విప్లవాత్మక మార్పులకు తపాలా శాఖ శ్రీకారం చుట్టింది. దేశంలో బ్యాంకింగ్ రంగం నానాటికీ విస్తరిస్తుండటంతో పాటు డిజిటల్ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో ఉనికి కాపాడుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే పోస్టల్ ఏటీఎం సేవలు, డెబిట్ కార్డును అందిస్తున్న తపాలా శాఖ ఇక నుంచి ఆధార్ కార్డు ఆధారిత బ్యాంకింగ్ సేవలను అందించబోతోంది. ప్రధాని మోదీ నిత్యం పఠిస్తున్న `డిజిటల్ ఇండియా`ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు `ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ)`ను ప్రారంభించింది. బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోని మారుమూల గ్రామాలే లక్ష్యంగా పోస్టల్ బ్యాంకింగ్‌ను తీసుకొచ్చింది. దేశంలో ఇదే పెద్ద ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా మరింత మంది వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ఐపీపీబీకి సంబంధించి ఏడు ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం!
* దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ నెట్‌వర్క్‌గా ఐపీపీబీ నిలవనుంది. సుమారు 1.55లక్షల పోస్టాఫీసులు దేశంలో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు బ్యాంకింగ్ అవుట్‌లెట్స్‌గా మారబోతున్నాయి. ప్రస్తుతం దీనికి పోటీగా 30వేల బ్రాంచ్‌లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 100 శాతం కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం ఉంది.
* దేశంలో సుమారు 19 కోట్ల మందికి ఇంకా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. కనీసం వీరికి బ్యాంక్ అకౌంట్ కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం తొలి రోజు 650 పోస్టల్ శాఖ బ్రాంచ్‌లు, 3,250 యాక్సెస్ పాయింట్లలో ఈ సేవలు అందనున్నాయి. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కోసం ఐపీపీబీని ప్రవేశపెట్టింది.
* సుమారు 3 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ్ డాక్ సేవక్‌లను పోస్టల్ శాఖ రిక్రూట్ చేసుకోనుంది. వీరికి బ్యాంకింగ్ శిక్షణ అందించనుంది. వీరే గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా బ్యాంకింగ్ సేవలను తీసుకువెళ్లడంలో వీళ్లే కీలక పాత్ర పోషించబోతున్నారు. పోస్ట్‌మెన్‌లకు సాంకేతిక పరికరాలు అందించనున్నారు. దీని ప్రకారం పోస్టల్ సిబ్బంది ఇక నుంచి బ్యాంకు సిబ్బందిగా మారబోతున్నారు.
* 2017, జనవరి 30న రాయ్‌పూర్, రాంచీ పోస్టల్ బ్రాంచుల్లో పైలట్ ప్రాజెక్టును పోస్టల్ శాఖ ప్రారంభించింది.
* ఐపీపీబీలో సేవింగ్స్ ఖాతాపై నాలుగు శాతం వడ్డీ అందిస్తున్నారు. అంతేగాక వ్యక్తిగత, చిన్న పారిశ్రమల నుంచి రూ.లక్ష వరకూ డిపాజిట్‌ను స్వీకరిస్తాయి. డిపాజిట్‌లపై లోన్ ఇచ్చే సదుపాయం లేదు. జీరో బ్యాలెన్స్‌తో ఎవరైనా ఈ సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించవచ్చు.
* లోన్స్ విషయంలో మాత్రం ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్.. థర్డ్ పార్టీగా వ్యవహరించనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి వాటితో భాగస్వామిగా ఉండనుంది.
* ఐపీపీబీ ద్వారా అందించే సేవలు
- సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్
- మనీ ట్రాన్స్‌ఫర్
- Direct benefit transfers
- బిల్, యుటిలిటీ పేమెంట్స్
- Enterprise and merchant payments
- పోస్ట్‌మెన్ దగ్గర ఉండే పరికరం ద్వారా ఈ సేవలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇవి మినీ ఏటీఎంలుగా వ్యవహరిస్తాయి. త్వరలోనే ఐవీఆర్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఫోన్ బ్యాంకింగ్ సేవలు అందుతాయి. ప్రస్తుతం సుమారు 17 కోట్ల పోస్టల్ సేవింగ్స్ ఖాతాలన్నీ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్‌గా మారబోతున్నాయి.