కన్ను కొడితే డబ్బులు ట్రాన్సఫరై వస్తువు మీ ఇంటికి కనుగొని దానికి పేటెంట్ ను పొందిన అమెజాన్ కన్ను కొడితే ఏమవుతుంది...? కోరుకున్న అమ్మాయి మన వెంట వస్తుంది.. లేదంటే చెంప ఛెళ్లుమనిపిస్తుంది. కానీ... ఓ చోట కన్ను కొడితే మాత్రం కోరుకున్న వస్తువు ఇంట్లో వాలుతుంది. ఆశ్చర్యపోతున్నారా... నిజమేనండీ.. ఈ కామర్సు జెయింట్ అమేజాన్ ఈ వినూత్న టెక్నాలజీని కనుగొని దానికి పేటెంట్ ను పొందింది. సాధారణంగా ఆన్ లైన్ మాధ్యమంగా ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలంటే, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలతో పాటు వన్ టైమ్ పాస్ వర్డును టైప్ చేయాలి. లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవాలి. కానీ.. అమెజాన్ మాత్రం కన్ను కొడితే వస్తువును ఇంటికి పంపిస్తుందట. సెల్ ఫోన్ లో నచ్చిన వస్తువును ఎంపిక చేసుకుని ఓసారి కన్ను కొడితే, ఆటోమేటిక్ గా మీ బ్యాంకు నుంచి డబ్బులు ట్రాన్సఫరై వస్తువు మీ ఇంటికి వచ్చేస్తుంది. ఈ విధానంలో ఎటువంటి సందేహాలకు తావులేదని కూడా అమేజాన్ చెబుతోంది. త్వరలోనే దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఇందుకోసం తొలుత ఒక్కసారి సెల్ఫీలను, ఆపై బ్యాంకు వివరాలను అమేజాన్ సైట్ కు అందించాల్సి వుంటుంది. కాగా, గతంలో మాస్టర్ కార్డు సెల్ఫీతో చెల్లింపులను పరిచయం చేస్తూ, 'సెల్ఫీ పే'ను అభివృద్ధి చేసినప్పటికీ, అందులో మోసాలు జరిగే అవకాశాలు ఉండటంతో పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఈ కొత్త టెక్నాలజీలో కెమెరా ఎదురుగా ఉన్నది తమ కస్టమరేనన్న విషయం మరింత స్పష్టంగా నిర్థారణ అవుతుందని అమేజాన్ చెబుతోంది. ఒకవేళ కన్ను కొట్టడం ఇష్టం లేకపోతే ఇంకేదైనా హావభావాలను కూడా పాస్ వర్డుగా ఎంచుకోవచ్చట. |