పెద్ద నోట్ల రద్దుతో ఇప్పుడు అకౌంట్‌లో ఎన్ని డబ్బులున్నా చేతిలో డబ్బులు ఆడే పరిస్థితి లేదు. బ్యాంకుల్లోనో, ఏటీఎంల ముందో గంటల తరబడి నిలబడితే దొరికితే ఓ రెండు వేలు దొరుకుతుంది. నాలుగైదు రోజుల లైన్లో నిలబడితేగానీ ఇంటి అద్దెకే డబ్బులు సమకూరడం లేదు. మరి పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాలు, ఉప్పు, పప్పులు వంటివన్నీ ఎలా తెచ్చుకోవాలి? ఇందుకోసం బోలెడన్ని ఆన్‌లైన్ స్టోర్లున్నాయి. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్, పెప్పర్ టాప్ వంటి ప్రముఖ స్టోర్లు ఆన్‌లైన్‌లో నిత్యావసరాలను అందుబాటులోకి తెచ్చేశాయి. గూగుల్ ప్లేస్టోర్‌లో వీటన్నింటికీ మొబైల్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కావలసిన యాప్‌ను మన స్మార్ట్ ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసుకుని మన ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఇంటి చిరునామా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత కావలసిన వస్తువులను ఎంపిక చేసుకుని ఆన్ లైన్‌లోనే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా బిల్లు కట్టేయవచ్చు. మీరుండే ప్రాంతాన్ని బట్టి కొన్ని గంటల వ్యవధిలోనే సరకులను నేరుగా ఇంటికే చేరవేస్తారు. దీనివల్ల టైం కూడా సేవ్ అవుతుంది. బస్సులోనో, కార్లోనో ఆఫీసుకు వెళుతూ కూడా మొబైల్‌యాప్‌తో ఆర్డర్ చేసేసుకోవచ్చు. కంప్యూటర్, లాప్ టాప్ లో నుంచి కావాలంటే సైట్లోకి వెళ్లి ఆర్డర్ చేయవచ్చు.
ఎన్నోసౌకర్యాలు
* చేతిలో డబ్బులుండాల్సిన పని లేదు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటివి చాలా ఉపయోగం.
* మనకు షాప్‌కు వెళ్లి కొనుక్కునే శ్రమ తప్పుతుంది. టైంతోపాటు బండిలోనో కారులోనే వెళితే పెట్రోలు ఖర్చు, ఆటోలోనో, బస్సులోనో వెళ్లేవారికి ఛార్జీ డబ్బులు మిగులుతాయి. వాటిని ప్రయాసపడి మోసుకుని తెచ్చుకోనక్కర్లేదు.
* సూపర్ మార్కెట్లకు వెళ్లి బిల్లులు కట్టడానికి కౌంటర్లు ముందు పడిగాపులు పడక్కర్లేదు.
* అన్నింటికంటే ముఖ్యంగా పప్పు, ఉప్పు కొనడానికి వెళ్లి కంటికి నదురుగా కనిపించినవన్నీ కొనేసి అరెరే ఈసారి బిల్లు ఎక్కువైపోయిందని బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఆప్‌లో ఏది కావాలంటే నేరుగా ఆ సెక్షన్‌లోకి వెళ్లి కొనుక్కోవచ్చు.
ఆఫర్లు.. డిస్కౌంట్లు
ఆన్‌లైన్‌లో నిత్యావసరాలు అమ్మే స్టోర్లు తమ అమ్మకాలు పెంచుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అవికాక ఎమ్మార్పీ ధరల మీద డిస్కౌంట్లు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలు లేదా వారంలో ఒకరోజు లేదా నెలలో మొదటివారం కొన్ని స్టోర్లు 20 నుంచి 25 శాతం వరకూ కూడా డిస్కౌంట్ లేదా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.
బిగ్‌బాస్కెట్
ఆన్‌లైన్ గ్రాసరీ స్టోర్స్‌లో బాగా పేరున్న యాప్‌ల్లో బిగ్‌బాస్కెట్ ఒకటి. దీన్ని ప్లేస్టోర్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలి. కూరగాయలు, పండ్లు, కిరాణా సరకులు, పాలు, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులు, బ్రెడ్, కేక్ వంటి బేకరీ ఉత్పత్తులు, చిన్నపిల్లల న్యాప్‌కిన్లు, వాళ్లకు కావల్సిన క్రీములు, సబ్బులు, పౌడర్లు ఇలా అన్నీ ఇందులో అందుబాటులో ఉంటాయి. మాంసం, చేపల వంటివి కూడా శుభ్రం చేసి ప్యాకెట్లో పెట్టి అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే వారికి సమయం కలిసొచ్చేలా కూరగాయలు కోసి నేరుగా వండుకునేందుకు సిద్ధంగా దొరుకుతాయి. పండ్లు కూడా ముక్కలుగా కోసి నేరుగా తినేసేలా ప్యాక్ చేసి ఉంటాయి. ఎమ్మార్పీ ధరలపై డిస్కౌంట్లు ఉంటాయి.
ఐసీఐసీఐ ప్యాకెట్స్‌తో బిగ్‌బాస్కెట్ యాప్ లో మంగళవారం కొనుగోలు చేస్తే 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ జిప్‌జాప్ కార్డుతో 1200 రూపాయల సరకులు కొంటే 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు.
మొబీక్విక్ వాలెట్‌తోనూ 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు.
గ్రోఫర్స్
ఆన్‌లైన్ గ్రాసరీ స్టోర్స్‌లో మరో పేరున్న కంపెనీ గ్రోఫర్స్. దీనిలో కూడా కూరగాయలు, పండ్లు, కిరాణా సరకులు, పాలు, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులు, బ్రెడ్, కేక్ వంటి బేకరీ ఉత్పత్తులు, మాంసం, చేపలతోపాటు చిన్నపిల్లల సామగ్రి అన్నీ అందుబాటులో ఉంటాయి. పువ్వులు , పూలబొకేలు కూడా దొరుకుతాయి. ఇద్దరూ ఉద్యోగస్తులైతే వారికి సమయం కలిసొచ్చేలా కూరగాయలు కోసి నేరుగా వండుకునేందుకు సిద్ధంగా దొరుకుతాయి. పండ్లు కూడా ముక్కలుగా కోసి నేరుగా తినేసేలా ప్యాక్ చేసి ఉంటాయి. ఎమ్మార్పీ ధరలపై డిస్కౌంట్లు ఉంటాయి. పేస్టుల మీద 15%, సబ్బలు, @ఆంపూల మీద 20% వరకు పప్పుల మీద 30 % వరకు ఎమ్మార్పీలో డిస్కౌంట్ ఇస్తున్నారు.
మొదటి మూడు ఆర్డర్లకు 20 % వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు.
ఎక్్సప్రెస్ డెలివరీ పద్ధతిలో సరకులు ఆర్డరు ఇస్తే అదే రోజు వెంటనే డెలివరీ చేసేస్తారు. 10 శాతం క్యా@బ్యాక్ ఇస్తున్నారు.
పెప్పర్ టాప్ , సబ్జీదో వంటి బోలెడు యాప్ లు కూడా న్నాయి. ఆఫర్లు, సరకు నాణ్యత, డెలివరీకి పట్టే సమయం ఒక్కోసారి చెక్ చేసుకుని మంచి వాటిలో కొనుక్కోవచ్చు. పోటీ ఉండడంతో దాదాపు అందరూ మెరుగైనవే ఇస్తున్నారు. ఎంపిక మీదే ఇక.