‘‘వాటర్‌డ్రాప్ నాచ్’’ ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు కలవరిస్తున్న కొత్త ఫీచర్. నిరుడు iPhone X విడుదలైన తర్వాత ‘నాచ్’ ఒక ప్రధానాంశమైంది. అప్పటినుంచి ఒక్క శామ్‌సంగ్ మినహా దాదాపు అన్ని ఫోన్ బ్రాండ్లు దీన్ని అనుసరించాయి. ఇప్పుడు అది కూడా పాతబడిపోగా, తాజా ట్రెండ్‌గా ‘‘వాటర్‌డ్రాప్’’ నాచ్ (ఫోన్ స్క్రీన్ ఎగువన మధ్యలో నీటి బిందువు ఆకారపు రంధ్రం) రంగ ప్రవేశం చేసింది. దీన్ని మొట్టమొదట ESSENTIAL తన ఫోన్‌లో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అన్ని కంపెనీలూ ఇదే బాటపట్టాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ తొలివారంలో OPPO కంపెనీ తన Oppo F9 Proను వాటర్‌డ్రాప్ నాచ్‌తో విడుదల చేసింది. అయితే, ఈ ఫీచర్‌ను తొలిసారి ప్రవేశపెట్టింది తానేనని ప్రకటించింది. అలాగే VIVO కూడా Vivo V11 Proను వాటర్‌డ్రాప్ నాచ్‌తో విడుదల చేసింది. ఈ క్రమంలో చాలా కంపెనీలు దీన్ని అనుసరించేందుకు సిద్ధమయ్యాయి. ఆ మేరకు వా-వే (Huawei) అక్టోబరు 16న Mate 20తోపాటు Mate 20 Pro స్మార్ట్ ఫోన్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇవి కూడ వాటర్‌డ్రాప్ నాచ్‌తో రానున్నాయని సమాచారం. అదేవిధంగా OnePlus కూడా తన తాజా OnePlus 6Tని ఇదే ఫీచర్‌తో ప్రవేశపెట్టబోతోందని భోగట్టా.
నాచ్ ఆకారం మారడంలో విశేషమేమిటి?
సాధారణంగా స్మార్ట్ ఫోన్లపై కనిపించే నాచ్‌లో స్పీకర్, ఫ్రంట్ కెమెరాలు, ఇతర సెన్సర్లు ఉంటాయి. అయితే, దీనితో పోలిస్తే వాటర్‌డ్రాప్ నాచ్ నీటిచుక్క ఆకారంలో చిన్నదిగా ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ చోటు కల్పించడం అంత సులభం కాదు. ఇది ఆకర్షణీయమైన డిజైన్ అనడంలో సందేహం లేదుగానీ, దీని పనితీరుపైనే కాస్తంత సందిగ్ధం నెలకొంది. ఫోన్ల తయారీలో ఇప్పుడు ఇదొక ప్రధానాంశంగా మారిన నేపథ్యంలో వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తున్న Realme 2 అందరికీ అందుబాటులో రూ.8,990 ప్రారంభ ధరనుంచి లభిస్తుందని ఆ కంపెనీ ప్రకటించటం విశేషం. ప్రస్తుతం వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తున్న ఫోన్ల కనీస ధర ఇంచుమించు రూ.25,000గా ఉన్నందువల్ల స్మార్ట్ ఫోన్ల పరిశ్రమలో ఈ కొత్త రకం నాచ్ ఒక సరికొత్త ప్రమాణంగా మారబోతోందా!