీ తాజా ఉత్పత్తిలో తొలిసారిగా నాలుగు కెమెరాల సెటప్‌ను ప్రవేశపెట్టనుందని కథనాలు వస్తున్నాయి. ఆ విధంగా విశిష్ట పరిజ్ఞాన వినియోగాన్ని తన ప్రతిష్టాత్మక ఉత్పత్తులకే పరిమితం చేయకుండా అన్ని విభాగాల ఫోన్లపైనా దృష్టి సారిస్తున్నదట! ఇక Galaxy A9 Star Proలో 6.28 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 GB ర్యామ్, మైక్రో ఎస్డీ కార్డుతో 512 GBదాకా విస్తరించుకోగల 128 GB అంతర్గత మెమరీ, 3720 mAh బ్యాటరీ ఉంటాయి. ఇక నాలుగు కెమెరాలలో ఒక ప్రధాన కెమెరా, డెప్త్ సెన్సర్, వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫొటో లెన్స్ ఉంటాయి.
గమనిక: Samsung Galaxy A9 Star Proను ఈ నెల 11న శామ్‌సంగ్ ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేయనుంది.