ఇప్పుడు వాడుకోండి.. తర్వాత పే చేయండి (Pay later) కాన్సెప్ట్ ఇప్పుడు ఈ-కామర్స్‌లో మంచి ట్రెండింగ్‌లో ఉంది. ఒకరకంగా చెప్పాలంటే నెలాఖరులో చేతిలో చిల్లిగవ్వ ఆడని శాలరీ జీవులకు అప్పుడు కూడా కావాల్సినట్లు షాపింగ్ చేసుకోవడం లేదంటే సినిమాకో, ఊరికెళ్లడానికో టిక్కెట్ తీసుకోవడానికో ఈ పే లేటర్ ఆఫర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పేలేటర్, సింపల్ లాంటి ఫిన్‌టెక్ కంపెనీలు కేవలం ఈ కాన్సెప్ట్‌తోనే బిజినెస్‌ను నడుపుతున్నాయి. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ దిగ్గజాలు కూడా పే లేటర్ కాన్సెప్ట్‌తో యూజర్లకు మరింత చేరువవుతున్నాయి.
అసలేంటీ కాన్సెప్ట్?
ఇండియా జనాభా 125 కోట్లు. కానీ 3 కోట్ల 74 లక్షల మంది దగ్గర మాత్రమే క్రెడిట్ కార్డులున్నాయి. అంటే రఫ్‌గా ఓ 10 నుంచి 12 కోట్ల మందికి మాత్రమే క్రెడిట్ కార్డ్‌తో దక్కే వెసులుబాట్లు దక్కుతున్నాయి. మరి మిగిలినవారు ఏదైనా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేయాలంటే వాళ్ల డెబిట్ కార్డ్‌లో డబ్బులుండాలి లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి ఇంటికొచ్చాక చేతికి డబ్బులివ్వాలి. అయితే టికెట్స్, అత్యవసరంగా ఏదైనా ఆన్‌లైన్‌లో కొనాలంటే ఏ నెలాఖరో వచ్చి లేదంటే సమయానికి డబ్బులు లేకపోతే ఆ కొనుగోళ్లు ఆపుకుంటున్నారు. ఇదిగో ఇలాంటి కస్టమర్లతో కూడా వస్తువు కొనిపించడానికి వచ్చిన పద్ధతే పే లేటర్. ఈ పద్ధతిలో ఏదైనా కొంటే 15 రోజుల తర్వాత ఆ బిల్ కట్టొచ్చు. ఆ తర్వాత 3% వడ్డీ పడుతుంది. 15 రోజుల వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఇప్పుడు బాగానే నడుస్తోంది.
బాగానే క్లిక్కయింది.
యువత, చిరుద్యోగులు, సాఫ్ట్‌వేర్, బీపీవో ప్రొఫెషనల్స్ ఈ పే లేటర్ సర్వీస్‌ను బాగా వాడుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్‌తో బాగా హిట్టయ్యిన సర్వీస్ ఈ పే లేటర్ (ePayLater). నెలకు రూ.25 కోట్ల విలువైన ట్రాన్సాక్షన్ ఈ ఫ్లాట్‌ఫామ్ మీద జరుగుతున్నాయి. రోజుకు 6వేల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. వీటిని 10 వేలకు పెంచాలన్నది ఈ పే లేటర్ టార్గెట్. రైల్వే, బస్, మూవీ టిక్కెట్స్, ఫుడ్ ఆర్డర్లు ఎక్కువగా పే లేటర్ పద్ధతిలో చేస్తున్నారని ఈ పే లేటర్ ఫౌండర్ భట్టాచార్య చెప్పారు. కస్టమర్ క్రెడిట్ స్కోర్‌ను బట్టి 3వేల నుంచి 5వేల వరకు క్రెడిట్ ఇస్తున్నారు. మరో ఫిన్‌టెక్ కంపెనీ పేయూ ఇండియా.. లేజీ పే (LazyPay) పేరిట ఇలాంటి సర్వీస్‌నే అందిస్తోంది. తమ ట్రాన్సాక్షన్లలో 40% ఫుడ్ ఆర్డర్సేనని లేజీ పే చెబుతోంది. ఇక ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ కంపెనీలు, ఓలా లాంటి టాక్సీ ఎగ్రిగేటర్లు కూడా పే లేటర్ ఆప్షన్లు అందిస్తున్నాయి.
రైల్వే టికెట్ రిజర్వేషన్లకు పర్‌ఫెక్ట్
రైల్వే టికెట్ రిజర్వేషన్లకు, ముఖ్యంగా తత్కాల్‌లో రిజర్వేషన్ అంటే సెకన్స్‌లో పరిస్థితి మారిపోతుంది. మీరు పేమెంట్ డిటెయిల్స్ ( కార్డ్ నెంబర్, సీవీవీ నెంబర్, వాలిడిటీ) కొట్టి ఓటీపీ తీసుకుని నమోదు చేసేసరికి అక్కడ టికెట్స్ అయిపోయే ప్రమాదం ఉంది. పే లేటర్‌తో ఇవేవీ కొట్టాల్సిన పని ఉండదు కాబట్టి రైల్వే టికెట్ వెంటనే తీసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది కాబట్టి చాలామంది రైల్వే టికెట్ రిజర్వేషన్‌కు పే లేటర్ ఆప్షన్ వాడుతున్నారు. అబీబస్ లాంటి బస్ టికెట్ బుకింగ్ సైట్స్‌లోనూ ఈ ఫీచర్ ఉంది.