దేశీయ మొబైల్ మార్కెట్లోకి మరో సంచలన ఫోన్ జియో ఫోన్ 3 వచ్చేసింది. మొబైల్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఫోన్3ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధినేత ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏజీఎం మీటింగ్‌లో రూ.2,999 ధరతో జియో ఫోన్2ని ఆవిష్కరించామని, ఈసారి జియో ఫోన్3ని ఆవిష్కరిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ ప్రకటించారు. దీని ధర రూ.4,500 ఉండొచ్చని తెలిపారు. మరికొద్ది రోజల్లోనే దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
జియో ఫోన్3 ప్రత్యేకతలివే
4జీ స్మార్ట్ ఫీచర్లతో వస్తున్న జియో ఫోన్3ని మీడియా టెక్ చిప్‌సెట్‌తో తయారుచేశారు. గతంలో వచ్చిన జియో ఫోన్లకు క్వాల్కమ్, యూనిసాక్ చిప్‌సెట్‌లు వాడగా తాజా ఫోన్‌కు మాత్రం మీడియాటెక్ టెక్నాలజీ వాడారు. ఇది కాయ్(KAI) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జియో, జియో2 ఫోన్లలో ఫేస్‌బుక్, వాట్సాప్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. జియో3 ఫోన్‌లో వీటన్నింటినీ అప్‌డేట్ చేయడమే కాకుండా మరికొన్ని కొత్త ఫీచర్లు కూడా అందించనున్నట్లు సమాచారం. ఈ కొత్త ఫోన్ Media Tek ప్రాసెసర్‌తో జియో ఫోన్ 2కు అప్ గ్రేడ్ వెర్షన్‌గా ప్రత్యేక ఆకర్షణతో నిలువనుంది. జియో ఫోన్ 2 కన్నా ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యధిక వేగంగా డిజిటల్ ఫ్లాట్ ఫాంగా రిలయన్స్ జియో నిలిచిందని, రెండో అతిపెద్ద నెట్ వర్క్ గా జియో ఇప్పుడు ఉందని ఆయన తెలిపారు. రీటైల్ రంగంలో రిలయన్స్ 1లక్షా 30వేల కోట్ల బిజినెస్ చేసిందన్నారు. భారత్ లో అత్యధిక పన్నులు చెల్లించింది రిలయన్స్ మాత్రమేనని తెలిపారు. రిలయన్స్ చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని,పెట్రో కెమికల్స్ రంగంలో సౌదీ అరాంకో-రిలయన్స్ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. పెట్రో కెమికల్స్ లో విదేశీ పెట్టుబడుల్లో 20శాతం వాటా రిలయన్స్ లో ఉంటుందన్నారు. పెట్రో కెమికల్ కింద రూ.5.7లక్షల కోట్ల ఆదాయం వస్తుందని జియో అధినేత తెలిపారు.