ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న షియోమి అభిమానుల ఇది నిజంగా చేదులాంటి వార్తే. బడ్జెట్ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో ఫోన్లు తీసుకొచ్చి టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుంటున్న షియోమి తాజాగా కొన్ని ఫోన్లను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంఐ, రెడ్‌మీ బ్రాండ్‌లతో ప్రస్తుతం దూసుకుపోతున్న ఈ దిగ్గజం Mi Max, Mi Note ఫోన్లను ఆపి వేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ Lei Jun తెలిపారు.
సినిమాలు, గేమింగ్ ఆస్వాదించే వారి కోసం పెద్ద స్క్రీన్, పెద్ద బ్యాటరీతో ఎంఐ ‘మ్యాక్స్’ పేరిట పలు ఫోన్లను ఆ కంపెనీ గతంలో తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద తెరలను కోరుకునేవారిని అవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ ఫోన్ల ఉత్పత్తిని కంపెనీ తాత్కాలికంగా నిలిపివేయడంతో షియోమి యూజర్లకు నిరాశకు గురి అవుతున్నారు. మ్యాక్స్‌తో పాటు ఎంఐ నోట్ సిరీస్ నుంచి ఈ ఏడాది ఎలాంటి ఫోన్లనూ తీసుకురావడం లేదని ఆ కంపెనీ సీఈవో స్పష్టం చేశారు. అయితే, ఈ ఏడాది మాత్రమేనా? పూర్తిగానా? అన్నది స్పష్టత రాలేదు.
ప్రస్తుతానికి షామీ, రెడ్‌మీ బ్రాండ్లపై ప్రముఖంగా దృష్టి సారించినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన లీ జున్ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎంఐ మ్యాక్స్, ఎంఐ నోట్ సిరీస్ ఫోన్లను తీసుకొచ్చే యోచన లేదని చెప్పుకొచ్చారు. అంటే మ్యాక్స్ గానీ, ఎంఐ నోట్ సిరీస్‌లో గానీ ఫోన్ వచ్చేది 2020లోనే అన్నది ఆయన మాటల్లో తెలుస్తోంది! మరోవైపు కంపెనీ లక్ష్యాలను చూస్తుంటే ఈ ఫోన్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేసినా ఆశ్చర్యపోనవసరం లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు.
చివరిగా షియోమీ నుంచి ఎంఐ మ్యాక్స్ 3, ఎంఐ నోట్ 3 ఫోన్లు వచ్చాయి. జున్ మాటలను బట్టి ఎంఐ సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ ఫోన్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మిక్స్ సిరీస్‌లో హై ఎండ్ మొబైల్స్‌ను యథావిధిగా తీసుకొస్తారు. ఇటీవల సీసీ సిరీస్‌ను ప్రారంభించిన షియోమీ యువతే లక్ష్యంగా కొత్త ఫోన్లను తీసుకురానుంది. ఇవి ఎలా ఉండబోతున్నాయన్నది తెలియరాలేదు. ఇక రెడ్‌మీ బ్రాండ్‌లో బడ్జెట్ ధరల్లో ఫోన్లను కంపెనీ యథావిధిగా తీసుకురానుంది.