• తాజా వార్తలు

శామ్ సంగ్ ఎస్ 8లో ఉన్నది.. ఐఫోన్ 7లో లేనిది..

ఈ ఏడాది శాంసంగ్ నుంచి వచ్చిన ముఖ్యమైన ఫోన్లలో గెలాక్సీ ఎస్ 8, ఎస్8+ కీలకమైనవి. యాపిల్, హ్యువాయ్, ఆసస్ కంపెనీల ఫ్లాగ్ షిప్ ఫోన్లేవీ వీటి దరిదాపుల్లోకి రానట్లుగా అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా యాపిల్ నుంచి ఎలాంటి పోటీ లేకుండా చేయడం లక్ష్యంగా ఎస్ 8, ఎస్8+లలో కొన్ని కొత్త ఫీచర్లు తీసుకొచ్చారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ ఫోన్లోనూ లేనట్టి పలు ఫీచర్లు ఎస్ 8 సిరీస్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఇంతవరకు లేని ఆరు ఫీచర్లు వీటిని ప్రత్యేకంగా నిలిపాయని టెక్ ప్రపంచం చెబుతోంది.
డిస్ ప్లే
గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8+లో ఇన్ఫినిటీ డిస్ ప్లే పేరుతో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు. క్వాడ్ హెచ్ డీ+ అమోలెడ్ సూపర్ ప్యానల్స్ ఇందులో వాడారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వినియోగించడం వల్ల మరింత ధ్రుఢంగా ఉంటుంది. ఇందులో స్క్రీన్, బాడీ రేషియో 83.6 శాతంగా ఉండగా యాపిల్ ఐఫోన్ 7లో ఇది కేవలం 65.6 శాతం మాత్రమే.
ఫేస్ రికగ్నిషన్
ఎస్ 8, ఎస్ 8+లో ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ ప్రత్యేకం. ఇది అదనపు సెక్యూరిటీ ఫీచర్ గా పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకట్టుకోనుంది. ఐఫోన్ 7, 7+లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ లేదు. సెక్యూరిటీ పరంగా ఐపోన్లలో ఇప్పటివరకు ఫింగర్ ప్రింట్ సెన్సార్లు మాత్రమే హై ఎండ్ టెక్ ఫీచర్ గా చెప్పుకోవాలి.
గిగాబైట్ ఎల్టీఈ సపోర్టు
ప్రపంచంలో ఇంతవరకు ఏ స్మార్టు ఫోన్లోనూ లేని ఫీచర్ గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8+లో ఉంది. గిగా బైట్ ఎల్టీఈ సపోర్టు ఫీచర్ తో ఇది వస్తోంది. అంటే వెయ్యి ఎంబీపీఎస్ వేగం వరకు ఇందులో సాధ్యమవుతుంది. ఐఫోన్ 7, 7+లో కూడా అత్యధికంగా 450 ఎంబీపీఎస్ వరకే సాధ్యం.
బ్లూటూత్ వీ5.0
బ్లూటూత్ వీ5.0 వైర్ లెస్ టెక్నాలజీతో వస్తున్న తొలి ఫోన్లు కూడా ఇవే. ఈ రెండు మోడళ్లలోనూ ఇది ఉంది. దీనివల్ల ఏకకాలంలో రెండు వైర్ లెస్ హెడ్ ఫోన్లకు కనెక్టు కావొచ్చు. బ్లూటూత్ 5.0 టెక్నాలజీలో వేగం, తరంగా రేంజి మరింత ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్ 7, 7+లలో బ్లూటూత్ 4.2 వెర్షన్ వాడుతున్నారు.
వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్
శాంసంగ్ స్మార్టు ఫోన్లలో వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కొత్తేమీ కాదు. గెలాక్సీ ఎస్ 7లోనూ ఈ ఫీచర్ ఉంది. ఇప్పుడు ఎస్ 8 సిరీస్ ఫోన్లలోనూ ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఐఫోన్ 7 సిరీస్ లో ఇలాంటి ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ లేదు.
చిప్ సెట్లలోనూ టాప్ రేంజికి..
ఇంతవరకు స్మార్టు ఫోన్ల చిప్ సెట్ల విషయంలో యాపిల్ ని మించింది లేదు. కానీ ఇప్పుడు ఎస్ 8, ఎస్ 8+లలో 10 నానో మీటర్ల ప్రాసెసర్లను వాడుతున్నారు. ప్రపంచంలో ఇలాంటి ప్రాసెసర్లను వినియోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మొత్తానికి ఐఫోన్ల తలదన్నేలా శాంసంగ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అత్యాధునిక మొబైల్ ఫోన్ ను తీసుకొచ్చినట్లయింది.