మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగింపు అనగానే డీలా పడిపోయిన ఈకామర్స్ కంపెనీలకు ఆ తర్వాత కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలు చూసి ప్రాణం లేచొచ్చింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆన్‌లైన్ ద్వారా నిత్యావసర సరకులే కాకుండా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఇతర వస్తువులు కూడా అమ్ముకోవడానికి గవర్నమెంట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈకామర్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని మళ్లీ పట్టాలపైకి తీసుకొచ్చేందుకు మార్గం ఏర్పడింది.
ఓకే అని.. వద్దని
వాస్తవానికి రెండో విడత లాక్‌డౌన్ పొడిగించినప్పుడే ఈకామర్స్‌లో అన్ని వస్తువులు అమ్ముకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కానీ ఆ వెంటనే నిత్యావసరాలు మాత్రమే సప్లయి చేయాలని సవరణ చేసింది. దీంతో ఈకామర్స్ కంపెనీలు నీరసపడిపోయాయి.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రిక్వెస్ట్‌లు
లాక్డౌన్‌లో ప్రజలకు నిత్యావసరాలే కాక స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ యాక్సెసరీలు, వర్క్ ఫ్రం హోమ్‌కు కావాల్సిన ఎక్విప్‌మెంట్ ఇలా చాలా అవసరమవుతున్నాయని.. వాటికోసం వారు బయటికెళ్లే పని లేకుండా తమకు అమ్ముకోవడానికి అవకాశమివ్వాలని నాలుగైదు రోజుల కిందట అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్‌ను కోరాయి. తమ డెలివరీ బాయ్స్ ప్యాకేజీలను కరోనా వైరస్ బారినపడకుండా సురక్షితమైన పద్ధతుల్లో కస్టమర్‌కు చేరుస్తారని హామీ కూడా ఇచ్చాయి. కేంద్రం ఈ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేసినట్లే కనిపిస్తోంది.
రెడ్‌జోన్లలో నో
అయితే రెడ్‌జోన్లలో మాత్రం కేవలం నిత్యావసరాలు సరఫరా చేయడానికే పర్మిషన్ కొనసాగించింది. ఇక్కడ ఇతర వస్తువులు అమ్మడానికి ఈకామర్స్ కంపెనీలకు అవకాశం ఇవ్వలేదు.
సెల్‌ఫోన్ తయారీదార్లలో ఉత్సాహం
ఈకామర్స్ కంపెనీలకు గ్రీన్, ఆరంజ్ జోన్లలో అన్ని వస్తువులు విక్రయించుకోవడానికి అవకాశం ఇవ్వడంతో సెల్‌ఫోన్ కంపెనీలు ఉత్సాహం తెచ్చుకున్నాయి. నియంత్రణలను ప్రభుతత్వం సడలించడంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త ఫోన్లను లాంఛ్ చేసేందుకు సన్నద్ధమయ్యాయి. వన్‌ప్లస్ 8 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అలాగే యాపిల్ తన కొత్త ఐఫోన్ ఎస్ఈను అమ్మకానికి పెట్టబోతోంది. ఇంకా అన్ని కంపెనీలు ఇదే పనిలో ఉన్నాయి. అయితే లాక్‌డౌన్‌తో దేశంలో మెజార్టీ ప్రజల చేతిల్లో చిల్లిగవ్వలేదు. ఈ పరిస్థితుల్లో బిజినెస్ ఏమాత్రం ఉంటుందన్న ఆందోళన కంపెనీల్లో కనిపిస్తోంది.