• తాజా వార్తలు

ఫ్లాష్ సేల్స్ వెన‌క దాగి ఉన్న కొన్ని ప‌చ్చి నిజాలు

షియోమి ఫోన్ కొనాలనుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ ఆ కంపెనీ ఫ్లాష్ సేల్ గురించి తెలిసే ఉంటుంది. ఫోన్ కొందామ‌ని ప్ర‌య‌త్నిస్తే నిముషాల్లోనే స్టాక్ అయిపోవ‌డం, మ‌ళ్లీ త‌ర్వాత ఫ్లాష్‌సేల్ వ‌ర‌కు వేచి ఉండాల్సి రావ‌డం చాలామందికి అనుభ‌వం కూడా. అస‌లు ఈ ఫ్లాష్ సేల్ ఉద్దేశ‌మేంటి?  దీనిలో మంచి ఎంత‌?  చెడు ఎంత‌? అనే వాస్త‌వాలు తెలుసుకోండి మ‌రి..

ఎందుకీ ఫ్లాష్ సేల్‌?
చిన్న కంపెనీలు భారీగా పెట్టుబ‌డి పెట్టి ఎక్కువ సెల్‌ఫోన్లు త‌యారుచేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే అది కొనుగోలుదారును ఆకట్టుకోలేక‌పోయింద‌నుకోండి.  ఈ ఫోన్లు అమ్ముకోలేక కంపెనీలు దివాళా తీసేస్తాయి. అందుకే త‌మ ప్రొడ‌క్ట్‌ను క‌స్ట‌మ‌ర్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలుసుకోవ‌డానికి వంద‌ల్లోనే ఫోన్లు త‌యారుచేసి  ఫ్లాష్ సేల్ అని పెడ‌తాయి. మోడ‌ల్ క్లిక్ అయి యూజ‌ర్లు కొన‌డానికి ఇంట్ర‌స్ట్ చూపిస్తుంటే అప్పుడు మ‌రిన్ని ఫోన్లు త‌యారుచేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఇది చిన్న కంపెనీల‌ను కాపాడే వ్యాపార సూత్రం.

షియోమి ఏం చేస్తుందంటే?
ఈ చిన్న వ్యాపార సూత్రంతో షియోమి భారీ లాభాలు మూటగ‌ట్టుకుంటోంది. అస‌లు ఈరోజు ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టాప్ బ్రాండ్‌గా షియోమి నిల‌బ‌డ‌డ‌డానికి ఈ ఫ్లాష్ సేల్ కాన్సెప్ట్ కూడా ఓ కార‌ణ‌మంటే న‌మ్మి తీరాలి. ఎందుకంటే షియోమి స్థాయి నాణ్య‌త క‌లిగి, అదే ప్రైస్ రేంజ్‌లో వ‌చ్చే చాలాఫోన్లు మార్కెట్లో  క‌స్ట‌మ‌ర్‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాయి. కానీ షియోమి క్లిక్క‌యిందంటే కార‌ణం ప్రొడ‌క్ట్ మీద క్యూరియాసిటీ క్రియేట్ చేయ‌డ‌మే. అందుకే ప్రొడ‌క్ట్ పేరు చెప్పి, వాటి చిత్రాలు రిలీజ్ చేసి, యాడ్స్ ఇచ్చి ఫ్లాష్ సేల్ అని డేట్‌, టైమ్ ప్ర‌క‌టిస్తుంది.  మూడు, నాలుగు ల‌క్ష‌ల ఫోన్లు ఫ్లాష్‌సేల్‌లో పెడుతున్నామ‌ని చెబుతుంది. కానీ వాస్త‌వానికి అన్ని పెట్ట‌దు. చాలామంది ఒకేసారి ఈ ఫోన్ కొన‌డానికి ట్రై చేస్తారు. వెంట‌నే స్టాక్ అయిపోతుంది. అది ఆటోమేటిగ్గా హైప్ క్రియేట్ చేస్తుంది. త‌ర్వాత ఫ్లాష్ సేల్ ఎప్పుడా అని క‌స్ట‌మ‌ర్లు ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తారు. 

న‌ష్ట‌మేంటి?
నిజంగా ఫోన్ కొనాల‌నుకున్న‌వారికి చిరాకు వ‌స్తుంది. కొంత‌మంది ఆ వెయిటింగ్ భ‌రించ‌లేక బ‌య‌ట ఎక్కువ రేట్ పెట్టి కొన‌డానికి కూడా సిద్ధ‌ప‌డుతున్నారు. చాలామంది ఆఫ్‌లైన్ స్టోర్ య‌జమానులు ప‌దుల సంఖ్య‌లో ఐడీల‌తో ఫ్లాష్ సేల్‌లో ఈ ఫోన్లు కొని బ్లాక్‌లో ఎక్క‌వకు అమ్ముతున్నారు. యాపిల్‌, శాంసంగ్‌లాంటి దిగ్గ‌జాలే త‌మ ఫోన్ల‌ను డిస్కౌంట్‌లో అమ్మ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే షియోమి లాంటి ఓ చైనా కంపెనీ త‌న ఫోన్ల‌ను బ్లాక్‌లో ఎక్కువ రేట్‌కు క‌స్ట‌మ‌ర్‌ను కొనుక్కునేలా చేయ‌డం ఆ ఫోన్ మీద వ‌చ్చిన హైప్‌కు నిద‌ర్శ‌నం. ఈ హైప్ చూసి చాలామంది ఫ్లాష్ సేల్ అంటేనే చిరాకుప‌డుతున్నారు. త‌క్కువ సంఖ్య‌లో ఫోన్లు త‌యారుచేసి అమ్ముకోవాల‌నుకునే చిన్న కంపెనీల‌కు ఇది మైన‌స్ అవుతోంది. 

ఒప్పోలా ఆలోచిస్తే..
షియోమి, ఒప్పో ఇప్పుడంటే ఇండియ‌న్ మార్కెట్‌లో హ‌వా న‌డిపిస్తున్నాయి కానీ ఒక‌ప్పుడు వాటికి అంత సీన్ లేదు. అవి త‌క్కువ ఫోన్లు తయారుచేసి ఫ్లాష్‌సేల్‌లో అమ్మేవి. త‌ర్వాత వాటికి మార్కెట్ పెరిగాక ఒప్పో ఈ ఫ్లాష్ సేల్ ఆపేసింది. కానీ షియోమి ఇంకా దాన్నే కొన‌సాగిస్తూ యూజ‌ర్ల‌ను చికాకు పెడుతోంది. 
 

జన రంజకమైన వార్తలు