• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో కాస్మెటిక్స్ కొంటున్నారా? అయితే, ఒకసారి ఈ ఆర్టికల్ చదవండి

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ స్టోర్లలో నకిలీ కాస్మెటిక్స్ అమ్ముతున్నట్లు ఫిర్యాదులు రావడంతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆ రెండు భారీ కంపెనీలతోపాటు ఇండియామార్ట్ సంస్థకూ నోటీసులు జారీచేసింది. వీటిపై 10 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. పండుగల సీజన్ నేపథ్యంలో భారీ అమ్మకాలకు రెండు ఈ-కామర్స్ దిగ్గజాలు వేదికలైన తరుణంలో ఈ పరిణామం వాటికి శరాఘాతమే అనడంలో సందేహం లేదు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా నకిలీ కాస్మెటిక్స్
పండుగ అమ్మకాల ప్రారంభానికి ముందు దేశంలోని వివిధ ప్రాంతాల్లోగల రెండు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థల గోడౌన్లు, రవాణా కూడళ్లకు భారీ ఎత్తున సరుకులు వచ్చాయి. ఈ నేపథ్యంలో DCGI అధికారులు అక్టోబరు 5 ,6 తేదీల్లో ఆయా గోడౌన్లను సోదా చేశారు. ఈ సందర్భంగా నకిలీ, ప్రమాదకర, దిగుమతి చేసుకున్న కల్తీ కాస్మెటిక్ ఉత్పత్తులను అధికారులు కనుగొన్నారు. తదనుగుణంగా ఆ రెండు దిగ్గజ సంస్థలకు నోటీసులు జారీచేశారు. ‘‘మీకు జారీ చేస్తున్న ఈ నోటీసులకు గడువులోగా మీరు సమాధానం ఇవ్వని పక్షంలో మీరు సంజాయిషీ ఇవ్వగలిగే పరిస్థితిలో లేరని పరిగణించి మీపై సముచిత చర్యలు తీసుకోబడతాయి’’ అని DCGI ఈశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ-CDSCO కింద పనిచేసే DCGI ద్వారానే నిర్దిష్ట వర్గీకరణ కిందకు వచ్చే ఔషధాల (రక్తం, రక్తంతో ముడిపడిన ఉత్పత్తులు IV ఫ్లూయిడ్స్, వ్యాక్సిన్స్)కు అనుమతులు, లైసెన్సులు లభిస్తాయి.
ఉల్లంఘించిన నిబంధనలేమిటి?
   నేక కాస్మెటిక్ ఉత్పత్తులపై సంబంధిత తయారీ లైసెన్స్ వివరాలు ముద్రించలేదు. ఈ కారణంగా వీటిని భారతదేశంలో ఎక్కడా విక్రయించే వీల్లేదు. అంతేకాకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వీటి తయారీకోసం ఉపయోగించిన ముడి పదార్థాల వివరాలూ లేవు. 
   లాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లూ సున్నా. వాస్తవానికి వాటి తయారీలో వాడిన కొన్ని పదార్థాలు భారత ప్రమాణాల సంస్థ (BIS) నిర్దేశించిన ‘‘నెగటివ్ లిస్ట్’’లో ఉన్నందున వాటిని భారతదేశంలో వాడటానికి చట్టం అనుమతించదు.
   డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం... దిగుమతి చేసుకున్న కాస్మెటిక్ ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. అలాగే భారతదేశంలో తయారైన కాస్మెటిక్ ఉత్పత్తులపై చెల్లుబాటయ్యే లైసెన్స్ వివరాలు ముద్రించి ఉండాలి.
   భారత ప్రమాణాల సంస్థ (BIS) నిర్దేశించిన ప్రమాణాలకు సదరు కాస్మెటిక్ ఉత్పత్తులు లోబడి ఉండాలి. ప్రమాణాల సంస్థ ప్రకటించిన ‘నెగటివ్ లిస్ట్’లోని ముడిపదార్థాలను వాటిలో వాడి ఉండకూడదు.
స్పందించిన అమెజాన్; ఫ్లిప్‌కార్ట్‌ మౌనం
అమెజాన్ తనకు అందిన నోటీసులపై స్పందించింది. తమది విక్రయ వేదికేనని, అయినప్పటికీ తమ వేదికద్వారా నకిలీ కాస్మెటిక్స్ అమ్మకానికి ప్రయత్నించిన విక్రేతలపై చర్యలు తీసుకుంటామని DCGIకి పంపిన సంజాయిషీలో వెల్లడించింది. అలాగే ‘‘వినియోగదారుల అనుభవానికి సంబంధించి మేం పాటిస్తున్న ప్రమాణాలు అత్యున్నతం. అందువల్ల చట్టవిరుద్ధ, నకిలీ ఉత్పత్తులు విక్రయించే అమ్మకందారులపై అందే ఫిర్యాదుల ఆధారంగా కఠినచర్యలు తీసుకుంటాం’’ అని అమెజాన్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, ఫ్లిప్‌కార్ట్‌ మాత్రం గత శుక్రవారందాకా స్పందించలేదు. కాగా, ఒక నివేదిక ప్రకారం... ఈ-కామర్స్ వేదికలలో అమ్మే విలాసవంతమైన ఉత్పత్తులలో 25 శాతం నకిలీవేనని, ఆయా స్టోర్లనుంచి కొనేవారిలో 30 శాతం వినియోగదారులు వీటిబారిన పడుతున్నారని సమాచారం. ఏదిఏమైనా ఇలాంటి నకిలీ ఉత్పత్తుల బెడదను వదిలించడంపై ఆయా పోర్టళ్లు సముచిత చర్యలు చేపట్టాలన్నది నిర్వివాదాంశం కాగా, అవి కూడా సముచితంగా స్పందించాలన్నది వినియోగదారుల డిమాండ్.

జన రంజకమైన వార్తలు