అతి తక్కువ సమయంలో వినియోగదారుల మన్ననలను పొందిన ఫోన్లలో షియోమి రెడ్‌మి ముందంజలో ఉంటుంది. ఈ సిరీస్‌లో వచ్చిన ఫోన్లు భారత్‌లో ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు వెర్షన్లలో మార్పులు చేస్తూ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయడంలో షియోమి ముందంజలో ఉంటుంది. ఈ నేపథ్యంలో మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి దింపింది షియోమి. మంగవారమే రెడ్‌మి 4 మోడల్‌ను విడుదల చేసింది. గత మోడల్స్‌తో పోలిస్తే మెరుగైన ఫీచర్లతో రెడ్ మి 4 మొబైల్ యూజర్ల ముందుకు వచ్చింది. ఈ మోడల్‌లో ఉన్న ఆ కొత్త ఫీచర్లు ఏంటో చూద్దామా..
అమెజాన్‌లో మాత్రమే..
షియోమి రెడ్ మి 4 సిరీస్ ఫోన్‌ను దిల్లీ వేదికగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలోనే రెడ్ మి 4 ప్రైమ్ మోడల్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ ఆన్‌లైన్లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడానికి కూడా షియోమి ఏర్పట్లు పూర్తి చేసింది. నిజానికి రెడ్ మి 4,రెడ్ మి ప్రైమ్ మోడల్స్‌ను గత ఏడాది నవంబర్లో చైనాలో లాంచ్ చేశారు. వాటితో పాటే జియోమి రెడ్‌మి 4ఏను కూడా రంగంలోకి తీసుకొచ్చారు. రెడ్మి 4ఏ భారత్‌లోనూ ఈ మార్చి నుంచి లభ్యమవుతుంది. అందుకే రెడ్ మి 4, ప్రైమ్ మోడల్స్‌ను కూడా రంగంలోకి తీసుకొచ్చి విజయవంతం చేయాలనేది రెడ్ మి ఆలోచన. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రెడ్ మి 4, ప్రైమ్ అమ్మకాలకు సంబంధించిన ప్రకటనలు జోరుగాసాగుతున్నాయి. రెడ్ మి ఆన్‌లైన్ అమ్మకాలను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ చేపట్టింది. ఈ సైట్లో ఎక్స్‌క్లూజివ్‌గా రెడ్ మి 4 సిరీస్ ఫోన్లు లభ్యం కానున్నాయి.
రూ.6900, రూ.8900 ధరలతో
రెడ్ మి 4, ప్రైమ్ మోడల్స్ సుమారు రూ.6900, రూ.8900 ధరలలతో లభ్యం కానున్నాయి. లాంచింగ్ ఆఫర్ కింద ఇవి మరింత తక్కువ ధరకే దొరికే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణుల మాట. వినియోగదారులు ఈ మోడల్స్ పట్ల ఆసక్తి చూపించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. మెటల్ యూనిబాడీ డిజైన్‌తో, 2.5 డీ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లేతో, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌తో ఈ మోడల్స్ ప్రత్యేకంగా తయారయ్యాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ మరో అదనపు ఆప్షన్. గోల్డ్, గ్రే, సిల్వర్ రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మెల్లో సాఫ్ట్‌వేర్ వాడారు. 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీతో పాటు ఎస్‌డీ కార్డ్ ద్వారా 128 జీబీ వరకు పొడిగించుకునే అవకాశం ఉంది. 4100ఎంఏహెచ్ బ్యాటరీ మరో ఆకర్షణ. 3జీబీ ర్యామ్ ఉన్న ఈ ఫోన్ కచ్చితంగా అందర్ని ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.