• తాజా వార్తలు

అమెజాన్, ఫ్లిప్ కార్టులు కలిసిపోతాయట

8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 53,600 కోట్లు) ఆఫర్

భారత్ లోని ఈ-కామర్సు మార్కెట్లో తిరుగులేని సంస్థలుగా ఉన్న అమేజాన్, ఫ్లిప్ కార్టులు విలీనం కాబోతున్నాయా? అంటే, అవుననే అంటున్నాయి ఇన్వెస్టుమెంట్ వర్గాలు. అమేజాన్ లో విలీనమయ్యేందుకు ఫ్లిప్ కార్టు యోచిస్తోందని, ఈ మేరకు చర్చలు కూడా సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ రెండు కంపెనీల మధ్యా డీల్ కుదిరేలా ఉందని, ఆపై రెండూ విలీనమైతే కనుక, దక్షిణాసియాలో అతిపెద్ద ఈ-కామర్సు సంస్థ ఉద్భవిస్తుందని చర్చల గురించి తెలిసిన పలువురు చెబుతున్నారు.  2015 చివరి త్రైమాసికంలో ఇరు కంపెనీల టర్నోవర్ ఆధారంగా చర్చలు సాగుతున్నాయని, ఫ్లిప్ కార్టు ఇన్వెస్టర్లే ముందుండి వీటిని సాగిస్తున్నారని తెలుస్తోంది. అయితే, చర్చలు ఎంతకాలంలోగా ముగుస్తాయన్న విషయం మాత్రం తెలియరాలేదు.

రెండు కంపెనీల మధ్యా ప్రాథమిక చర్చల్లో భాగంగా 8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 53,600 కోట్లు) ఆఫర్ అమేజాన్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. గడచిన ఏడాదిన్నర వ్యవధిలో ఫ్లిప్ కార్ట్ లోకి పెట్టుబడులు గణనీయంగా వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ షేర్ల విలువ 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 73,700 కోట్లు)ని మోర్గాన్ స్టాన్లీ నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్ విభాగం నిర్ణయించింది. గత సంవత్సరం ఆరంభంలో సంస్థ విలువ అంచనాతో పోలిస్తే ఇది 27 శాతం తక్కువ కావడం గమనార్హం.  ఈ విషయంలో ఫ్లిప్ కార్టు సీఈఓ బిన్నీ బన్సాల్ స్పందన కోరగా, మార్కెట్ స్పెక్యులేషన్సు పై తాము స్పందించబోమని అన్నారు. భారత మార్కెట్లో తాము అగ్రస్థానంలో ఉన్నామని, దీర్ఘకాల వ్యూహాలతో విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. అమేజాన్ గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఫ్లిప్ కార్టులో చైనా ఈ-కామర్సు దిగ్గజం అలీబాబా వాటాలను కొనుగోలు చేయనుందని వార్తలు వచ్చిన సమయంలోనే ఈ డీల్ గురించిన సమాచారం బయటకు రావడం విశేషం.  కాగా, 2016లో 23 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.54 లక్షల కోట్లు)గా ఉన్న భారత ఈ-కామర్సు వాణిజ్యం 2020 నాటికి 69 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 4.62 లక్షల కోట్లు)కు పెరుగుతుందని గోల్టు మన్ సాక్స్ అంచనా వేస్తోంది.

అమెజాన్, ఫ్లిప్ కార్టుల విలీనంపై కొందరు తెలుగు మార్కెట్  నిపుణులు స్థానిక ఉదాహరణతో పోల్చి చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల్లో విద్యారంగంలో పాతుకుపోయిన భారీ సంస్థలు నారాయణ, చైతన్యలను ఉదహరిస్తున్నారు. పోటాపోటీగా సాగిన ఈ సంస్థలు చైనా బ్యాచ్ ల పేరుతో రెండూ కలవడం గురించి చెబుతున్నారు. అదేవిధంగా ఈ కామర్సులో అమెజాన్, ఫ్లిప్ కార్టులు కూడా కలిస్తే ఇండియన్ ఈ-కామర్సు రంగం మరింత దూసుకెళ్తుందని చెబుతున్నారు.

జన రంజకమైన వార్తలు