దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ ‘‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’’ (TCS) డిజిటల్ రిక్రూట్‌మెంట్‌ద్వారా మాత్రమే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటోంది. ఏమిటీ 100 శాతం డిజిటల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ? ఇంతకుముందు అనుసరించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో తమ సిబ్బంది సాయంతో కళాశాలల ప్రాంగణాల్లో పరీక్షలు, ఇంటర్వ్యూలు వగైరా నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసేది. ఈ తంతు పూర్తయ్యేసరికి 3 నుంచి 4 నెలల సమయం పట్టేది. ఇప్పుడు డిజిటల్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఇదంతా కేవలం 3 లేదా 4 వారాల్లో ముగిసిపోతోంది. అంతేకాదు... లోగడ 1.4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటుండగా, ఇప్పుడు ఆన్‌లైన్ విధానంవల్ల ఆ సంఖ్య రెట్టింపై... 2.8 లక్షలకు పెరిగింది. అయితే, క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో పాటించిన ప్రాథమిక ఎంపిక ప్రక్రియలో మార్పేమీ లేదని, దాన్ని నిర్వహించే పద్ధతిని మాత్రమే మార్చామని టీసీఎస్ మానవ వనరుల విభాగం (HR) అంతర్జాతీయ వైస్-ప్రెసిడెంట్ అజయ్ ముఖర్జీ చెబుతున్నారు.
డిజిటల్ రిక్రూట్‌మెంట్ నిర్వహణ ఇలా:-
టీసీఎస్ ఈ ఏడాదినుంచే ‘నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్’ (NQT) పేరిట 100 శాతం డిజిటల్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనికి హాజరు కావడం కోసం 28 రాష్ట్రాల్లోని 100 నగరాల నుంచి 2.8 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. లోగడ క్యాంపస్ సెలెక్షన్ల కోసం టీసీఎస్ బృందం సుమారు 370 అక్రెడిటెడ్ కాలేజీలను మాత్రమే సందర్శించగలిగేది. అయితే, కొత్త విధానం ఫలితంగా కశ్మీర్‌లోని బారాముల్లా నుంచి ఈశాన్య భారతంలోని నాగాలాండ్ రాజధాని కోహిమా వరకూగల 2000 కాలేజీల విద్యార్థులకు అవకాశం లభించడం విశేషం. ఆ విధంగా నిరుటితో పోలిస్తే ఈ ఏడాది పరీక్షకు హాజరయ్యేవారి సంఖ్య 175 శాతం పెరిగింది. డిజిటల్ పరీక్ష ఫలితాల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేసి, వారున్న ప్రదేశాన్నిబట్టి ముఖాముఖి లేదా వీడియో కాన్ఫరెన్సింగ్‌ద్వారా ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే, దేశంలో అగ్రశ్రేణి విద్యా సంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలలో ఇంటర్వ్యూ ప్రక్రియను మాత్రం మార్చలేదు. మొత్తంమీద కొత్త పద్ధతిద్వారా ‘‘ప్రతిభాన్వేషణలో ప్రజాస్వామ్యీకరణ’’ సాధ్యమైందని టీసీఎస్ డిజిటల్ అసెస్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ‘iON’ అంతర్జాతీయ అధిపతి వెంగుస్వామి రామస్వామి చెప్పారు.
పేద విద్యార్థులకు టీసీఎస్ తోడ్పాటు
పేద విద్యార్థులు ఉద్యోగ సంసిద్ధత సాధించగలిగేలా వారికి శిక్షణ, సహాయం అందించాలని టీసీఎస్ ప్రశంసనీయ నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా బరోడాలోని మహారాజా శివాజీరావు విశ్వవిద్యాలయ కామర్స్ విభాగంతో ఒప్పందం కూడా చేసుకుంది. దీనికింద సామాజిక-ఆర్థిక వెనుకబాటు నేపథ్యంగల విద్యార్థులకు ఇంగ్లిష్, ఐటీ, ఇంటర్వ్యూ, సాఫ్ట్ స్కిల్స్ తదితరాల్లో శిక్షణ ఇప్పిస్తుంది. అయితే, వారి , కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకన్నా తక్కువగా ఉండాలి. ఇందులో భాగంగా తొలిదశలో సుమారు 1000 మంది B.Com విద్యార్థులకు శిక్షణ ఇప్పించడంతోపాటు వారు అర్హత ప్రమాణాలను అందుకోగలిగితే నేరుగా తమ సంస్థలోనే ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.