అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి విదేశాల నుంచి అక్కడికి వెళ్లి చదువుకునే అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమ వాళ్ల జాబ్స్‌ను ఇండియన్స్ వంటి ఇతరదేశాల వారు తన్నుకుపోతున్నారని ట్రంప్ హెచ్1 బీ వీసాలను టైట్ చేసేశారు. దీంతో ఇప్పుడు అమెరికాలో ఉండి చదువుకుంటున్న ఇండియన్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆల్టర్నేటివ్‌గా ఈబీ 5 వీసా (EB-5 visa)ల వైపు చూస్తున్నారు. ఇన్వెస్టర్స్ వీసాగా పిలుచుకునే ఈ వీసాలు ఇప్పుడు లైమ్‌లైట్లోకి వచ్చాయి.
ఏంటీ ఇన్వెస్టర్స్ వీసా
అమెరికాలో ఉన్న కంపెనీల్లో ఉద్యోగం సంపాదించి అక్కడ స్థిరపడడానికి హెచ్1 బీ వీసాలు పనికొస్తాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ వీసా దొరకడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త మనీ బేర్ చేయగలిగిన ఇతరదేశాల వారికి ఇన్వెస్టర్స్ వీసా మంచి అవకాశంగా కనిపిస్తుంది. ఈబీ 5 వీసా తీసుకోవాలంటే ఏదైనా కొత్త కమర్షియల్ ప్రాజెక్ట్‌లో 1 మిలియన్ డాలర్స్ ( 6.5 కోట్ల రూపాయలు) ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే అన్ ఎంప్లాయిమెంట్ ఎక్కువగా ఉన్న రూరల్ ఏరియాల్లో ఎంప్లాయిమెంట్ కల్పించే ప్రాజెక్ట్‌లో హాఫ్ మిలియన్ డాలర్స్ (3కోట్ల 25 లక్షల రూపాయలు) ఇన్వెస్ట్ చేయాలి. ఈ రెండింట్లో ఏదైనా సరే కనీసం 10 మంది యూఎస్ వర్కర్స్‌కు పర్మినెంట్ ఫుల్ టైమ్ జాబ్ చూపించగలగాలి. అలాంటివారికి ఈ ఇన్వెస్టర్స్ వీసా ఇస్తారు. ఇన్వెస్ట్‌మెంట్‌తో కొత్తగా కంపెనీ పెట్టొచ్చు. లేదంటే ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్స్‌లో రీజనల్ సెంటర్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్కువగా రెండో మార్గాన్నే అందరూ చూస్తున్నారు.
ఇవీ లాభాలు
* ఈ వీసా తీసుకుంటే అమెరికన్ గ్రీన్ కార్డ్ రావడానికి వెయిటింగ్‌లో కనీసం పదేళ్లు తగ్గిస్తారు.
* అంతేకాదు ఇలా ఇన్వెస్ట్ చేసిన వారి పిల్లలు ఎవరి కార్పొరేట్ స్పాన్సర్‌షిప్ లేకుండా యూఎస్‌లో ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు.
* ఇన్వెస్టర్స్‌కు, అతని భార్యకు, 21 ఏళ్లలోపు పిల్లలకు కండిషనల్ పర్మనెంట్ రెసిడెన్స్ ఇస్తారు. రెండేళ్ల తర్వాత అప్లయి చేసుకుంటే కండిషన్స్ ఎత్తేసే ఛాన్స్ ఉంది. ఇక అప్పుడు శాశ్వతంగా అక్కడే ఉండి పని చేసుకోవచ్చు.
ఇండియన్స్ చూపు అటువైపు..
యూఎస్ గవర్నమెంట్ కూడా ఈ వీసాలమీద ఆసక్తిగానే ఉంది. వీటికి అప్లయి చేసుకోవడానికి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు టైం పెంచింది. తర్వాత మళ్లీ దాన్ని డిసెంబర్ 8 వరకు ఎక్స్‌టెండ్ చేసింది. దీంతో ఇండియా నుంచి హెచ్1బీ వీసా కోసం వెళ్లేవారిలో కాస్త స్థితిమంతులు ఈ అమౌంట్‌ను ఎడ్జస్ట్ చేసి పిల్లలకు ఇన్వెస్టర్ వీసా తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.