• తాజా వార్తలు

ఫోన్ లను ఆన్ లైన్ లో కొనడం వలన అదనపు ప్రయోజనాలు ఉన్నాయా?

 

శతాబ్దపు అత్యుత్తమ ఆవిష్కరణ లలో మొబైల్ ఫోన్ ఒకటిగా నిలుస్తుంది అనడం లో ఏం సందేహం లేదు. మొబైల్ ఫోన్ ల రాకతో కమ్యూనికేషన్ చాలా సులువు అయింది.దీనిపట్ల వినియోగదారులలో ఉన్న క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ పోతుంది. ప్రపంచం లో ఏ మూలన ఉన్నా సరే మనం ఎవరితోనైనా ఈ మొబైల్ సహాయం తో ఇట్టే మాట్లాడుకోవచ్చు అనే విషయం లో ఏ సందేహం లేదు. ఇక మొబైల్ ఫోన్ లు అప్ గ్రేడ్ అయ్యి స్మార్ట్ ఫోన్ లు గా రూపాంతరం చెందాక ఇవి అందిస్తున్న సేవలు మరింత విస్తృతంగా మారాయి. కంప్యూటర్ తో సమానంగా ఈ స్మార్ట్ ఫోన్ ల పనితీరు ఉంటుంది. వీటిద్వారా మీరు కాల్ చేయవచ్చు, SMS, పంపవచ్చు, ఇంటర్ నెట్ ఉపయోగించవచ్చు, వీడియో కాల్ లను చేయవచ్చు, ఇంకా చాలా చాలా చేయవచ్చు.

ఈ ఫోన్ లను మనం రెండు రకాలుగా కొనవచ్చు. ఒకటి ఆన్ లైన్ మరియు రెండవది ఆఫ్ లైన్. ఆఫ్ లైన్ అంటే మనం సాధారణంగా షాప్ కి వెళ్లి కొనే పద్దతిని ఆఫ్ లైన్ అంటారు. ఇక ఆన్ లైన్ విషయానికొస్తే ఇంటర్ నెట్ ఆధారంగా పనిచేసే ఈ కామర్స్ వెబ్ సైట్ లు అనేకం నేడు అందుబాటులోనికి వచ్చాయి. ఇక్కడ మీకు నచ్చిన మోడల్ లో ఉన్న ఫోన్ ను మీరు సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇస్తే చాలు అది మీ ఇంటికే వచ్చి చేరుతుంది. షాప్ కి వెళ్లి కొనడం అనేది ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయ్యింది. ప్రతీ ఒక్కరూ ఆన్ లైన్ లోనే ఫోన్ లను ఆర్డర్ ఇస్తున్నారు. అంతేకాదు కొన్ని ఫోన్ ల లేటెస్ట్ మోడల్ లు అయితే కేవలo ఆన్ లైన్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అమజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి అనేక ఈ కామర్స్ కంపెనీలు ప్రస్తుతం ఆన్ లైన్ లో వివిధ రకాల మోడల్ ల ఫోన్ లను అందిస్తున్నాయి.

ఇలా ఆన్ లైన్ లో ఫోన్ లను కొనడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.

 

1. అనేక రకాల అవకాశాలు ( ఎంపికలు )

మోడల్, ధర, డిజైన్ ఇలా ఏ రకంగా చూసుకున్నా అనేక రకాల అవకాశాలు మన కళ్ళముందు ఉంటాయి. వీటిలో మనకు నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం ఏదైనా షాప్ కి వెళ్ళాం అనుకోండి. అక్కడ ఉన్న ఫోన్ లలో ఒక్కోదాని గురించి వారు వివరించడానికి కనీసం 10 నిమిషాల సమయం పడుతుంది, కాబట్టి మనం ఎక్కువ ఫోన్ లను చూసే అవకాశం ఉండదు. అదే ఆన్ లైన్ లో అయితే ప్రతీ ఫోన్ తో పాటు దానిలో ఉండే ఫీచర్ లు మరియు విశిష్టత లు అక్కడ కనిపిస్తాయి. వాటిని చూసి మనకు నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అతి తక్కువ సమయం లోనే వీలైనన్ని ఎక్కువ మోడల్ లను చూడవచ్చు. అంతేగాక మీరు ఎంచుకున్న ఫోన్ యొక్క ధర వివిధ రకాల వెబ్ సైట్ లలో ఎలా ఉంటుంది అని పోల్చి చూసుకునే అనేక రకాల వెబ్ సైట్ లు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. అంటే మీరు ఇంట్లో కూర్చుని షాపింగ్ చేసేయవచ్చు. ఇదే ఆఫ్ లైన్ చేయాలంటే ప్రతీ షాప్ తిరగవలసి వస్తుంది. కాబట్టి ఆన్ లైన్ లో ఫోన్ లు కొనేటపుడు మనకు అనేక రకాల ఎంపికలు అందుబాటులో ఉంటాయి.

 

2. ఆకర్షణీయమైన ఆఫర్ లు

సాధారణంగా మొబైల్ షాప్ లలో అయితే ఏ పండగకో లేక సీజన్ ను బట్టో ఆఫర్ లు ఉంటాయి. కానీ ఆన్ లైన్ లో మాత్రం నిరంతరం ఏవో ఒక ఆఫర్ లు ఉంటూనే ఉంటాయి. దాదాపు ప్రతీ ఉత్పత్తిపై కనీసం 25 శాతం తగ్గింపుతో అనేకరకాల ఫోన్ లు లభిస్తాయి. అంతేకాదు SBI డెబిట్ కార్డు, HDFC కార్డు లాంటి వాటిని ఉపయోగించి షాపింగ్ చేస్తే అదనపు డిస్కౌంట్ లు కూడా ఉంటాయి. అంటే తక్కువ సమయం లోనే మనకు నచ్చిన మొబైల్ ఫోన్ ను ఆకర్షణీయమైన ధర లో పొందవచ్చు అన్నమాట.

 

3. త్వరగా చేరడం

ప్రముఖ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను అంటే లేటెస్ట్ ఫోన్ లను లాంచ్ చేసినపుడు అవి షాప్ లకు చేరడానికి చాలా సమయం పడుతుంది. అయితే లాంచ్ చేసిన వెంటనే ఆన్ లైన్ లో అందుబాటులోనికి వచ్చేస్తాయి. మీరు ఎదురుచూడవల్సిందల్లా అది మీ ఇంటికి ఎప్పుడు చేరుతుందా అని మాత్రమే! కేవలం ఒక్క రోజులోనే డెలివరీ చేసే అనేక ఈ కామర్స్ సైట్ లు నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య కూడా లేదు.

 

4. సులభతరం

ఆన్ లైన్ కొనుగోలు వలన కలిగే అతిపెద్ద లాభాలలో ఇది ప్రముఖమైనది. అవును ఆఫ్ లైన్ షాపింగ్ తో పోలిస్తే ఆన్ లైన్ షాపింగ్ చాలా సులువుగా ఉంటుంది.  మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనకు ఏదైనా ఫోన్ కావాలి అనుకుంటే షాప్ కి వెళ్లి అక్కడ ఉన్న అనేక మోడల్ లను చూసి అక్కడ ధర నచ్చకపోతే మరొక షాప్ కి వెళ్లి అక్కడ కూడా ఈ తతంగం అంతా చేసే బదులు కేవలం మీరు ఇంట్లో కూర్చుని మీ స్మార్ట్ ఫోన్ ను లేదా కంప్యూటర్ ను ఓపెన్ చేసి ఒక్క క్లిక్ తో మీకు కావలసిన దానిని ఆర్డర్ ఇవ్వడం అంటే చాలా సులువు అయినట్లే కదా! మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ల ద్వారా , నెట్ బ్యాంకింగ్, ఈ వాలెట్ ల ద్వారా చెల్లించవచ్చు. ఇప్పుడు చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే వస్తువు మీ ఇంటికి వచ్చిన తర్వాతే డబ్బు చెల్లించే పద్దతి అన్నమాట. కాకపోతే దీనికి స్వల్ప స్థాయిలో అదనపు ఛార్జ్ లు ఉంటాయి. అది కూడా కొంచెం ఆలస్యం గా మీ ఇంటికి చేరుకునే అవకాశం ఉంది.

 

5. రిఫండ్ మరియు రిటర్న్ లు సులభం

మీరు ఆన్ లైన్ లో ఏదైనా ఫోన్ కొన్నారు అనుకోండి. అది మీకు నచ్చలేదు. మీరు ఏ వెబ్ సైట్ లో అయితే కొన్నారో ఆ వెబ్ సైట్ లోనికి వెళ్లి రిటర్న్ మరియు రిఫండ్ పాలసీ పై క్లిక్ చేసి దానిని పూర్తీ చేస్తేచాలు. మీ ఇంటికి ఫోన్ ఎలాగైతే వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. మీరు చెల్లించిన డబ్బులు కూడా అలాగే తిరిగి చెల్లిస్తారు.

ఇవి మాత్రమే కాక ఇంకా అనేక రకాల ఉపయోగాలు ఈ ఆన్ లైన్ షాపింగ్ వలన ఉంటాయి. కాబట్టి ఇంకా మీరు ఆన్ లైన్ షాపింగ్ కు అలవాటు పడకపోతే వెంటనే మొదలుపెట్టండి. ఇప్పటికే ప్రారంభించారా? మీ ఊపుని కొనసాగించండి.

 

జన రంజకమైన వార్తలు