టెలికాం రంగంలో పెను ప్రకంపనలు రేపిన దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో విధ్వంసక ఆవిష్కరణతో దూసుకురానుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జియో ఫోన్ తో ఫీచర్ ఫోన్ మార్కెట్లో దిగ్గజాలకు సవాల్ విసిరిన ముఖేష్ అంబానీ జియో ఇప్పుడు జియో3 పేరుతో మరో ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురానుంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వినియోగదారుల్లో విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. మరికొన్ని నెలల్లో రిలయన్స్ వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో జియోఫోన్ 3 ఆవిష్కరణపై పలు ఊహాగానాలు దానికి సంబంధించిన చిత్రాలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా నిలిచాయి.
5 అంగుళాల టచ్ స్క్రీన్‌తో, పవర్‌ఫుల్ సాఫ్ట్‌వేర్ సహాయంతో చాలా స్మార్ట్‌గా జియో ఫోన్ 3ని ఆవిష్కరించనుంది. ఆండ్రాయిడ్ గో ఆధారితంగా 2జీబీ ర్యామ్, 64 స్టోరేజ్ సామర్ధ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రానుందట. అంతేకాదు 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరచినట్టు తెలుస్తోంది. ఇక జియో ఫోన్ 3 ధర విషయానికి వస్తే రూ. 4500 అందించనుందని అంచనా. ఈ ఏడాది జూన్‌లో జరిగే రిలయన్స్ జియో వార్షిక సమావేశంలో జియో ఫోన్ 3 స్మార్ట్‌గా వినియోగదారులను పలకరించనుంది.
జియో ఫోన్ పేరుతో ఫీచర్ల ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి, బడ్జెట్ ధరలో సామాన్యులకు మొబైల్ సేవలను మరింత దగ్గర చేసిన జియో స్మార్ట్ ఫీచర్లతో అందుబాటులో ధరలో స్మార్ట్‌ఫోన్ తీసుకువస్తే అంతకన్నా ఆందకరమైన విషయం ఇంకొకటి ఉండదన అభిమానులు కోరుకుంటున్నారు.